Artificial Intelligence risks : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై మనం ఎంతగా ఆధారపడితే, మన మెదడుకు అంతగా బద్దకం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదని, మనం గమనించలేనంత నెమ్మదిగా మన ఆలోచనా సరళిని ఏఐ మార్చేస్తోందని హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా, బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన "AI Assistance Reduces Persistence and Hurts Independent Performance" అనే అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

సాధారణంగా మ్యాథ్స్ చేయడం, చదవడం లేదా ఏదైనా విషయాన్ని విశ్లేషించడం వంటి మెదడుకు పనిపెట్టే పనుల్లో ఏఐ మనకు ఎలా సహాయపడుతుందో ఈ పరిశోధనలో పరిశీలించారు. ఏఐని వాడుతున్నప్పుడు మనం వేగంగా, కచ్చితత్వంతో పనులు పూర్తి చేస్తాం. కానీ, అసలు సమస్య ఆ తర్వాతే మొదలవుతుంది.
ఏఐ లేకపోతే.. అంతా శూన్యం!
పరిశోధకులు సుమారు 1,000 మందిపై వివిధ రకాల ప్రయోగాలు చేశారు. ఒక బృందానికి ఏఐ సాయం అందించగా, మరో బృందం సొంతంగా సమస్యలను పరిష్కరించింది. ఏఐ వాడిన వారు చాలా వేగంగా సమాధానాలు చెప్పారు. కానీ, అకస్మాత్తుగా వారి నుంచి ఏఐ టూల్‌ను తొలగించినప్పుడు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.
తప్పులు పెరిగాయి: ఏఐ లేకుండా వారు చెప్పిన సమాధానాల్లో తప్పులు ఎక్కువయ్యాయి.
ఓపిక నశించింది: ఏదైనా సమస్య కష్టంగా అనిపిస్తే, దాన్ని పూర్తి చేసే వరకు ప్రయత్నించకుండా మధ్యలోనే వదిలేశారు.
త్వరగా అలసిపోవడం: కేవలం పది నిమిషాల పాటు ఏఐ సాయం తీసుకున్నా కూడా.. అది లేనప్పుడు వారి పనితీరు గణనీయంగా పడిపోయిందని పరిశోధనలో తేలింది.
మెదడుకు 'అవుట్‌సోర్సింగ్' ముప్పు!
ఈ అధ్యయనంలో పాల్గొన్న రాచిత్ దూబే అనే పరిశోధకుడు కీలక హెచ్చరిక చేశారు. "ప్రజలు ఏఐ లేకుండా.. తప్పులు చేయడం మాత్రమే కాదు, కనీసం సొంతంగా ఆలోచించడానికి కూడా ఆసక్తి చూపడం లేదు" అని ఆయన పేర్కొన్నారు. దీనినే శాస్త్రవేత్తలు ‘కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్’ అని పిలుస్తున్నారు. అంటే మన మెదడు చేయాల్సిన పనిని యంత్రాలకు అప్పగించేయడం.
దీనివల్ల భవిష్యత్తులో మానవుల్లో:
{{/usCountry}}దీనివల్ల భవిష్యత్తులో మానవుల్లో:
{{/usCountry}}సృజనాత్మకత తగ్గిపోతుంది.
ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
కష్టమైన సమస్యలను పరిష్కరించే స్థైర్యం నశిస్తుంది.
నిత్యం చాట్‌బాట్‌లపై ఆధారపడటం వల్ల మనుషుల్లో అసహనం పెరుగుతుందని, ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచించడం అనవసరమైన శ్రమగా భావించే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఏఐ మనకు ఏం చేస్తోంది అనే దానికంటే, మన నుంచి అది ఏ శక్తిని లాగేసుకుంటోంది అనే దానిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు సూచిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఏఐ వాడటం వల్ల మన మెదడుకు కలిగే నష్టం ఏంటి?
ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల మెదడుకు పని తగ్గుతుంది. దీనివల్ల లోతుగా ఆలోచించే శక్తి, ఏకాగ్రత, సమస్యలను ఎదుర్కొనే పట్టుదల తగ్గిపోతాయి.
2. ఏఐని అస్సలు వాడకూడదా?
ఏఐ ఒక సాధనం మాత్రమే. దానిని సమాచారం కోసం వాడుకోవచ్చు, కానీ నిర్ణయాలు తీసుకోవడానికి లేదా విశ్లేషణాత్మక పనుల కోసం పూర్తిగా దానిపైనే ఆధారపడటం ప్రమాదకరం.
3. పిల్లల చదువుపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
హోంవర్క్ లేదా లెక్కల కోసం ఏఐని వాడే పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, సమస్యలను ఛేదించే పట్టుదల తగ్గుతాయని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.
4. 'కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్' అంటే ఏమిటి?
మన మెదడు ఉపయోగించి చేయాల్సిన పనులను (ఉదాహరణకు లెక్కలు చేయడం, గుర్తులు గుర్తుపెట్టుకోవడం) టెక్నాలజీకి అప్పగించడాన్ని కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్ అంటారు.