...
...
Next Story

8వ వేతన సంఘం: పెన్షన్ 67 శాతానికి పెరుగుతుందా? కీలక ప్రతిపాదనలివే

8వ వేతన సంఘం ముందు పెన్షనర్లు కీలక డిమాండ్లు ఉంచారు. కనీస పెన్షన్‌ను రూ. 45 వేలకు పెంచడంతో పాటు చివరి మూలవేతనంలో 67 శాతం పెన్షన్ ఇవ్వాలని భారత్ పెన్షనర్స్ సమాజ్ కోరింది. కుటుంబ పెన్షన్ పెంపు, గ్రాట్యుటీ లెక్కల పూర్తి వివరాలు ఇవిగో.

Published on: Nov 21, 2026, 09:02:39 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు తీపి కబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీ విరమణ తర్వాత పొందే ప్రాథమిక పెన్షన్‌ను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి ఏకంగా 67 శాతానికి పెంచాలన్న పెన్షనర్ల డిమాండ్‌ను 8వ వేతన సంఘం పరిశీలించే అవకాశం ఉంది. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు కనీస నెలవారీ పెన్షన్‌ను రూ. 45,000 చేయాలని, కుటుంబ పెన్షన్‌నూ పెంచాలని పెన్షనర్ల సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.

8వ వేతన సంఘం: పెన్షన్ 67 శాతానికి పెరుగుతుందా? కీలక ప్రతిపాదనలివే
8వ వేతన సంఘం: పెన్షన్ 67 శాతానికి పెరుగుతుందా? కీలక ప్రతిపాదనలివే

కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంస్థల అభిప్రాయాలు, సమస్యలను విన్న తర్వాత 2027 మే-జూన్ నాటికి ఈ కమిషన్ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఇందులో భాగంగా కమిషన్ ఇటీవల అక్టోబర్ 8న బెంగళూరులో, అక్టోబర్ 23న ముంబైలో కీలక సమావేశాలను పూర్తి చేసుకుంది. గత కొన్ని నెలలుగా కమిషన్‌తో జరుగుతున్న చర్చల్లో పెన్షనర్లు తమ దీర్ఘకాలిక డిమాండ్లను మరోసారి తెరపైకి తెచ్చారు.

బీపీఎస్ ప్రధాన డిమాండ్లు ఇవే..

భారత్ పెన్షనర్స్ సమాజ్ (బీపీఎస్) 8వ వేతన సంఘానికి సమర్పించిన వినతిపత్రంలో మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించింది.

  • కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.45,000గా నిర్ణయించాలి.
  • ఉద్యోగి చివరిగా తీసుకున్న మూలవేతనంలో (బేసిక్ పే) 67 శాతాన్ని పెన్షన్‌గా ఇవ్వాలి (ప్రస్తుతం ఇది 50 శాతంగా ఉంది).
  • కుటుంబ పెన్షన్‌ను ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి.

గతంలో 7వ వేతన సంఘం ఎందుకు తిరస్కరించింది?

పెన్షన్‌ను 50 శాతం కంటే ఎక్కువకు పెంచాలన్న డిమాండ్ కొత్తదేమీ కాదు. 7వ వేతన సంఘం ముందు కూడా ఇలాంటి విజ్ఞప్తులే వచ్చాయి. అయితే అప్పట్లో కమిషన్ వీటిని తిరస్కరించింది. 6వ వేతన సంఘం అప్పటికే 33 ఏళ్ల అర్హత సర్వీసు నిబంధనను తొలగించి, పెన్షన్ లెక్కింపును సరళతరం చేసిందని 7వ వేతన సంఘం పేర్కొంది. చివరి నెల మూలవేతనం లేదా చివరి 10 నెలల సగటు వేతనంలో ఏది ఎక్కువైతే దాంట్లో 50 శాతాన్ని పెన్షన్‌గా ఖరారు చేసిన విషయాన్ని గుర్తుచేసింది.

ఒకవేళ 67 శాతం పెన్షన్ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట దక్కుతుంది. ఉదాహరణకు, 7వ వేతన సంఘం మ్యాట్రిక్స్‌లోని లెవల్-6 కింద రూ.44,900 చివరి మూలవేతనంతో రిటైర్ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని తీసుకుందాం. ప్రస్తుత 50 శాతం నిబంధన ప్రకారం ఆయనకు నెలకు రూ. 22,450 ప్రాథమిక పెన్షన్ వస్తుంది. అదే 67 శాతం అమలైతే, ఈ మొత్తం నెలకు సుమారు రూ. 30,083కు చేరుతుంది (ఇందులో డీఆర్, ఇతర భత్యాలను కలపలేదు).

ప్రస్తుత 50 శాతం రేటుతో పోలిస్తే 67 శాతం ప్రతిపాదన వల్ల పెన్షన్ 34 నుంచి 35 శాతం మేర పెరుగుతుంది. చివరి మూలవేతనం రూ. 18,000 ఉన్న ఉద్యోగికి నెలకు అదనంగా సుమారు రూ. 3,060 అందుతుంది. అలాగే రూ. 78,800 చివరి మూలవేతనం ఉన్నవారికి నెలకు అదనంగా రూ. 13,396 వరకు పెన్షన్ పెరుగుతుంది. అయితే సర్వీసు కాలంలో తక్కువ వేతనాలు పొందిన వారికి కేవలం శాతాల పెంపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనే బీపీఎస్ రూ. 45,000 కనీస పెన్షన్ డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.

కుటుంబ పెన్షన్ పెరిగినా.. గ్రాట్యుటీ సంగతేంటి?

కుటుంబ పెన్షన్‌ను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని బీపీఎస్ కోరుతోంది. పైన చెప్పుకున్న రూ. 44,900 మూలవేతన ఉదాహరణనే తీసుకుంటే, ప్రస్తుతం 30 శాతం చొప్పున నెలకు రూ. 13,470 కుటుంబ పెన్షన్ అందుతోంది. ఒకవేళ 50 శాతం ప్రతిపాదన ఆమోదం పొందితే ఇది రూ. 22,450కు పెరిగి, నెలకు అదనంగా రూ. 8,980 లభిస్తుంది. గతంలో 7వ వేతన సంఘం ఈ రేటును పెంచడానికి గానీ, పెన్షనర్ మరణానంతరం పెరిగిన కుటుంబ పెన్షన్ గడువును పొడిగించడానికి గానీ అంగీకరించలేదు.

మరోవైపు పెన్షన్ రేటు పెరిగినంత మాత్రాన రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఆటోమేటిక్‌గా పెరగదన్న విషయాన్ని పెన్షనర్లు గమనించాలి. గ్రాట్యుటీని నెలవారీ పెన్షన్ ఆధారంగా కాకుండా, ఉద్యోగి వేతనం (ఎమోల్యూమెంట్స్), అర్హత సర్వీసు ఆధారంగా లెక్కిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రతి ఆరు నెలల సర్వీసుకు వేతనంలో నాలుగో వంతు చొప్పున, గరిష్టంగా చివరి వేతనానికి 16.5 రెట్లు గ్రాట్యుటీగా చెల్లిస్తారు. ప్రస్తుతం గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.25 లక్షలుగా ఉంది.

ఉదాహరణకు రూ. 44,900 మూలవేతనం, 63 శాతం డీఏ కలిపితే మొత్తం వేతనం సుమారు రూ. 73,187 అవుతుంది. 33 ఏళ్ల గరిష్ట సర్వీసుకు 16.5 రెట్లు లెక్కిస్తే గ్రాట్యుటీ సుమారు రూ. 12.08 లక్షలు వస్తుంది. కాబట్టి పెన్షన్‌ను 50 శాతం నుంచి 67 శాతానికి పెంచినా గ్రాట్యుటీలో మార్పు ఉండదు. గ్రాట్యుటీ పెరగాలంటే వేతన సవరణ లేదా గ్రాట్యుటీ నిబంధనల్లో సమగ్ర మార్పులు చేయాల్సి ఉంటుంది.

పెన్షనర్ల ఆశలు నెరవేరేనా?

చివరి వేతనానికి అనుగుణంగా పెన్షన్ శాతాన్ని పెంచడం ద్వారా అన్ని స్థాయిల రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, కనీస పెన్షన్ రూ. 45,000 చేయడం వల్ల తక్కువ పెన్షన్ పొందేవారికి ద్రవ్యోల్బణం నుంచి రక్షణ లభిస్తుందని బీపీఎస్ వాదిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం పెన్షనర్ల సంఘాలు కమిషన్ ముందుంచిన ప్రతిపాదనలు మాత్రమేనని, ప్రభుత్వ తుది నిర్ణయాలు కావని గమనించాలి. 2027లో 8వ వేతన సంఘం సమర్పించే సిఫార్సులు, వాటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే పెన్షనర్లకు అందే అసలు ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.

 

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks