8th Pay Commission : ఉద్యోగుల జీతాలు ఎంత పెరగొచ్చు? 3, 5, 6శాతం వార్షిక ఇంక్రిమెంట్ అంచనాల వివరాలు..
8వ వేతన సంఘం గడువు సగానికి చేరింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్‌ను 3 శాతం నుంచి 5% లేదా 6 శాతానికి పెంచాలని యూనియన్లు కోరుతున్నాయి. లెవెల్ 1, 2, 3 ఉద్యోగుల జీతాలు ఐదేళ్లలో ఎంత పెరుగుతాయో ఈ కథనంలో చూడండి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటు చేసి నేటికి (ఆగస్టు 3, 2026) సరిగ్గా తొమ్మిది నెలలు పూర్తయింది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ చైర్‌పర్సన్‌గా 2025 నవంబర్ 3న ఏర్పాటైన ఈ కమిషన్, తనకు కేటాయించిన 18 నెలల కాలపరిమితిలో సగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఉద్యోగుల వేతనాలు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సులు, పెన్షన్ సంస్కరణలపై తుది నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించే పనిలో కమిషన్ వేగం పెంచింది.

గత తొమ్మిది నెలల కాలంలో ఈ 8వ వేతన సంఘం బృందం దిల్లీ, లద్ధాఖ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి పలు ప్రాంతాల్లో పర్యటించింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లు, ప్రతిపాదనలను నేరుగా విని సమాచారాన్ని సేకరించింది.
రాబోయే భేటీలు.. ప్రధానంగా ఇంక్రిమెంట్‌పై చర్చ!
8వ పే కమిషన్ అధికారిక సమాచారం ప్రకారం.. ఈ నెల (ఆగస్టు)తో పాటు సెప్టెంబర్‌లోనూ కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ చర్చల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో పాటు 'వార్షిక వేతన పెంపు' (యాన్యువల్ ఇంక్రిమెంట్) రేటుపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రాబోయే దశాబ్ద కాలంలో ఉద్యోగుల వేతన ఎదుగుదలపై ఈ వార్షిక ఇంక్రిమెంట్ అత్యంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం ఉద్యోగులకు ప్రాథమిక వేతనంపై ఏటా 3 శాతం చొప్పున ఇంక్రిమెంట్ అందుతోంది. అయితే, రాబోయే 8వ పే కమిషన్‌లో ఈ వార్షిక ఇంక్రిమెంట్ రేటును 5 శాతం, 6 శాతం లేదా 7 శాతానికి పెంచాలని పలు ఉద్యోగ సంఘాలు కమిషన్‌కు విజ్ఞప్తి చేశాయి. పెరిగే ఇంక్రిమెంట్ వల్ల ఉద్యోగుల్లో పనితీరు పట్ల ఉత్సాహం పెరగడమే కాకుండా, వారి కెరీర్ ముగిసే సమయానికి మెరుగైన జీతం అందుతుందని సంఘాలు వాదిస్తున్నాయి.
మూల వేతనం ఆధారంగానే వార్షిక ఇంక్రిమెంట్ లెక్కిస్తారు కాబట్టి, పెంపు శాతం పెరిగితే నెలానెలా వచ్చే జీతం పెరగడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే వేతన సవరణలలోనూ మెరుగైన ప్రయోజనం లభిస్తుంది.
8వ వేతన సంఘానికి వివిధ సంఘాలు అందించిన ప్రతిపాదిత వార్షిక పెంపు..
ఆర్గనైజేషన్/యూనియన్ | ప్రతిపాదిత వార్షిక పెంపు |
|---|---|
| నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాియంట్ కన్సల్టేటివ్ మెషినరీ | 6% |
| ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ | 6% |
| ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ | 6% |
| ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ | 7% |
| ఇండియన్ రైల్వేస్ సూపర్వైజర్స్ అసోసియేషన్ | 5% |
సోర్సు: 8వ వేతన సంఘానికి సమర్పించిన అధికారిక మెమొరాండమ్
జీతాలు ఎలా పెరుగుతాయి?
7వ పే కమిషన్ పే-మ్యాట్రిక్స్ ఆధారంగా 3%, 5%, 6% ఇంక్రిమెంట్లు అమలు చేస్తే రాబోయే ఐదేళ్లలో జీతాలు ఎలా పెరుగుతాయో ప్రముఖ ఆర్థిక సంస్థ బ్యాంక్‌బజార్ డాట్ కామ్ (BankBazaar.com) కొన్ని అంచనాలు రూపొందించింది. అయితే ఇవి కేవలం ఉదాహరణ సూచికలు మాత్రమే తప్ప, కమిషన్ అధికారికంగా చేసిన సిఫార్సులు కావు అని గుర్తుపెట్టుకోవాలి.
లెవెల్ 1 ఉద్యోగులు: 3 శాతం ఇంక్రిమెంట్‌తో ప్రస్తుతం ఉన్న లెవెల్ 1 ఉద్యోగి బేసిక్ పే ఐదేళ్ల తర్వాత రూ.20,900కి చేరుకుంటుంది. అదే ఇంక్రిమెంట్ రేటును 5 శాతానికి పెంచితే రూ.23,100, 6 శాతానికి పెంచితే ఏకంగా రూ.24,200 వరకు మూల వేతనం పెరుగుతుంది
సంవత్సరం | 3% వార్షిక పెంపు | 5% వార్షిక పెంపు | 6% వార్షిక పెంపు |
|---|---|---|---|
| ప్రారంభ బేసిక్ | రూ. 18,000 | రూ. 18,000 | రూ. 18,000 |
| 1 ఏడాది | రూ. 18,500 | రూ. 18,900 | రూ. 19,100 |
| 2వ ఏడాది | రూ. 19,100 | రూ. 19,800 | రూ. 20,200 |
| 3వ ఏడాది | రూ. 19,700 | రూ. 20,800 | రూ. 21,400 |
| 4వ ఏడాది | రూ. 20,300 | రూ. 21,900 | రూ. 22,700 |
| 5వ ఏడాది | రూ. 20,900 | రూ. 23,100 | రూ. 24,200 |
లెవెల్ 2 ఉద్యోగులు: లెవెల్ 2 హోదాలోని ఉద్యోగులకు 3 శాతం చొప్పున పెరిగితే ఐదేళ్ల తర్వాత బేసిక్ పే రూ.23,100 అవుతుంది. ఇది 5 శాతానికి మారితే రూ.26,800, 6 శాతానికి పెంచితే రూ.27,600 వరకు ప్రాథమిక వేతనం అందుతుంది.
సంవత్సరం | 3% వార్షిక్ పెంపు | 5% వార్షిక పెంపు | 6% వార్షిక పెంపు |
|---|---|---|---|
| ప్రారంభ బేసిక్ | రూ. 19,900 | రూ. 19,900 | రూ. 19,900 |
| 1ఏడాది | రూ. 20,500 | రూ. 21,100 | రూ. 21,100 |
| 2వ ఏడాది | రూ. 21,100 | రూ. 22,400 | రూ. 22,400 |
| 3వ ఏడాది | రూ. 21,700 | రూ. 23,800 | రూ. 23,800 |
| 4వ ఏడాది | రూ. 22,400 | రూ. 25,200 | రూ. 26,000 |
| 5వ ఏడాది | రూ. 23,100 | రూ. 26,800 | రూ. 27,600 |
లెవెల్ 3 ఉద్యోగులు: లెవెల్ 3 హోదాలోని ఉద్యోగులకు కూడా ప్రాథమిక వేతనంలో భారీ మార్పు కనిపిస్తుంది. ఎగువ స్థాయి కేడర్లలో ఈ వార్షిక ఇంక్రిమెంట్ల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
సంవత్సరం | 3% వార్షిక పెంపు | 5% వార్షిక పెంపు | 6% వార్షిక పెంపు |
|---|---|---|---|
| ప్రారంభ పేసిక్ | రూ. 21,700 | రూ. 21,700 | రూ. 21,700 |
| 1 ఏడాది | రూ. 22,400 | రూ. 22,800 | రూ. 23,100 |
| 2వ ఏడాది | రూ. 23,100 | రూ. 24,500 | రూ. 24,500 |
| 3వ ఏడాది | రూ. 23,800 | రూ. 25,100 | రూ. 26,000 |
| 4వ ఏడాది | రూ. 24,500 | రూ. 26,300 | రూ. 27,600 |
| 5వ ఏడాది | రూ. 25,200 | రూ. 27,700 | రూ. 29,100 |
ఇతర అలవెన్సులపైనా సానుకూల ప్రభావం..
వార్షిక ఇంక్రిమెంట్ పెరగడం వల్ల కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా, దానిపై ఆధారపడి ఉండే కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కాంట్రిబ్యూషన్, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా భారీగా పెరుగుతాయి.
ప్రస్తుతానికి 8వ పే కమిషన్ ఎలాంటి అధికారిక సవరణలను ప్రకటించలేదు. కమిషన్ తన తుది నివేదికను 2027 మే-జూన్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశముంది. ఆ తర్వాతే నూతన వేతన పెంపుపై తుది నిర్ణయం వెలువడనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


