...
...
Next Story

Renault Bigster : ఇండియాలోకి మరో 7 సీటర్ ఫ్యామిలీ ఎస్​యూవీ- హైబ్రిడ్​ వర్షెన్​తో రెనాల్ట్ బిగ్​స్టర్!

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ, టాటా సఫారీలకు గట్టి పోటీగా రెనాల్ట్ సంస్థ తమ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ 'బిగ్‌స్టర్'ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్, అడాస్ సేఫ్టీ, ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న ఈ కారు వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 4, 2026, 10:01:03 IST
Advertisement

భారతీయ కుటుంబాలకు విశాలమైన 7-సీటర్ కార్లపై ఉన్న మక్కువను దృష్టిలో ఉంచుకుని ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం ‘రెనాల్ట్’.. ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త రెనాల్ట్ బిగ్‌స్టర్ 7-సీటర్ ఎస్‌యూవీని 2027 నాటికి ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. అంతేకాదు ఈ బిగ్​స్టర్​లో హైబ్రిడ్ వేరియంట్​ కూడా అందుబాటులోకి రానుంది.

రెనాల్ట్​ నుంచి కొత్త 7 సీటర్ ఫ్యామిలీ​ ఎస్​యూవీ..
రెనాల్ట్​ నుంచి కొత్త 7 సీటర్ ఫ్యామిలీ​ ఎస్​యూవీ..

అంతర్జాతీయ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తున్న 'బిగ్‌స్టర్' లేదా 'బోరియల్' మోడల్ ఆధారంగా ఈ 3-రో ఎస్‌యూవీని డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో గుర్తింపు పొందిన 'రెనాల్ట్ డస్టర్'కు ఇది పెద్ద, అత్యంత ప్రాక్టికల్ సిబ్లింగ్​గా మార్కెట్లోకి రానుంది. రగ్గడ్ లుక్, విశాలమైన కేబిన్ స్పేస్, ఇంధన పొదుపునిచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది భారతీయ 7 సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీ కొనుగోలుదారులను ఆకట్టుకోనుంది.

మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుతం మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్ వంటి 7-సీటర్ కార్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసే కుటుంబాలకు, మైలేజ్, ప్రీమియం లుక్ ఇచ్చే ఈ కొత్త రెనాల్ట్ బిగ్‌స్టర్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

రెనాల్ట్ బిగ్​స్టర్ ఎస్​యూవీ ప్లాట్‌ఫామ్, ఎక్స్‌టీరియర్ డిజైన్..

సరికొత్త బిగ్‌స్టర్ 7-సీటర్ ఎస్‌యూవీని రెనాల్ట్ గ్లోబల్ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మిస్తున్నారు. మూడొవ వరుస సీట్లలో కూర్చునే ప్రయాణికులకు తగినంత లెగ్‌స్పేస్, హెడ్‌స్పేస్ అందించడానికి వీలుగా డస్టర్ కంటే దీని పొడవు మరియు వీల్‌బేస్‌ను పొడిగించారు.

ముందు భాగం: రెనాల్ట్ సిగ్నేచర్ గ్రిల్, వై-షేప్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, రగ్గడ్ ఫ్రంట్ బంపర్.

సైడ్ అండ్ రియర్ ప్రోఫైల్: పొడిగించిన వెనుక తలుపులు, బాక్సీ, మస్కులర్ లుక్, వీ-షేప్ టెయిల్ లాంప్స్, థిక్ బోడీ క్లాడింగ్, స్కిడ్ ప్లేట్లు.

వీల్స్ అండ్ రూఫ్ రైల్స్: ఆఫ్‌రోడింగ్, రఫ్ రోడ్లను తట్టుకునేలా 17-అంగుళాలు లేదా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఇందులో లభిస్తాయి.

రెనాల్ట్ బిగ్​స్టర్ ఎస్​యూవీ- శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్..

ఈ 7 సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీని రెండు శక్తివంతమైన ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులోకి తేనున్నారు:

1.8 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్: ఇది 1.8 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్ల (20బీహెచ్​పీ స్టార్టర్-జెనరేటర్, 49బీహెచ్​పీ ట్రాక్షన్ మోటార్) కాంబినేషన్‌తో వస్తుంది. దీనికి 1.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను జతచేశారు. ఈ సెటప్ సంయుక్తంగా 160 హెచ్​పీ పవర్, 172 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మల్టీ-మోడ్ క్లచ్‌లెస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇది లభిస్తుంది.

1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్: ఈ రెనాల్ట్ బిగ్​స్టర్ ఎస్​యూవీ ఇంజిన్ 160 బీహెచ్​పీ పవర్, 270 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ (డీసీటీ) గేర్‌బాక్స్‌లతో జతచేశారు.

రెనాల్ట్ బిగ్​స్టర్ ఎస్​యూవీ- ఇంటీరియర్, ఫీచర్లు..

ఎస్​యూవీ లోపలి భాగంలో డస్టర్ పోలికలు ఉన్నప్పటికీ, 7-సీటర్ మోడల్ కావడంతో మరింత విలాసవంతమైన సౌకర్యాలను అందించనున్నారు!

డిజిటల్ స్క్రీన్స్: వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 10.1-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి.

సీటింగ్ లేఅవుట్: మూడవ వరుసలోకి సులువుగా వెళ్లేందుకు స్ప్లిట్ ఫోల్డింగ్ సెకండ్-రో సీట్లను అందించారు. టాప్ వేరియంట్లలో ప్రత్యేకమైన కెప్టెన్ సీట్లతో కూడిన 6-సీటర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

సౌకర్యాలు: పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు: మల్టీ-ఎయిర్‌బ్యాగ్ సెటప్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ), హిల్-స్టార్ట్ అసిస్ట్, అత్యంత సురక్షితమైన లెవెల్-2 అడాస్ ఉంటాయి.

రెనాల్ట్ బిగ్​స్టర్ ఎస్​యూవీ అంచనా ధర, పోటీ..

రెనాల్ట్ బిగ్‌స్టర్ 7-సీటర్ ఎస్‌యూవీ 2027 ప్రథమార్ధంలో భారత మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశముంది. భారత్‌లో దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 14 లక్షల నుంచి రూ. 24 లక్షల పరిధిలో ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది నేరుగా మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్ వంటి ప్రాచుర్యం పొందిన 7-సీటర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks