NEET UG 2026 : రేపే నీట్ యూజీ రీ-ఎగ్జామ్.. నిఘా నీడలో పరీక్ష, ఎన్టీఏ భారీ ఏర్పాట్లు
NEET UG 2026 updates : జూన్ 21న (ఆదివారం) జరగబోయే నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌ను అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిఘా పెంచింది. పూర్తి వివరాలు..
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదం తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జూన్ 21న నిర్వహించబోయే నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ కోసం సర్వసన్నద్ధమైంది. ఈసారి పరీక్ష అత్యంత సురక్షితంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జరిగేలా బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2 లక్షల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ అథెంటికేషన్, జీపీఎస్ ఆధారిత రవాణా వంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది.

ఈ పెన్ అండ్ పేపర్ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. భారతదేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ రీ-టెస్ట్‌కు దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
నీట్ యూజీ 2026 రీ టెస్ట్- రంగంలోకి 2 లక్షల మంది సిబ్బంది!
దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను సజావుగా నిర్వహించడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు, పరిపాలనా యంత్రాంగాలతో ఎన్టీఏ సమన్వయం చేసుకుంటోంది.
ఇందుకోసం చేసిన ఏర్పాట్లు :
నగరాల వారీగా పర్యవేక్షణ కోసం 674 మంది సిటీ కోఆర్డినేటర్లు
పరీక్షా కేంద్రాల్లో స్వతంత్ర పర్యవేక్షణ కోసం 6,669 మంది అబ్జర్వర్లు
ప్రతి పరీక్షా కేంద్రంలో సెంటర్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు
అత్యంత గోప్యంగా ఉంచాల్సిన పరీక్షా పత్రాల రక్షణ కోసం జిల్లా యంత్రాంగాలు, పోలీసు బలగాలు, ప్రత్యేక ఎస్కార్ట్ బృందాలు
ఈ భారీ యంత్రాంగం సాయంతో 22.79 లక్షల మంది అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది.
నీట్ యూజీ 2026 రీ టెస్ట్- బహుళ అంచెల నిఘా వ్యవస్థ..
పరీక్షలో పారదర్శకతను కాపాడేందుకు ఎన్టీఏ ఈ కింది కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది:
పరీక్షా పత్రాలు, సామగ్రిని సీల్డ్ ప్రోటోకాల్స్ ప్రకారం అత్యంత సురక్షితంగా తరలించడం.
పరీక్షా సామగ్రిని తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ అమర్చడంతో పాటు పోలీసు ఎస్కార్ట్ రక్షణ కల్పించడం.
అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసి, ఆ విజువల్స్ అన్నింటినీ సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించడం.
అభ్యర్థులను లోపలికి అనుమతించే ముందు మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం.
గుర్తింపు తారుమారు కాకుండా నిరోధించడానికి బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి చేయడం.
మరోవైపు, పరీక్షకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను అడ్డుకోవడానికి ఎన్టీఏ ప్రత్యేక నిఘా పెట్టింది. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ), సైబర్ క్రైమ్ అధికారులు, సీబీఐకి ఇప్పటికే ఫిర్యాదులు చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
నీట్ యూజీ 2026 రీ టెస్ట్- బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వకపోతే?
సాంకేతిక లోపాలు, వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం లేదా యూఐడీఏఐ కనెక్టివిటీ సమస్యల వల్ల ఏదైనా కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి కాకపోతే, వారిని పరీక్ష రాయకుండా ఆపబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది.
అలాంటి అభ్యర్థులు నీట్ యూజీ 2026 రీ టెస్ట్ పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ లేదా అబ్జర్వర్ వద్ద అందుబాటులో ఉండే ఫార్మాట్‌లో ఒక లిఖితపూర్వక హామీ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారిని పరీక్షకు అనుమతిస్తారు. వారి ఒరిజినల్ ఐడీ కార్డుల ద్వారా మాన్యువల్‌గా గుర్తింపును వెరిఫై చేస్తారు.
నీట్ యూజీ 2026 రీ టెస్ట్- రిపోర్టింగ్ టైమ్.. గేట్లు మూసే సమయం ఇదే!
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 గంటలకు నీట్ యూజీ 2026 పరీక్షా కేంద్రం ప్రధాన ద్వారాలను పూర్తిగా మూసివేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలికి అనుమతించరు.
సమయానికి లోపలికి వెళ్లడానికి అభ్యర్థులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి:
సాంప్రదాయ లేదా మతపరమైన దుస్తులు, ఫుల్ హ్యాండ్స్ దుస్తులు, ఉన్ని దుస్తులు ధరించి వచ్చే వారు తనిఖీల కోసం చాలా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డ్‌లో ఇచ్చిన పరీక్షా కేంద్రం అడ్రస్‌ను ముందే సరిచూసుకోవాలి. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ వంటి అప్లికేషన్లు తప్పుడు లొకేషన్లు చూపే ప్రమాదం ఉంది.
పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్, ఒక ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్, అటెండెన్స్ షీట్ పై అంటించడానికి రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
నీట్ యూజీ 2026 రీ టెస్ట్- అభ్యర్థులకు కీలక సూచనలు
ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికంటే ముందే సెంటర్‌కు చేరుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న డ్రెస్ కోడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, పర్సులు, నగలు, మెటాలిక్ యాక్సెసరీస్, తినుబండారాలను పరీక్షా హాల్లోకి అనుమతించరు.
కేవలం నీట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పేపర్ లీక్ వంటి వదంతులను నమ్మి మోసపోవద్దని ఎన్టీఏ సూచించింది. ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఎన్టీఏ ఆకాంక్షించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


