Upcoming SUVs : త్వరలోనే రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ లాంచ్- ఇంకొన్ని ఎస్​యూవీలు కూడా!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మళ్లీ పూర్వవైభవం సాధించేందుకు ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ భారీ వ్యూహంతో ముందుకు వస్తోంది. దసరా-దీపావళి పండగ సీజన్ కానుకగా డస్టర్ హైబ్రిడ్‌ను విడుదల చేయడంతో పాటు 2027 నాటికి 7-సీటర్ ఎస్‌యూవీ, బ్రిడ్జర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను దించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

Published on: Sep 22, 2026, 12:20:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల విక్రయాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘రెనాల్ట్’ బిగ్ ప్లాన్‌తో మన ముందుకు వస్తోంది. దేశీయంగా విపరీతమైన ఆదరణ పొందుతున్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకోవడానికి సరికొత్త మోడళ్లను రంగంలోకి దించుతోంది. అందులో భాగంగా పవర్‌ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్, ఐసీఈ, పూర్తి ఎలక్ట్రిక్ (ఈవీ) ఇంజిన్ ఆప్షన్లతో రెండు సరికొత్త ఎస్‌యూవీలను ఇండియన్ రోడ్లపైకి తీసుకొస్తోంది!

ఇండియాలో రెనాల్ట్ కార్ల లైనప్..
ఇండియాలో రెనాల్ట్ కార్ల లైనప్..

దీపావళి కానుకగా రానున్న 'డస్టర్ హైబ్రిడ్'!

రెనాల్ట్ ప్రేమికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పాపులర్ మోడల్ ‘డస్టర్’ ఈ ఏడాది తొలినాళ్లల్లో ఇండియాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల సీజన్ శుభసమయంలో ఈ డస్టర్ హైబ్రిడ్ కారును సైతం కంపెనీ లాంచ్ చేయనుంది. రెనాల్ట్ బ్రాండ్ నుంచి భారత్‌లోకి వస్తున్న తొలి స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనం ఇదే కావడం విశేషం.

7-సీటర్ సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీ..

డస్టర్ హడావుడి ముగిసిన వెంటనే, 2027 ప్రారంభంలో 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో' వేదికగా 3-రో (7-సీటర్) సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీని రెనాల్ట్ ఆవిష్కరించనుంది. గ్లోబల్ మార్కెట్లలో ప్రశంసలు పొందుతున్న 'డాసియా బిగ్​స్టర్', 'రెనాల్ట్ బోరియల్' మోడళ్ల ఆధారంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. సంస్థ సొంతంగా డెవలప్ చేసిన అధునాతన ఆర్‌జీఎంపీ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును డిజైన్ చేస్తున్నారు.

ఇది మార్కెట్లోకి అడుగుపెడితే మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి దిగ్గజ కార్లకు ప్రత్యక్షంగా సవాలు విసరనుంది. సుమారు 4.6 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, 2.74 మీటర్ల భారీ వీల్‌బేస్‌తో రానున్న ఈ కారులో 6-సీటర్ (కెప్టెన్ సీట్లు), 7-సీటర్ సీటింగ్ ఆప్షన్లు అందిస్తున్నారు. పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ డిజిటల్ డిస్ప్లేలు, లెవెల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్లు, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల వంటి లగ్జరీ హంగులను ఇందులో పొందుపరిచారు.

లోకలైజ్డ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ.. మైలేజ్ అదరహో!

యూరోపియన్ ప్రమాణాలతో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సాంకేతికతను రెనాల్ట్ మన దేశానికి తెస్తోంది. భారతీయ కస్టమర్లకు సరసమైన ధరలోనే కారును అందించేందుకు ఈ హైబ్రిడ్ సిస్టమ్‌ను స్థానికంగానే అసెంబుల్ చేస్తున్నారు. 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఏకంగా 160 హార్స్ పవర్ (hp) శక్తిని విడుదల చేస్తుంది. ఇది లీటరుకు సుమారు 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు 163 హార్స్ పవర్ ఇచ్చే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా లభించనుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్‌బాక్స్‌లతో జత చేశారు.

రగ్గడ్ లుక్‌లో 'రెనాల్ట్ బ్రిడ్జర్' లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ!

ఇక 2027 ద్వితీయార్థంలో కాంపాక్ట్ (సబ్-4ఎం) సెగ్మెంట్‌లో ‘రెనాల్ట్ బ్రిడ్జర్’ అనే సరికొత్త లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీని కంపెనీ పరిచయం చేయనుంది. పూర్తిగా భారతదేశంలోనే రూపుదిద్దుకుంటున్న ఈ కారును చెన్నైలోని ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. ఇది మారుతీ సుజుకీ బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా విజన్ ఎస్ మోడళ్లకు పోటీగా నిలవనుంది.

ఈ సబ్‌-4 మీటర్ ఎస్‌యూవీ ద్వారా బ్రాండ్ సరికొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను రంగంలోకి దించుతోంది. భవిష్యత్తులో ఇందులో హైబ్రిడ్, సీఎన్జీ, పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్లను కూడా తేనున్నారు. బాక్సీ షేప్, బ్యాక్ డోర్‌పై స్పేర్ వీల్‌తో రగ్గడ్ డిజైన్‌లో కనిపించే ఈ కారులో ఏకంగా 400 లీటర్ల అత్యధిక బూట్ స్పేస్ కల్పిస్తుండటం గమనార్హం.

మొత్తానికి పెట్రోల్ ధరలు మండుతున్న వేళ పవర్‌తో పాటు మైలేజ్ ఇచ్చే మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెనాల్ట్ వేస్తున్న వేగవంతమైన అడుగులు భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని మరోసారి ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More