పండుగ జరుపుకునేందుకు డబ్బులు లేవు! 53శాతం భారత కుటుంబాల్లో ఆందోళన- సర్వేలో షాకింగ్ విషయాలు..

రాబోయే పండుగ సీజన్‌ వేళ దాదాపు 53 శాతానికి పైగా భారతీయ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, ఆదాయాల్లో వ్యత్యాసాల కారణంగా సామాన్యులు పండుగ కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని సీవోటర్ జాతీయ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

Published on: Oct 10, 2026, 10:45:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాబోయే పండుగ సీజన్‌లో కొత్త వస్తువులు కొనడానికి, ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ, పెరిగిన కుటుంబ ఖర్చులు, ఆర్థిక అనిశ్చితి భారతీయ వినియోగదారుల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి. ముఖ్యంగా భారీ ఖర్చులతో కూడిన వస్తువుల కొనుగోలుకు సామాన్యులు వెనుకంజ వేస్తున్నారని సీవోటర్ నిర్వహించిన జాతీయ సర్వేలో వెల్లడైంది. తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు తమ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతుండగా, ఉన్నత ఆదాయ వర్గాలు మాత్రం భవిష్యత్తుపై ధీమాతో ఉన్నాయని ఈ సర్వే వివరాలు చెబుతున్నాయి.

పండుగ వేళ చేతిలో డబ్బుల్లేక పాయే! (AI-generated )
పండుగ వేళ చేతిలో డబ్బుల్లేక పాయే! (AI-generated )

53 శాతానికి పైగా కుటుంబాల్లో క్షీణించిన ఆర్థిక పరిస్థితి!

సర్వేలో వెల్లడైన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. దేశంలో సగానికి పైగా కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 53.6 శాతం మంది తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి గతేడాదితో పోలిస్తే 'మరింత' క్షీణించిందని తెలిపారు. కేవలం 11.6 శాతం మంది మాత్రమే తమ పరిస్థితి మెరుగైందని పేర్కొనగా, 27.1 శాతం మంది ఎలాంటి మార్పు లేదని చెప్పారు. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో 2,051 మంది ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం..

ఆర్థిక ఒత్తిడి విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 40.6 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని చెబితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఏకంగా 59.2 శాతానికి చేరింది!

రాబోయే ఏడాదైనా పరిస్థితులు చక్కబడతాయా అంటే నిరుత్సాహమే వ్యక్తమవుతోంది. కేవలం 24.4 శాతం మంది మాత్రమే భవిష్యత్తులో పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తుండగా, 38 శాతం మంది పరిస్థితులు మరింత దిగజారుతాయని భయపడుతున్నారు.

తక్కువ ఆదాయ వర్గాల్లో ఏకంగా 63.2 శాతం మంది ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని చెప్పగా, ఉన్నత ఆదాయ వర్గాలలో ఈ శాతం కేవలం 26.3గా ఉంది.

దుస్తులు, సాంప్రదాయ మిఠాయిలకే ప్రథమ ప్రాధాన్యం

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పండుగ సంప్రదాయాలను పాటించడంలో భారతీయులు వెనక్కి తగ్గడం లేదని సీవోటర్ సర్వే ద్వారా తెలుస్తోంది. 45 శాతం మంది కుటుంబ సభ్యుల కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేశామని లేదా కొనడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇందులో 16.9 శాతం మంది కుటుంబం మొత్తానికి, 20.4 శాతం మంది పిల్లల కోసం దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. అయితే, 45.4 శాతం మంది ఈసారి కొత్త బట్టలు కొనే ఆలోచన లేదని చెప్పడం.. మారిన బడ్జెట్ పరిమితులను సూచిస్తోంది.

సీవోటర్ సర్వేలో కీలక విషయాలు.. (CVoter)
సీవోటర్ సర్వేలో కీలక విషయాలు.. (CVoter)

స్వీట్ల విషయంలో విదేశీ చాక్లెట్ల కంటే స్థానిక మిఠాయిలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 33 శాతం మంది స్థానిక షాపుల్లో సాంప్రదాయ తీపి పదార్థాలు కొంటామని చెప్పగా, విదేశీ చాక్లెట్లను ఎంచుకున్నది కేవలం 3.1 శాతం మంది మాత్రమే. ఇది స్థానిక వ్యాపారులకు ప్రాధాన్యత ఇచ్చే వైఖరిని ప్రతిబింబిస్తోంది.

భారీ కొనుగోళ్లకు దూరంగా సామాన్యుడు..

పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన వస్తువుల విషయంలో భారతీయ వినియోగదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

కేవలం 21.5 శాతం మంది మాత్రమే వంటగది ఉపకరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపగా, 18.5 శాతం మంది ఎలక్ట్రానిక్స్ వస్తువులపై దృష్టి పెట్టారు.

ద్విచక్ర వాహనాలు, కార్లు లేదా పసిడి ఆభరణాలు కొనాలని 22 శాతం మంది భావిస్తున్నారు.

ఇళ్లకు రంగులు వేయడం, మరమ్మతులు చేయడం వంటి పనులకు 50.2 శాతం మంది దూరంగా ఉంటున్నారు.

చెల్లింపుల విషయంలో కూడా 32.2 శాతం మంది నేరుగా పూర్తి నగదు చెల్లిస్తామని చెప్పగా, 12.8 శాతం మంది ఈఎంఐ పద్ధతిని ఎంచుకుంటున్నారు. 32.1 శాతం మంది ఏ విధమైన భారీ కొనుగోళ్లు చేయడం లేదని స్పష్టం చేశారు.

దేశీయ, ఆధ్యాత్మిక ప్రయాణాల వైపే మొగ్గు..

పండుగ సెలవుల్లో ప్రయాణాల విషయానికి వస్తే, 47.5 శాతం మంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. అందులో స్థానిక ప్రాంతాలకు వెళ్లేవారు 15.7 శాతం ఉండగా, 15.1 శాతం మంది పుణ్యక్షేత్రాల సందర్శనకు (ఆధ్యాత్మిక యాత్రలకు) ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి విదేశీ ప్రయాణాలకు కేవలం 1.7 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపారు. దీనిబట్టి పండుగ వేళ సుదూర ప్రాంతాలు, విదేశాల కంటే స్వదేశీ, ఆధ్యాత్మిక ప్రయాణాలకే డిమాండ్ ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.

భారత కుటుంబాల్లో కనిపిస్తున్న ఆర్థిక ఒత్తిడికి ప్రధాన కారణం.. ఈ ఏడాది మార్చ్​లో ప్రారంభమైన అమెరికా- ఇరాన్ యుద్ధమే. దీని వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. దీని వల్ల దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలకు రెక్కలు వచ్చాయి. వీటి వల్ల సామాన్యుడి ఆర్థిక ప్రణాళికలు చితికిపోతున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More