...
...
Next Story

8th Pay Commission : ‘5ఏళ్లకి ఒకసారి జీతాల పెంపు కావాలి’- 8వ పే కమిషన్ ముందు కీలక డిమాండ్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణపై కీలక చర్చ నడుస్తోంది. పదేళ్లకు బదులుగా ప్రతి ఐదేళ్లకోసారి జీతాలు, పెన్షన్లు సవరించాలని పలు ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘానికి ప్రతిపాదించాయి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో సంఘాల డిమాండ్లు, వేతన సంఘం నివేదిక ఎప్పుడు వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Nov 15, 2026, 08:41:01 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల వేతన సవరణ విషయంలో సరికొత్త చర్చ మొదలైంది. సాధారణంగా పదేళ్లకోసారి జరిగే వేతన సవరణ గడువును ఐదేళ్లకు కుదించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 2025 నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం ముందు ప్రముఖ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ఈ కీలక ప్రతిపాదనను ఉంచాయి.

8వ వేతన సంఘం ముందు కీలక డిమాండ్
8వ వేతన సంఘం ముందు కీలక డిమాండ్

జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల తాత్కాలిక కమిషన్ ప్రస్తుతం వివిధ సంఘాల వినతులు, సూచనలను స్వీకరిస్తోంది. నిబంధనల ప్రకారం ఈ కమిషన్ తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి 18 నెలల గడువు ఉంది.

హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు వంటి ప్రధాన కేంద్రాల్లో రైల్వే, రక్షణ, తపాలా, ఆదాయపు పన్ను సహా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు నివసిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పదేళ్ల పాటు వేతన సవరణ కోసం ఎదురుచూడటం భారంగా మారిందని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, భత్యాలు, జీతాలు, పెన్షన్ల సవరణపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటైన 8వ వేతన సంఘం వద్దకు ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలపరిమితి అంశం ప్రధానంగా చేరింది.

8వ వేతన సంఘం- ఐదేళ్లకోసారి వేతన సవరణ ఎందుకు కోరుతున్నారు?

ఉద్యోగ సంఘాలు సమర్పించిన అధికారిక మెమోరాండమ్‌లలో పదేళ్లకు బదులుగా ప్రతి ఐదేళ్లకోసారి జీతాలు, పెన్షన్లను సవరించాలన్న డిమాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తదుపరి జీతాల పెంపు కోసం ఒక దశాబ్దం పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

పదేళ్ల కాలపరిమితిని తగ్గించాలని దేశవ్యాప్తంగా పలు కీలక సంఘాలు 8వ వేతన సంఘానికి విజ్ఞప్తి చేశాయి. 'భారత్ పెన్షనర్స్ సమాజ్' (బీపీఎస్) 2026 ఆగస్టు 7న కమిషన్‌కు సమర్పించిన మెమోరాండమ్‌లో తన 13 ప్రధాన డిమాండ్లలో ఐదేళ్లకోసారి వేతన సవరణ అంశాన్ని స్పష్టంగా చేర్చింది. ఇదే తరహాలో నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (ఎన్​సీ-జేసీఎం) స్టాఫ్ సైడ్ కూడా తరచుగా వేతన సవరణలు జరగాల్సిన ఆవశ్యకతను వివరించింది.

వరుస వేతన సంఘాల మధ్య సుదీర్ఘ విరామం ఉండటం వల్ల పెన్షనర్లు, సర్వీసులో ఉన్న ఉద్యోగుల కొనుగోలు శక్తి తీవ్రంగా ప్రభావితమవుతోందని 'రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ' వాదించింది. మరోవైపు, ‘ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్’ మరో అడుగు ముందుకేసి ఒక వినూత్న ఆలోచనను ప్రతిపాదించింది. ప్రతి పదేళ్లకు ఒక కొత్త వేతన సంఘాన్ని నియమించే బదులు, ఉద్యోగులకు అర్థవంతమైన వేతన మార్పులు అందించడానికి ఒక శాశ్వత వేతన సమీక్షా సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.

8వ వేతన సంఘం- పెన్షనర్లకు ఈ మార్పు ఎందుకు అత్యంత కీలకం?

సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పోలిస్తే విశ్రాంత ఉద్యోగులకు ఈ డిమాండ్ మరింత కీలకమైనది. ఎందుకంటే ఉద్యోగులకు ప్రతి ఏటా వార్షిక ఇంక్రిమెంట్లు లభిస్తాయి; కానీ పెన్షనర్లకు అలాంటి ఇంక్రిమెంట్లు ఉండవు. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం పొందేందుకు వారికి ఏడాదికి రెండుసార్లు కరవు భత్యం (డీఆర్) మాత్రమే సవరిస్తారు. వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను తట్టుకోవడానికి ప్రస్తుత విధానం సరిపోవడం లేదని పెన్షనర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సవాళ్లను అధిగమించేందుకు భారత్ పెన్షనర్స్ సమాజ్ కొన్ని అదనపు ప్రతిపాదనలు చేసింది. మూడు నెలల సగటు ఆధారంగా త్రైమాసికానికి ఒకసారి డీఏ-డీఆర్ సవరణలు చేయాలని, ద్రవ్యోల్బణానికి పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని, అలాగే కరవు భత్యం 25 శాతం దాటిన వెంటనే దానిని బేసిక్ పెన్షన్‌లో విలీనం చేయాలని కోరింది.

ఇవి కేవలం డిమాండ్లు మాత్రమే.. తుది నిర్ణయం ఎప్పుడంటే..

ఉద్యోగ సంఘాల నుంచి బలమైన ఒత్తిడి వస్తున్నప్పటికీ, వేతన సవరణ గడువును ఐదేళ్లకు తగ్గిస్తున్నట్లు 8వ వేతన సంఘం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సంఘాలు చేసిన విజ్ఞప్తులు ప్రస్తుతానికి కేవలం డిమాండ్ల దశలోనే ఉన్నాయి. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ప్యానెల్ ఈ అన్ని ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, రాబోయే కొన్ని నెలల్లో తన తుది నివేదికను సిద్ధం చేయనుంది.

2027 మే లేదా జూన్ నాటికి ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాతే ప్రస్తుత విధానంలో మార్పులు చేయాలా వద్దా అన్నది తేలుతుంది. అప్పటివరకు పదేళ్ల కాలపరిమితి విధానమే యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి ఉద్యోగులు, పెన్షనర్లు ఈ ఐదేళ్ల ప్రతిపాదనను కేవలం ఒక విజ్ఞప్తిగా మాత్రమే చూడాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks