అఫీషియల్​.. టాటా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు- 2026లోనే లాంచ్​

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2026లో సియెరా ఈవీ, పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్, అవిన్యా వంటి మూడు శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయనుంది. 2030 నాటికి మొత్తం ఐదు కొత్త ఈవీ మోడళ్లను తీసుకురావడమే లక్ష్యంగా కంపెనీ వేసిన ప్రణాళికల్లో ఇవి కీలకంగా మారనున్నాయి.

Published on: Dec 24, 2025, 06:03:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా దూసుకెళుతున్న టాటా మోటార్స్.. ఈవీ మార్కెట్​లో తన పట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు సిద్ధమైంది. 2026 క్యాలెండర్ ఇయర్​లో మార్కెట్లోకి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్​ చేయనున్నట్టు కంపెనీ ఇటీవలే ధృవీకరించింది. ఇందులో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'సీయెరా ఈవీ'తో పాటు పాపులర్ మోడల్ 'పంచ్ ఈవీ' ఫేస్‌లిఫ్ట్, అలాగే ప్రీమియం సెగ్మెంట్‌లో 'అవిన్యా' వంటి ఎలక్ట్రిక్​ కార్లు ఉండనున్నాయి.

2026లో 3 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలను లాంచ్​ చేయనున్న టాటా మోటార్స్​..
2026లో 3 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలను లాంచ్​ చేయనున్న టాటా మోటార్స్​..

టాటా మోటార్స్ తన దీర్ఘకాలిక లక్ష్యాలను వివరిస్తూ.. 2030 నాటికి భారత మార్కెట్లో ఐదు కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పైన పేర్కొన్న మూడు మోడళ్లపై స్పష్టత రాగా, మిగిలిన రెండు మోడళ్ల వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

టాటా సియెరా ఈవీ..

1990 దశకంలో టాప్​ మోడల్​గా నిలిచిన సియెర్రాను రివైవ్​ చేసి, ఇటీవలే రీ-లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. ఈ టాటా సియెర్రాకి కస్టమర్ల నుంచి క్రేజీ డిమాండ్​ లభించింది. ఓపెన్​ అయిన 24 గంటల్లోనే ఈ ఎస్​యూవీ.. 70వేల బుకింగ్స్​తో రికార్డులు సృష్టించింది.

ఈ నేపథ్యంలోనే సియెర్రా ఈవీ కూడా భారీ హిట్​ని సాధిస్తుందని కంపెనీ ఆశలు పెట్టుకుంది.

సాధారణ ఇంజిన్ మోడళ్లలా కాకుండా, సీయెరా ఈవీని ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణ మోడళ్లలో లేని ఈ ఫీచర్.. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లో సీయెరాకు తిరుగులేని ఆధిక్యాన్ని ఇస్తుంది.

ఈ టాటా సియెర్రా ఈవీ 2026 ఏప్రిల్​లోపు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్..

చిన్న సైజులో ఉంటూ, నగర ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే 'పంచ్ ఈవీ' ఇప్పటికే టాటాకు మంచి సక్సెస్ అందించింది. 2026లో దీనికి సరికొత్త హంగులు అద్ది 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్‌ను తీసుకురానున్నారు. హారియర్ ఈవీ స్ఫూర్తితో దీని డిజైన్‌లో మార్పులు చేయనున్నారు. కొత్త లైటింగ్ ఎలిమెంట్స్, బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు మరింత స్టైలిష్‌గా కనిపించనుంది. లోపలి భాగంలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టెమ్, మరిన్ని అత్యాధునిక ఫీచర్లను చేర్చనున్నారు.

టాటా అవిన్యా..

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా మోటార్స్ ప్రదర్శించిన 'అవిన్యా' కాన్సెప్ట్ ఒక ఫ్యూచరిస్టిక్ అద్భుతంలా అనిపిస్తుంది. ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. భారత్‌లో ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అవిన్యాను నేరుగా ఎలక్ట్రిక్ వాహనంగానే రంగంలోకి దించుతున్నారు. ఇది అత్యంత విలాసవంతమైన మోడల్ కావడంతో, దీనిని సాధారణ టాటా షోరూమ్‌లలో కాకుండా ప్రత్యేకమైన రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించనున్నారు. 2026 చివరి నాటికి దీని పూర్తి స్థాయి ప్రొడక్షన్ వెర్షన్‌ని ఆవిష్కరించే అవకాశం ఉంది.

పర్యావరణ హితమైన ప్రయాణమే లక్ష్యంగా టాటా మోటార్స్ వేస్తున్న ఈ అడుగులు.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే 2026 ఏడాది టాటా ఈవీల రాకతో భారత రోడ్లపై కొత్త వెలుగులు నిండటం ఖాయంగా కనిపిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More