Plumber Job : ఏడాదికి రూ. 18లక్షలు సంపాదిస్తున్న ప్లంబర్! ‘ఏఐ ఎఫెక్ట్ కూడా ఉండదు’
ముంబైలోని ఒక ప్లంబర్ ఏడాదికి రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడన్న విషయం తెలిసి ఒక వ్యక్తి విస్తుపోయాడు. అతనికి మంచి కారు, సొంత ఇల్లు, పొలాలు ఉన్నాయని తెలుసుకుని తన కెరీర్ నిర్ణయాలపై పునరాలోచనలో పడ్డాడు ఈ వ్యక్తి. దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన సొసైటీలో పనిచేసే ప్లంబర్ ఆదాయం విని నోరెళ్లబెట్టాడు! "ఒక ప్లంబర్ ఏడాదికి రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు," అంటూ సదరు వ్యక్తి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిశాక తన 'జీవిత నిర్ణయాల' (లైఫ్ ఛాయిసెస్) గురించి మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అతను అంటున్నాడు

క్రెటా కారు.. సొంత ఊళ్లో పొలాలు!
సదరు వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ముంబైలోని మీరా రోడ్, బోరివలి, కాండివలి వంటి ప్రాంతాల్లోని టౌన్‌షిప్‌లలో ఈ ప్లంబర్ పనిచేస్తుంటాడు. పైపులు రిపేర్ చేస్తున్న సమయంలో మాటల సందర్భంలో తన సంపాదన గురించి వివరించాడు.
"అతను చెబుతున్నది మొదట జోక్ అనుకున్నాను. కానీ అతను లెక్కలతో పాటు చెప్పడం మొదలుపెట్టాక షాక్ అయ్యాను. ఈ టౌన్‌షిప్‌లన్నింటి నుంచి కలిపి అతనికి ఏడాదికి రూ. 18 లక్షల ఆదాయం వస్తోంది," అని ఆ ముంబై వ్యక్తి రాసుకొచ్చాడు.
అంతేకాదు, ఆ ప్లంబర్‌కు 2023 మోడల్ 'హ్యుందాయ్ క్రిటా' కారు ఉందని, తన సొంత ఊళ్లో ఒక ఇల్లు కట్టుకోవడమే కాకుండా వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేశాడని తెలిసి ఇతను ఆశ్చర్యపోయాడు.
"అతను నిజంగా ధనవంతుడైపోయాడు. మనం ఎలాంటి కాలంలో బతుకుతున్నామో అనిపిస్తోంది," అని ఆవేదన వ్యక్తం చేశాడు.
బ్లూ కాలర్ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్..!
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతగా పెరిగినా.. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వంటి శారీరక శ్రమతో కూడిన 'బ్లూ కాలర్' పనులను ఏ రోబోలు భర్తీ చేయలేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
"ముంబైలోనే ఇలా ఉంటే, ఇక అమెరికా, ఆస్ట్రేలియాలో ప్లంబర్ల సంపాదన చూస్తే మీరు ఇంకా షాక్ అవుతారు," అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
"దిల్లీలో ఏసీ సర్వీసింగ్ చేసే వారు కేవలం వేసవి మూడు నెలల్లోనే రూ. 3 లక్షల వరకు సంపాదిస్తారు, మిగతా టైమ్ హాయిగా ఊళ్లో వ్యవసాయం చేసుకుంటారు," అని మరొకరు రాశారు.
చిన్న పనికైనా కనీసం రూ. 500 ఛార్జ్ చేస్తున్నారని, నైపుణ్యం ఉంటే ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
ఈ సంఘటన కేవలం సంపాదన గురించి మాత్రమే కాకుండా, మారుతున్న కాలంలో నైపుణ్యం కలిగిన వృత్తి పనులకు సమాజంలో ఎంత డిమాండ్ ఉందో చాటి చెబుతోంది.
మరి దీనిపై మీ స్పందన ఏంటి?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


