నెలల వ్యవధిలో 145 మరణాలు.. స్లీపర్​ బస్సు రూల్స్​ని కఠినతరం చేసిన కేంద్రం

స్లీపర్ బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై గుర్తింపు పొందిన సంస్థలే బస్సులను నిర్మించాలని, పాత బస్సుల్లో కచ్చితంగా సేఫ్టీ ఫీచర్లు ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.

Published on: Jan 10, 2026, 08:45:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో వరుసగా జరుగుతున్న స్లీపర్ బస్సు ప్రమాదాలు, ప్రాణనష్టాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై స్లీపర్ బస్సుల నిర్మాణాన్ని కేవలం వాహన తయారీ సంస్థలు (ఓఈఎంలు) లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు పొందిన బాడీ బిల్డింగ్ యూనిట్లు మాత్రమే చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చిచెప్పారు. నాణ్యతను పెంచడం, ప్రమాదాలకు బాధ్యతను నిర్దేశించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు.

స్లీపర్​ బస్సు తయారీపై రూల్స్​ కఠినతరం..
స్లీపర్​ బస్సు తయారీపై రూల్స్​ కఠినతరం..

ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న పాత బస్సులకు కూడా గడ్కరీ కీలక సూచనలు చేశారు. ప్రయాణికుల రక్షణ కోసం పాత బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ (మంటలను గుర్తించే పరికరాలు), ఎమర్జెన్సీ లైటింగ్, డ్రైవర్ నిద్రమత్తును గుర్తించే వార్నింగ్ సిస్టమ్‌లను కచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవసర ద్వారం) వద్ద తలుపులు పగులగొట్టడానికి సుత్తులను సిద్ధంగా ఉంచడం తప్పనిసరి అని చెప్పారు.

కేంద్రం ఎందుకు కఠినంగా వ్యవహరిస్తోంది?

గడచిన కొన్ని నెలల్లోనే ఆరు వేర్వేరు స్లీపర్ బస్సు ప్రమాదాల్లో సుమారు 145 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​, కర్ణాటకలో స్లీపర్​ బస్సు ప్రమాదాలు అందరని భయపెడుతున్నాయి.

గత అక్టోబర్​లో హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళుతున్న ఓ స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గత డిసెంబర్​లో కర్ణాటకలో ఓ స్లీపర్​ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ రెండు ఘటనలు తెల్లవారుజామున జరగడం, ప్రయాణికులు నిద్రలో ఉండటం వల్ల సమయానికి బయటపడలేకపోయారు.

కాగా ఈ ప్రమాదాల్లో చాలావరకు బస్సుల డిజైన్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఇరుకైన ద్వారాలు, త్వరగా మంటలు అంటుకునే ఇంటీరియర్, అత్యవసర కిటికీలు లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ అపశ్రుతులను అరికట్టేందుకు ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగింది.

సెల్ఫ్ సర్టిఫికేషన్​కు చెక్!

స్లీపర్​ బస్సుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గడ్కరీ హెచ్చరించారు. "నిబంధనలకు విరుద్ధంగా మాన్యువల్ బాడీ బిల్డర్లు ఇచ్చే సెల్ఫ్ సర్టిఫికేషన్లను అనుమతించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి," అని రాజస్థాన్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇటువంటి అనుమతులు ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏఐఎస్-052 కోడ్ అంటే ఏమిటి?

దేశవ్యాప్తంగా బస్సుల నిర్మాణంలో ఒకే రకమైన ప్రమాణాలను పాటించేలా 'బస్ బాడీ కోడ్' (ఏఐఎస్​-052)ను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. బస్సు నిర్మాణం, లేఅవుట్, ఉపయోగించే మెటీరియల్ నాణ్యత ఎలా ఉండాలో ఈ కోడ్ నిర్ణయిస్తుంది. సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సవరించిన నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

మరింత కఠినమైన తయారీ నిబంధనలు, తప్పనిసరి సేఫ్టీ ఫీచర్ల ద్వారా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More