US Jets crash : ఎయిర్ షోలో ఘోర ప్రమాదం! గాల్లోనే ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు, షాకింగ్ వీడియో..
Jets crash US : అమెరికాలోని ఐడాహోలో జరిగిన ‘గన్‌ఫైటర్ స్కైస్’ ఎయిర్ షోలో ఒక భీకర ప్రమాదం చోటుచేసుకుంది. యుఎస్ నేవీకి చెందిన రెండు ఈఏ-18జీ గ్రోలర్ యుద్ధ విమానాలు గాల్లో ప్రదర్శనలు ఇస్తుండగా ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు పైలట్లు పారాచూట్ సహాయంతో ఇజెక్ట్ అయిపోయారు.
Idaho jets crash : అమెరికాలోని ఐడాహో రాష్ట్రంలో ఆదివారం (మే 17) జరిగిన ‘గన్‌ఫైటర్ స్కైస్’ ఎయిర్ షోలో ఒక భయంకరమైన విమాన ప్రమాదం సంభవించింది. మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు కేవలం రెండు మైళ్ల దూరంలో గాల్లో విన్యాసాలు చేస్తున్న యూఎస్ నేవీకి చెందిన రెండు ‘ఈఏ-18జీ గ్రోలర్స్’ యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం ఆ విమానాలు ఒక్కసారిగా భూమి వైపు దూసుకువస్తూ కూలిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

నలుగురు పైలట్లు సురక్షితం..
విమానాలు గాల్లో ఢీకొన్న వెంటనే అందులోని నలుగురు యూఎస్ నేవీ పైలట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. విమానం భూమిపై పడటానికి ముందే సీట్లలో నుంచి సురక్షితంగా ఇజెక్ట్ అయ్యారు. గాల్లో నాలుగు పారాచూట్లు విచ్చుకుని కిందకు దిగుతున్న దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపించాయి. ప్రమాదం జరిగిన ఒక మైలు దూరంలో ఆ నలుగురు పైలట్లను రెస్క్యూ టీమ్ సురక్షితంగా గుర్తించినట్లు ‘ఐడాహో స్టేట్స్‌మన్’ పత్రిక నివేదించింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :
లాక్‌డౌన్‌లోకి ఎయిర్ బేస్.. మంటల కలకలం:
విమానాలు నేలను తాకగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు
. ప్రమాదం జరిగిన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను అధికారులు తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు. ఎయిర్ బేస్ లోపల ఉన్న ప్రేక్షకులు, సందర్శకులను రెస్క్యూ ఆపరేషన్ ముగిసే వరకు బయటకు వెళ్లవద్దని అక్కడి సిబ్బంది ఆదేశించారు.
ఈ ప్రమాదంపై మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి మాట్లాడుతూ.. బేస్ వెలుపల జరిగిన ఈ విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించామని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
ఎనిమిదేళ్ల తర్వాత జరిగిన ఎయిర్ షో..
యుద్ధ విమానాల విన్యాసాలు, పారాచూట్ జంప్స్, అత్యాధునిక సైనిక సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఈ 'గన్‌ఫైటర్ స్కైస్' ఎయిర్ షోను నిర్వహిస్తారు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రదర్శనను మళ్లీ నిర్వహించిన వేళ ఈ ప్రమాదం జరిగడం గమనార్హం.
ఇంతకుముందు 2018లో జరిగిన ఎయిర్ షోలో కూడా ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ ప్రమాదవశాత్తు మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
కాగా, ఈ మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ అనేది యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ‘గన్‌ఫైటర్స్’ అని పిలిచే 366వ ఫైటర్ వింగ్‌కు ప్రధాన స్థావరం. ఇందులో 389వ ఫైటర్ స్క్వాడ్రన్ థండర్‌బోల్ట్స్, 391వ ఫైటర్ స్క్వాడ్రన్ టైగర్స్, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్‌కు చెందిన 428వ ఫైటర్ స్క్వాడ్రన్ బుకానీర్స్ విభాగాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


