...
...
Next Story

NEET UG 2026 : విద్యార్థులకు అగ్నిపరీక్ష- నేడే నీట్​ యూజీ రీ-ఎగ్జామ్.. ఎన్టీఏ భారీ ఏర్పాట్లు

NEET UG 2026 updates : పేపర్ లీక్ వివాదంతో రద్దయిన నీట్ యూజీ పరీక్ష నేడు (జూన్ 21) దేశవ్యాప్తంగా మళ్లీ జరగనుంది. 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షను కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ కెమెరాలు, ఏఐ నిఘా మధ్య నిర్వహించేందుకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేసింది.

Published on: Jun 21, 2026, 05:35:20 IST
Advertisement

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే 'నీట్ యూజీ 2026' పునఃపరీక్షకు సమయం ఆసన్నమైంది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో గత నెల (మే 3) జరిగిన పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు, గత నెల రోజులుగా అనుభవించిన తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనలను పక్కనబెట్టి విద్యార్థులు నేడు (ఆదివారం, జూన్ 21) మళ్లీ పరీక్ష రాయబోతున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. ఈసారి ఎలాంటి లోపాలు జరగకుండా పరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధమైంది.

థానేలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద శనివారం జరిగిన మాక్ డ్రిల్.. (Photo by Praful Gangurde / Hindustan Times)
థానేలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద శనివారం జరిగిన మాక్ డ్రిల్.. (Photo by Praful Gangurde / Hindustan Times)

పరీక్షకు ఒక్క రోజు ముందు శనివారం సాయంత్రం ఎన్టీఏ అధికారులు భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈసారి అక్రమాలకు తావులేకుండా రికార్డు స్థాయిలో 51,311 జామర్లు, 1,38,560 సీసీటీవీ కెమెరాలను రంగంలోకి దించారు. వీటితో పాటు అదనపు సిబ్బందిని కూడా పరీక్షా కేంద్రాల వద్ద మోహరించారు.

నీట్​ యూజీ 2026 రీ- ఎగ్జామినేషన్ : మునుపెన్నడూ లేని విధంగా ఏఐ నిఘా..

ఈసారి పరీక్షా కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఎన్టీఏ పూర్తిగా ఆధునీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 95,000 పరీక్షా గదుల్లో ప్రతి ఒక్క గదిలోనూ సీసీటీవీ కెమెరాను అమర్చారు. అలాగే ప్రతి గదికి ఇద్దరు ఇన్విజిలేటర్లను కేటాయించారు. పరీక్షా కేంద్రాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు ఉంటే వాటిని వెంటనే గుర్తించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ సహాయంతో సీసీటీవీ ఫుటేజీని లైవ్‌లో విశ్లేషిస్తున్నారు. కేంద్రాల వద్ద ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి 6,700 మంది అబ్జర్వర్లతో పాటు, ఆన్‌లైన్ ద్వారా లైవ్ ఫీడ్‌ను పరిశీలించేందుకు 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వర్లను కూడా నియమించారు.

నీట్​ యూజీ 2026 రీ- ఎగ్జామినేషన్ : తనిఖీల్లో కఠిన నిబంధనలు..

నీట్ పరీక్ష ముగిసిన తర్వాత సమాధాన పత్రాలను భద్రపరచడానికి ఎన్టీఏ పక్కా ప్రణాళికను రూపొందించింది. దేశవ్యాప్తంగా సుమారు 1,500 కస్టోడియన్ బ్యాంక్ బ్రాంచ్‌లలో బ్యాంక్ అధికారులు నిరంతరం పహారా కాస్తున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే దాదాపు 700 కేంద్రాల నుంచి ఓఎంఆర్ షీట్లను సురక్షితంగా సేకరించే బాధ్యతను భారత తపాలా శాఖ తీసుకుంది.

నీట్​ యూజీ 2026 రీ- ఎగ్జామినేషన్ : కదిలిన అధికార యంత్రాంగం..

ఈ నీట్​ యూజీ 2026 రీ- ఎగ్జామినేషన్ నిర్వహణ కోసం రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలతో పాటు పోలీసులు, పారామిలటరీ దళాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, తపాలా శాఖ రంగంలోకి దిగాయి. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద దాదాపు 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బందిని కాపలా ఉంచారు. జూన్ 20 (శనివారం) నాడే దేశవ్యాప్తంగా ఒక ముందస్తు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో సీసీటీవీలు, జామర్లు, బయోమెట్రిక్ పరికరాల పనితీరును, తనిఖీ విధానాలను అధికారులు క్షుణ్ణంగా పరీక్షించారు.

నీట్​ యూజీ 2026 రీ- ఎగ్జామినేషన్ : విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు..

ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున, విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ సేవలు, నీడ ఉండేలా వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. సమయం చూసుకోవడానికి గదుల్లో వాల్ క్లాకులు, రఫ్ వర్క్ కోసం అదనపు పేజీలను అందుబాటులో ఉంచారు. ఎడమచేతి వాటం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. తనిఖీ ప్రక్రియల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండటానికి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే సమయాన్ని కూడా పొడిగించారు.

ఈ పునఃపరీక్షకు ముందు ఎలాంటి పేపర్ లీకేజీలు జరగలేదని ఎన్టీఏ స్పష్టంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను, నకిలీ ప్రశ్నపత్రాల లీక్ క్లెయిమ్‌లను ఏజెన్సీ నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని కోరింది.

నేటి మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ (ఆఫ్‌లైన్) మోడ్‌లో ఈ నీట్ యూజీ రీ-ఎగ్జామ్ జరగనుంది. భారతదేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks