కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 'పోస్ట్-రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రద్దు' వార్తల్లో నిజమెంత?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పోస్ట్-రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రద్దు అయినట్టు వార్తలు వస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వాత డీఏ పెంపు ఉండదని ఆ వార్తలు సూచిస్తున్నాయి. మరి ఈ న్యూస్‌లో నిజమెంత?
రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన పోస్ట్-రిటైర్‌మెంట్ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఖండించింది. ‘ఫైనాన్స్ యాక్ట్ 2025’ కింద డీఏ పెంపులు, పే కమిషన్ రివిజన్‌ల వంటి ప్రయోజనాలను రద్దు చేశారనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.

సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో ఈ విషయాన్ని ప్రకటించింది.
"సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగుల డీఏ పెంపులు, పే కమిషన్ రివిజన్‌ల వంటి ప్రయోజనాలను ఫైనాన్స్ యాక్ట్ 2025 కింద ఉపసంహరించుకుందంటూ #WhatsApp లో ఒక మెసేజ్ సర్కులేట్ అవుతోంది. ఈ క్లెయిమ్ #FAKE! (అబద్ధం), " అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.
అసలు సవరణ ఏంటి?
ఈ తప్పుడు ప్రచారానికి కారణాన్ని కూడా ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ వివరించింది. సీసీఎస్ (పెన్షన్) రూల్స్, 2021 లోని రూల్ 37ని ఇటీవలే సవరించారు. దీని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) చేరిన ఉద్యోగిని దుష్ప్రవర్తన కారణంగా తొలగిస్తే, అతని/ఆమె రిటైర్‌మెంట్ ప్రయోజనాలు జప్తు చేయడం జరుగుతుంది.
తప్పుడు వార్తలో ఏముంది?
ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2025 ను ఆమోదించిందని, దీని ద్వారా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల కీలకమైన పోస్ట్-రిటైర్‌మెంట్ ప్రయోజనాలను ఉపసంహరించుకుంటుందని ఆ ఫేక్ న్యూస్ పేర్కొంది.
ఆ వైరల్ మెసేజ్ లోని తప్పుడు సమాచారం:
"కొత్త నిబంధనల ప్రకారం, పెన్షనర్లు ఇకపై డీఏ పెంపులు లేదా రాబోయే 8వ పే కమిషన్‌తో పాటు భవిష్యత్ పే కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారు! రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని ఫైనాన్స్ యాక్ట్ 2025 చెబుతోంది. అంటే, ఇప్పటికే రిటైర్ అయిన వారికి పే కమిషన్ ప్రయోజనాలు, డీఏ పెంపులు వర్తించవు."
అంతేకాక, ఆ మెసేజ్ రిటైర్డ్ ఉద్యోగులు "జాగ్రత్తగా ఉండాలని, తమ హక్కులను రక్షించుకోవడానికి ఉమ్మడి చర్య తీసుకోవాలని" పిలుపునిచ్చింది. ఈ విధంగా రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగించేందుకు ప్రయత్నించింది.
సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను ఎప్పుడూ అధికారిక సోర్స్‌ల నుంచి ధృవీకరించుకోవాలని పీఐబీ ప్రజలకు సూచించింది.
రైల్వేలో 'కాస్ట్ కటింగ్'..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను, పింఛన్లను పెంచేందుకు 8వ పే కమిషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇది అమలవ్వడానికన్నా ముందు కాస్ట్ కటింగ్ ప్రక్రియను చేపట్టాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్టు సమాచారం. ఎనర్జీ, మెయిన్టేనెన్స్, ప్రొక్యూర్మెంట్ వంటి విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవాలని, తద్వారా 8వ పే కమిషన్‌తో జీతాలు పెరిగే నాటికి ఆర్థికంగా పుంజుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
2016లో అమలైన 7వ పే కమిషన్ ద్వారా ఒక్క ఉద్యోగుల జీతాల రూపంలోనే రైల్వేకు రూ.22వేల కోట్ల ఖర్చు పెరిగిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 8వ పే కమిషన్‌తో అది రూ.30వేల కోట్లు దాటొచ్చన్న అంచనాలు ఉన్నాయని వివరించారు. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు కాస్ట్ కట్టింగ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


