Mutual fund SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే.. ఎన్నేళ్లు?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం సిప్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. అయితే అసలు ఎన్నేళ్లు పెట్టుబడి పెడితే నష్టభయం ఉండదు? 30 ఏళ్ల సెన్సెక్స్ గణాంకాలను విశ్లేషించిన వైట్ఓక్ క్యాపిటల్ నివేదిక ఆసక్తికర నిజాలను బయటపెట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..
మ్యూచువల్ ఫండ్స్ అనగానే చాలా మంది “లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్” అని అంటారు. అయితే, లాంగ్ టర్మ్ అంటే అసలు ఎన్నేళ్లు? మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని, చేతికి లాభాలు అందాలంటే మూడేళ్లు సిప్ చేస్తే సరిపోతుందా? ఐదేళ్లు ఆగాలా, లేక పదేళ్ల పాటు కొనసాగించాలా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు స్పష్టమైన గణాంకాలతో కూడిన సమాధానాన్ని 'వైట్ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్' తాజా నివేదిక అందించింది.

లార్జ్-క్యాప్ ఫండ్స్ పనితీరును అంచనా వేయడానికి ప్రామాణికంగా నిలిచే ‘బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐ’ సూచీని ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. 1996 ఆగస్టు నుంచి 2026 అక్టోబర్ వరకు అంటే సుమారు మూడు దశాబ్దాల డేటాను విశ్లేషించారు. 3, 5, 8, 10, 12, 15 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితులలో నెలవారీ రోలింగ్ సిప్ రాబడులు ఎలా ఉన్నాయో ఈ నివేదిక లెక్కగట్టింది.
మధ్యతరగతి కుటుంబాలు పిల్లల ఉన్నత చదువులు, సొంతింటి కల కోసం మ్యూచువల్ ఫండ్ సిప్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే మార్కెట్ కాస్త కిందకు పడగానే రెండేళ్లు లేదా మూడేళ్లకే భయపడి సిప్‌లను మధ్యలో ఆపేసే ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి వారికి ఈ 30 ఏళ్ల మార్కెట్ చరిత్ర కనువిప్పు కలిగిస్తుంది.
రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటి? రాబడులను ఎలా పోల్చారు?
వేర్వేరు కాలపరిమితుల్లో సిప్ రాబడులు ఏ విధంగా మారుతున్నాయో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం నెలవారీ రోలింగ్ ఎక్స్ఐఆర్ఆర్ (XIRR) రాబడులను పోల్చి చూసింది. ఒకే తేదీని కాకుండా, ప్రతి నెలా ప్రారంభ తేదీని ఒక నెల ముందుకు జరుపుతూ వరుస పెట్టుబడి కాలాలకు వార్షిక రాబడిని లెక్కించే విధానాన్ని 'రోలింగ్ రిటర్న్స్' అంటారు.
ఉదాహరణకు, 2015 ఏప్రిల్‌లో ప్రారంభించిన మూడేళ్ల సిప్ రాబడిని, 2015 మే నెలలో ప్రారంభించిన మూడేళ్ల సిప్ రాబడితో పోలుస్తారు. ఇలా ప్రతి నెలా లెక్కించడం వల్ల మార్కెట్ ఎగుడుదిగుడులలోనూ పెట్టుబడులు ఎంత స్థిరంగా రాణించాయో మదుపర్లు సులభంగా అర్థం చేసుకోవచ్చు.
| పారామీటర్ | 3 ఏళ్లు | 5 ఏళ్లు | 8 ఏళ్లు | 10 ఏళ్లు | 12 ఏళ్లు | 15 ఏళ్లు |
| గరిష్ఠ రిటర్నులు | 55.56% | 50.05% | 36.00% | 29.80% | 21.72% | 18.18% |
| కనిష్ఠ రిటర్నులు | -24.59% | -9.48% | 3.03% | 4.57% | 6.22% | 7.30% |
| యావరేజ్ రిటర్నులు | 15.35% | 14.93% | 15.85% | 15.46% | 14.51% | 14.11% |
| మీడియన్ రిటర్నులు | 13.94% | 13.27% | 13.89% | 14.17% | 13.92% | 13.96% |
| %పాజిటివ్ రిటర్నుల శాతం | 87% | 92% | 100% | 100% | 100% | 100% |
| 8శాతం కన్నా ఎక్కువ రిటర్నులు | 71% | 81% | 98% | 99% | 100% | 99% |
| 10శాతం కన్నా ఎక్కువ రిటర్నులు | 65% | 73% | 90% | 95% | 98% | 98% |
| 12శాతం కన్నా ఎక్కువ రిటర్నులు | 57% | 60% | 72% | 79% | 76% | 89% |
సోర్సు: WhiteOak Capital Mutual Fund; నెలవారీ సిప్ (% XIRR) బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐ డేటా, ఆగస్టు 1996–అక్టోబర్ 2026.
ఎన్నేళ్లు సిప్ చేస్తే నష్టభయం సున్నాకు చేరుతుంది?
పెట్టుబడి కాలపరిమితి పెరిగే కొద్దీ సానుకూల రాబడులు వచ్చే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ఈ అధ్యయనం తేల్చింది. మూడేళ్ల సిప్ విషయానికొస్తే, పరిశీలించిన మొత్తం కాలాల్లో 87 శాతం సందర్భాల్లో మదుపర్లకు లాభాలు వచ్చాయి; కానీ 13 శాతం సందర్భాల్లో ప్రతికూల రాబడులు (నష్టాలు) ఎదురయ్యాయి. ఇదే సిప్‌ను ఐదేళ్ల పాటు కొనసాగించినప్పుడు లాభాలు వచ్చే అవకాశం 92 శాతానికి పెరిగింది!
అసలు మ్యాజిక్ ఎనిమిదేళ్ల కాలపరిమితి వద్ద మొదలైంది. ఎనిమిదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం (8, 10, 12, 15 ఏళ్లు) సిప్ కొనసాగించినప్పుడు, పరిశీలించిన ప్రతి ఒక్క రోలింగ్ పీరియడ్‌లోనూ అంటే 100 శాతం సందర్భాల్లో సూచీ సానుకూల రాబడులనే అందించింది. కనీస రాబడి గణాంకాలు సైతం ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. మూడేళ్ల సిప్‌లో అత్యల్ప రాబడి మైనస్ 24.59 శాతం (-24.59%) నమోదు కాగా, ఐదేళ్ల సిప్‌లో మైనస్ 9.48 శాతానికి (-9.48%) తగ్గింది. ఎనిమిదేళ్ల కాలపరిమితికి వచ్చేసరికి అత్యల్ప రాబడి కూడా ప్లస్ 3.03 శాతానికి చేరింది. దీర్ఘకాలం వేచి ఉండటం వల్ల స్వల్పకాలిక మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించి, నష్టాల ప్రమాదాన్ని పూర్తిగా తప్పించుకోవచ్చని చరిత్ర నిరూపిస్తోంది.
కాలపరిమితి పెరిగితే సగటు రాబడి కూడా పెరుగుతుందా?
ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే నష్టభయం తగ్గుతుంది కానీ, ప్రతిసారీ సగటు రాబడి పెరుగుతూనే ఉంటుందని అనుకోవడం పొరపాటని నివేదిక స్పష్టం చేసింది. కాలపరిమితి పెరిగే కొద్దీ రాబడులలో స్థిరత్వం పెరిగింది తప్ప, సగటు రాబడి ఒకే స్థాయిలో పెరగలేదు. ఈ అధ్యయనంలో ఎనిమిదేళ్ల సిప్‌కు అత్యధికంగా 15.85 శాతం సగటు రాబడి నమోదైంది. పదేళ్ల సిప్‌కు సగటు రాబడి 15.46 శాతంగా ఉండగా, 15 ఏళ్ల సిప్‌కు 14.11 శాతంగా నమోదైంది.
అదే విధంగా గరిష్ట వార్షిక రాబడి మూడేళ్ల కాలపరిమితిలో 55.56 శాతంగా ఉంటే, 15 ఏళ్ల కాలానికి 18.18 శాతానికి తగ్గింది. తక్కువ కాలపరిమితిలో మార్కెట్ ఒక్కసారిగా దూసుకెళ్లినప్పుడు అసాధారణమైన వార్షిక రాబడులు కనిపిస్తాయి; కానీ కాలం పెరిగే కొద్దీ అలాంటి హెచ్చుతగ్గులన్నీ సర్దుబాటు అవుతాయి. అయితే మధ్యగత (మీడియన్) రాబడులు అన్ని కాలపరిమితుల్లోనూ 13.27 శాతం నుంచి 14.17 శాతం మధ్య ఎంతో స్థిరంగా కొనసాగాయి. (పరిశీలించిన అన్ని కాలాల రాబడుల సరాసరిని 'సగటు రాబడి' అంటారు; రాబడులన్నింటినీ ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో పేర్చినప్పుడు సరిగ్గా మధ్యలో వచ్చే విలువను 'మధ్యగత రాబడి'గా పిలుస్తారు.)
మదుపర్లకు అసలైన పాఠం ఏంటి?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఎనిమిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం సిప్ కొనసాగించడం వల్ల అత్యుత్తమ స్థిరత్వం లభిస్తుందని, చారిత్రక డేటా ప్రకారం నష్టపోయే అవకాశమే లేకుండా పోతుందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే ఏ మదుపరి అయినా తన పెట్టుబడి కాలాన్ని నిర్ణయించుకునే ముందు సొంత ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, డబ్బు అవసరమయ్యే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయడం శ్రేయస్కరం.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


