Toyota Fortuner : టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ లాంచ్- ధర, ఫీచర్లు, బుకింగ్స్ వివరాలు..
భారత మార్కెట్లో టయోటా మోటార్స్ సరికొత్త 'ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్' ఎస్‌యూవీని అధికారికంగా లాంచ్ చేసింది. రూ. 36.51 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారులో అదనపు ఫీచర్లు, ప్రీమియం బ్లాక్-అవుట్ డిజైన్‌ను అందించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారత ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’.. తమ పాపులర్ ఎస్‌యూవీలో సరికొత్త ‘2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, మరింత విలాసవంతమైన ఇంటీరియర్ హంగులతో ఈ ప్రత్యేక మోడల్‌ను రూపొందించారు.

ఈ నేపథ్యంలో టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ హైలైట్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్- వేరియంట్లు, ధరలు..
2026 టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇవి రెండూ కూడా 2డబ్ల్యూడీ లేదా 4x2 (రియర్ వీల్ డ్రైవ్) కాన్ఫిగరేషన్‌లోనే లభిస్తాయి:
లీడర్ ఎడిషన్ 4x2 మ్యాన్యువల్ (ఎంటీ): రూ. 36.51 లక్షలు (ఎక్స్-షోరూమ్)
లీడర్ ఎడిషన్ 4x2 ఆటోమేటిక్ (ఏటీ): రూ. 38.72 లక్షలు (ఎక్స్-షోరూమ్)
మాన్యువల్ వర్షన్‌తో పోలిస్తే ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 2.21 లక్షలు ఎక్కువగా ఉంది. సాధారణ ఫార్చ్యూనర్ డీజిల్ మోడళ్లతో పోలిస్తే సుమారు రూ. 1.11 లక్షల అదనపు ధరతో ఈ స్పెషల్ ఎడిషన్ లభిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు అక్టోబర్ 12, 2026 నుంచి టయోటా అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్- ఎక్స్‌టీరియర్ లుక్..
ఈ ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ ప్రధానంగా కాస్మోటిక్ మార్పులతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది:
ఫ్రంట్ గ్రిల్ అండ్ ఎంబ్లామ్: నయా శైలిలో తీర్చిదిద్దిన సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్‌తో పాటు బానెట్‌పై ప్రత్యేకమైన 'Leader Edition' ఎంబ్లామ్‌ను అమర్చారు.
అలాయ్ వీల్స్: గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన అలాయ్ వీల్స్, మ్యాచింగ్ హబ్ క్యాప్స్ ఈ ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.
డ్యూయల్ టోన్ ఫినిష్: డ్యూయల్-టోన్ బ్లాక్ రూఫ్, బ్లాక్ ఫినిషింగ్ ఆంటెన్నా, వెనుక డోర్‌పై బ్లాక్ గార్నిష్, బాడీ-సైడ్ మౌల్డింగ్స్ అందించారు.
రంగుల ఎంపిక: ఈ ఎడిషన్‌ను సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, ఆటిట్యూడ్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో ఎంచుకోవచ్చు.
టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్- క్యాబిన్ కంఫర్ట్, కొత్త టెక్నాలజీ..
లోపలి భాగంలో కస్టమర్లకు మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా ఆకర్షణీయ మార్పులు చేశారు:
బ్లాక్ అండ్ మెరూన్ థీమ్: సీట్లు, డోర్ ట్రిమ్‌లపై నలుపు, మెరూన్ రంగుల కలయికతో కూడిన డ్యూయల్-టోన్ అప్‌హోలిస్ట్రీని అందించారు.
యాంబియంట్ లైటింగ్: రాత్రి వేళ ప్రయాణాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కాక్‌పిట్‌లో యాంబియంట్ లైటింగ్, డోర్ సబ్స్ వద్ద ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లను చేర్చారు.
సేఫ్టీ అండ్ ప్రాక్టికాలిటీ: టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షించే 'టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్' (టీపీఎంఎస్), వాహనాన్ని లాక్ చేసినప్పుడు స్వయంచాలకంగా మడిచేలా ‘ఆటో-ఫోల్డింగ్ ఆటోమేటిక్ సైడ్ మిర్రర్స్’ని ఈ టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌లో ఇచ్చారు.
టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్- ఇంజిన్..
ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం డిజైన్, ఫీచర్లకే పరిమితమైంది. మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో విశ్వసనీయమైన 2.8-లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఇది 204 పీఎస్ గరిష్ఠ పవర్‌ను విడుదల చేస్తుంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో 420 ఎన్ఎం టార్క్ లభించగా, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఏకంగా 500 ఎన్ఎం టార్క్ ఉత్పన్నమవుతుంది. లీడర్ ఎడిషన్‌లో 4x4 (ఫోర్-వీల్ డ్రైవ్) ఆప్షన్ లభించదు.
కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు టయోటా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది:
ఫైనాన్స్ పథకాలు: గరిష్టంగా 7 సంవత్సరాల కాలపరిమితితో కూడిన ఈఎంఐ సదుపాయంతో పాటు 'స్మార్ట్ బెలూన్ ఫైనాన్స్' స్కీమ్‌ను ఇస్తున్నారు.
ఉచిత సేవలు: 5 సంవత్సరాల పాటు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం లభిస్తుంది.
వారంటీ: 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ ఇస్తుండగా, దీనిని 5 సంవత్సరాలు లేదా 2.20 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకునే వెసులుబాటును కల్పించారు.
మరింత స్పష్టమైన స్పోర్టీ లుక్, అదనపు సౌకర్యాలు కోరుకునే ఎస్‌యూవీ ప్రియులకు ఈ 2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


