...
...
Next Story

Stock market : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను భయపెడుతున్న ‘అక్టోబర్’ హిస్టరీ! ఈసారి భారీ క్రాష్ తప్పదా?

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిది వారాల నష్టాలతో అక్టోబర్ నెలలోకి అడుగుపెట్టాయి. చారిత్రక బ్లాక్ మండే, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వంటి దారుణ నష్టాల రికార్డు ఉన్న అక్టోబర్ మాసంలో మార్కెట్ల పనితీరు, గత పదేళ్ల గణాంకాలపై ప్రత్యేక విశ్లేషణ..

Published on: Oct 3, 2026, 12:20:08 IST
Advertisement

భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త “ప్రతికూల” రికార్డుతో అక్టోబర్ నెలలోకి అడుగుపెట్టాయి. నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ నిఫ్టీ, బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ సెన్సెక్స్ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా ఎనిమిది వారాల పాటు నష్టాలను మూటగట్టుకున్నాయి. గత 25 సంవత్సరాల స్టాక్ మార్కెట్ చరిత్రలో సూచీలు వరుసగా ఎనిమిది వారాల పాటు క్షీణించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గురువారం నాటి ట్రేడింగ్‌లో నమోదైన భారీ పతనంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడు అక్టోబర్ నెల రికార్డు అత్యంత దారుణంగా ఉండటం ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్న మరో అంశం. గ్లోబల్ ఇన్వెస్టర్లకు 'అక్టోబర్' అనగానే గుర్తుకొచ్చే చారిత్రక మార్కెట్ క్రాష్‌లే ఇందుకు ప్రధాన కారణం.

అక్టోబర్ నెలకు ఉన్న 'స్టాక్ క్రాష్' చరిత్ర..

అక్టోబర్​లో మరింత క్రాష్?
అక్టోబర్​లో మరింత క్రాష్?

ప్రపంచ రికార్డులను తిరగేస్తే, అక్టోబర్ నెల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది! ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసిన అతిపెద్ద మార్కెట్ పతనాలు చాలావరకు ఈ నెలలోనే చోటుచేసుకున్నాయి.

1. బ్లాక్ మండే (1987):

స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా 1987 అక్టోబర్ 19ని పేర్కొంటారు. ఆ రోజున అమెరికాకు చెందిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఒక్కరోజే దాదాపు 22 శాతం కుప్పకూలింది. ఒకే రోజులో ఈ స్థాయిలో (శాతం పరంగా) పడిపోవడం అమెరికా మార్కెట్ చరిత్రలో ఇదే ప్రథమం. మీడియా కథనాల ప్రకారం, ఈ ఒక్క రోజు పతనంతోనే యూఎస్ మార్కెట్లో సుమారు 500 బిలియన్ డాలర్ల ఇన్వెస్టర్ల సంపద బూడిదైపోయింది!

2. వాల్ స్ట్రీట్ క్రాష్ (1929):

1929లో వచ్చిన వాల్ స్ట్రీట్ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర మాంద్యంలోకి నెట్టివేసింది. ఆ ఏడాది అక్టోబర్ 28న డౌ జోన్స్ సూచీ 13 శాతం పడిపోయింది. ఆ మరుసటి రోజైన అక్టోబర్ 29న (బ్లాక్ ట్యూస్‌డే) మరో 12 శాతం క్షీణించింది. ఇది ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజులుగా మిగిలిపోయాయి.

అక్టోబర్నిఫ్టీ 50 (%)సెన్సెక్స్ (%)
20160.20%0.23%
20175.59%6.17%
2018-5.00%-4.93%
20193.50%3.78%
20203.50%4.06%
20210.30%0.31%
20225.37%5.78%
2023-2.84%-2.97%
2024-6.22%-5.83%
20254.51%4.57%
View All

2008 అక్టోబర్ నెలలో గ్లోబల్ ఫైనాన్షియల్ సంక్షోభం పరాకాష్టకు చేరింది. అమెరికాలో సబ్‌ప్రైమ్ మార్ట్‌గేజ్ సంక్షోభం, గృహ నిర్మాణ రంగాలు కుప్పకూలడంతో మొదలైన ఈ ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్త మార్కెట్లను కుదిపేసింది. భారత మార్కెట్లపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడింది.

గత పదేళ్లలో నిఫ్టీ, సెన్సెక్స్ ప్రదర్శన ఎలా ఉందంటే..

చారిత్రక భయాలు ఉన్నప్పటికీ, గత పదేళ్ల డేటాను పరిశీలిస్తే భారత స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీ 50 సూచీ అక్టోబర్ నెలల్లో రేంజ్​ బౌండ్ ప్రదర్శన కనబరిచింది. భారీ పతనాలు కాకుండా హెచ్చుతగ్గులతోనే ముగిసింది.

2024 అక్టోబర్: సూచీలు ప్రాఫిట్ బుకింగ్ కారణంగా 6.2 శాతం మేర నష్టపోయాయి.

2022 అక్టోబర్: పండగల సీజన్, కార్పొరేట్ రాబడుల మద్దతుతో నిఫ్టీ 5.4 శాతం మేర లాభపడింది.

2020 - 2019: కరోనా తర్వాత కోలుకునే క్రమంలో, ఆర్థిక ఊరట చర్యల ఫలితంగా 2020 అక్టోబర్‌లో నిఫ్టీ 3.5 శాతం, 2019 అక్టోబర్‌లో 3.5 శాతం చొప్పున సానుకూల వృద్ధిని నమోదు చేసింది.

2021 అక్టోబర్: మార్కెట్లు స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి.

ఈ విశ్లేషణను బట్టి అక్టోబర్ నెలలో ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు స్వీయ ఆర్థిక బలం, పండగల సీజన్ కొనుగోళ్ల ఆధారంగా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, వర్తమాన ఆర్థిక పరిస్థితులు, విదేశీ ఇన్వెస్టర్ల ఉపసంహరణల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks