అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడాలని కలలు కనే భారతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త ఇది! అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి ఇచ్చే వర్క్ పర్మిట్ కోసం ఏకంగా ఒక లక్ష డాలర్ల రుసుము (దాదాపు రూ. 95.3లక్షలు) వసూలు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన గనుక అధికారిక ముద్ర వేసుకుంటే, భారతీయ విద్యార్థులు అమెరికాలో కెరీర్ నిర్మించుకోవడానికి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం మూతపడినట్లే అని నిపుణులు చెబుతున్నారు.

'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన కథనం ప్రకారం.. యూఎస్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు "ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్" (ఓపీటీ) అనే వర్క్ పర్మిట్‌పై ఆరు అంకెల మొత్తాన్ని (లక్ష డాలర్లు) ఫీజుగా విధిస్తే ఎలా ఉంటుంది? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వైట్ హౌస్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, కోట్లు ఖర్చు పెట్టి పిల్లలను అమెరికా పంపుతున్న లక్షలాది భారతీయ కుటుంబాల్లో ఈ వార్త తీవ్ర అలజడి సృష్టిస్తోంది.
అసలు ఏంటీ ఓపీటీ? ఎందుకింత ప్రాధాన్యం?
సాధారణంగా అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు వేరే వర్క్ వీసాతో సంబంధం లేకుండా ఏడాది పాటు అక్కడే పనిచేసుకోవడానికి ‘ఓపీటీ’ అవకాశం కల్పిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) కోర్సులు చేసిన విద్యార్థులకు ఈ గడువు మరో రెండేళ్లుదనంగా లభిస్తుంది. అంటే కంప్యూటర్ సైన్స్ చదివిన ఒక భారతీయ విద్యార్థి కేవలం ఓపీటీ ప్రాతిపదికన మూడేళ్ల పాటు అమెరికా కంపెనీల్లో పనిచేయవచ్చు.
తరగతి గది నుంచి ఉద్యోగంలోకి మారడానికి, ఆ తర్వాత అత్యంత కీలకమైన 'హెచ్-1బీ' వీసా సంపాదించడానికి ఈ ఓపీటీ ఒక నిచ్చెనలా ఉపయోగపడుతుంది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఈ నిచ్చెన ఎక్కాలంటేనే అభ్యర్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చదువు కోసం, నివాస ఖర్చుల కోసం భారీగా అప్పులు చేసిన సగటు భారతీయ కుటుంబాలకు ఇది ఏమాత్రం భరించలేని భారం.
వీసా నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయమని అధికారులు చెబుతున్నప్పటికీ, నిజమైన ప్రతిభావంతులను అమెరికాకు దూరం చేయడమే అవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు.
హెచ్-1బీ తర్వాత.. ట్రంప్ వేసిన రెండో దెబ్బ!
{{/usCountry}}వీసా నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయమని అధికారులు చెబుతున్నప్పటికీ, నిజమైన ప్రతిభావంతులను అమెరికాకు దూరం చేయడమే అవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు.
హెచ్-1బీ తర్వాత.. ట్రంప్ వేసిన రెండో దెబ్బ!
{{/usCountry}}ట్రంప్ ప్రభుత్వం లక్ష డాలర్ల బాంబు పేల్చడం ఇది మొదటిసారేమీ కాదు. ఈ ఏడాదే మొదట్లో కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై కూడా లక్ష డాలర్ల రుసుమును విధించారు. అమెరికన్ టెక్ కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్-1బీని విస్తృతంగా వాడుతాయి. అయితే ఈ వీసాలు పొందుతున్న వారిలో 75 శాతానికి పైగా భారతీయులే కావడం గమనార్హం.
కాగా, హెచ్-1బీ ఫీజుపై ఐటీ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బోస్టన్‌లోని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు గత వారమే ఆ నిర్ణయంపై స్టే విధించింది. కోర్టు దెబ్బతో వెనక్కి తగ్గిన అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఓపీటీ రూపంలో రెండో మార్గాన్ని ఎంచుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భారతీయులపైనే తీవ్ర ప్రభావం ఎందుకు?
ఈ కొత్త నిబంధనల వల్ల ప్రపంచంలో ఏ దేశం కంటే కూడా భారతీయ విద్యార్థులే అత్యధికంగా నష్టపోతారు. ఆ మధ్య వచ్చిన 'ఓపెన్ డోర్స్' నివేదిక ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 3.63 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ యూనివర్సిటీల్లో చేరారు. చైనాను కూడా దాటేసి అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో మనవారే అగ్రస్థానంలో (సుమారు 33 శాతం) ఉన్నారు.
వీరిలో 40 శాతానికి పైగా విద్యార్థులు ఓపీటీ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. మన విద్యార్థుల లెక్క చాలా స్పష్టం: ఇండియాలో భారీగా విద్యా రుణాలు తీసుకోవడం, అమెరికాలో చదువు పూర్తయ్యాక ఓపీటీ ద్వారా కొన్నాళ్లు పనిచేసి డాలర్లలో జీతం సంపాదించి ఆ అప్పులన్నీ తీర్చేయడం! కానీ, వర్క్ పర్మిట్ కోసమే రూ. 95 లక్షలు కట్టాల్సి వస్తే ఈ లెక్కలన్నీ తలకిందులవుతాయి.
ఇకపై గమ్యస్థానం మారనుందా?
అమెరికాలో క్రమంగా కఠినతరం అవుతున్న వీసా నిబంధనల వల్ల భారత విద్యార్థుల సంఖ్య ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు మధ్య కాలంలో కొత్తగా చేరే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 45 శాతం పడిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీసా ఇంటర్వ్యూలలో జాప్యం, కఠిన తనిఖీలే ఇందుకు కారణం.
ఈ పరిస్థితుల్లో ఓపీటీ ఫీజుల మోత కూడా తోడైతే, భారతీయులు అమెరికాకు ప్రత్యామ్నాయంగా కెనడా, బ్రిటన్, జర్మనీ లేదా ఆస్ట్రేలియా వైపు చూసే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.