...
...
Next Story

8వ వేతన సంఘం: రూ.69 వేల కనీస వేతనం.. ఎన్‌సీ-జేసీఎం భారీ ప్రతిపాదనలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనాన్ని రూ.69,000కు పెంచాలని ఎన్‌సీ-జేసీఎం 8వ వేతన సంఘానికి ప్రతిపాదించింది. 6 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 67 శాతం పెన్షన్, 600 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌తో పాటు హెచ్‌ఆర్‌ఏ పెంపును కోరింది.

Published on: Nov 10, 2026, 16:41:26 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల సవరణకు సంబంధించి ఉద్యోగుల ప్రధాన సంఘం 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ' (ఎన్‌సీ-జేసీఎం) 8వ వేతన సంఘానికి కీలక విన్నపాలు సమర్పించింది. ఉద్యోగుల కనీస వేతనాన్ని ఏకంగా రూ.69,000కు పెంచడంతో పాటు పెన్షన్, ఇంక్రిమెంట్లు, అలవెన్సుల్లో విప్లవాత్మక మార్పులు చేయాలని కోరింది.

పే కమిషన్ గడువు.. సభ్యుల వివరాలు

8వ వేతన సంఘం: రూ.69 వేల కనీస వేతనం.. ఎన్‌సీ-జేసీఎం భారీ ప్రతిపాదనలు
8వ వేతన సంఘం: రూ.69 వేల కనీస వేతనం.. ఎన్‌సీ-జేసీఎం భారీ ప్రతిపాదనలు

కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతన సంఘం ఏర్పాటైన 18 నెలల్లోగా తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లతో సంప్రదింపులు పూర్తయిన తర్వాతే ఈ నివేదికను ఖరారు చేస్తారు.

కనీస వేతనం రూ.69,000.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.833

లెవెల్-1 ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనాన్ని ప్రస్తుతం ఉన్న రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలని ఎన్‌సీ-జేసీఎం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.833గా ఉండాలని కోరింది. అలాగే లెవెల్-2, లెవెల్-3 ఉద్యోగుల వేతన శ్రేణులను విలీనం చేసి, కనీస వేతనాన్ని రూ.83,200గా నిర్ణయించాలని సూచించింది.

6 శాతం వార్షిక ఇంక్రిమెంట్.. పెన్షన్ 67 శాతానికి పెంపు

ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వార్షిక ఇంక్రిమెంట్ రేటును ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 6 శాతానికి రెట్టింపు చేయాలని ఉద్యోగ సంఘం స్పష్టం చేసింది. ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందించే పెన్షన్‌ను చివరిగా తీసుకున్న వేతనంలో 50 శాతం నుంచి 67 శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది. ఫ్యామిలీ పెన్షన్ రేటును సైతం 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరింది.

ఎక్స్, వై, జెడ్ నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ సవరణ

ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 300 రోజుల ఆర్జిత సెలవులను (ఎర్న్డ్ లీవ్స్) నగదుగా మార్చుకునే సదుపాయం ఉండగా, ఆ పరిమితిని 600 రోజులకు పెంచాలని ప్రతిపాదించింది. ఈ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను ప్రాథమిక వేతనం, కరువు భత్యం (డీఏ) ప్రాతిపదికన లెక్కిస్తారు.

పాత పెన్షన్ పునరుద్ధరణ.. ఇతర డిమాండ్లు

పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) తిరిగి ప్రారంభించాలని, పదోన్నతుల అవకాశాలను పెంచాలని, పిల్లల విద్యా భత్యం (సీఈఏ), ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ఎన్‌సీ-జేసీఎం కోరింది. అయితే ఇవన్నీ ఎన్‌సీ-జేసీఎం చేసిన ప్రతిపాదనలు మాత్రమే. 8వ వేతన సంఘం తుది నివేదికలో చేసే సిఫార్సులు, వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆమోదం ఆధారంగానే అసలు వేతన మార్పులు ఆధారపడి ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks