...
...
Next Story

Artificial Intelligence : భారత ఐటీ రంగాన్ని వణికిస్తున్న ఏఐ- 65% కంపెనీల్లో నియామకాలు కట్! షాకింగ్ రిపోర్టు..

భారతదేశంలోని 283 బిలియన్ డాలర్ల ఐటీ రంగాన్ని జనరేటివ్ ఏఐ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐసీఆర్ఐఈఆర్ తాజా అధ్యయనం ప్రకారం.. ఏఐ రాకతో 65% ఐటీ కంపెనీలు తమ నియామకాలను తగ్గించుకున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది.

Published on: Feb 15, 2026, 15:30:33 IST
Advertisement

ఇటు భారత ఐటీ రంగం ఈ ఏడాది చివరి నాటికి 283 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్న వేళ, అటు ఉద్యోగ కోతలపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్' (ఐసీఆర్​ఐఈఆర్​) ఇటీవల ప్రచురించిన "AI and Jobs: This Time Is No Different" అనే నివేదిక ఐటీ ఉద్యోగుల్లో నెలకొన్న భయాలను నిజం చేస్తోంది.

ఇండియా ఐటీ రంగంలో ఏఐ వినియోగంపై షాకింగ్​ నివేదిక..
ఇండియా ఐటీ రంగంలో ఏఐ వినియోగంపై షాకింగ్​ నివేదిక..

నవంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య దేశంలోని 10 ప్రధాన నగరాల్లోని 651 కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు.

నివేదికలోని కీలక ముఖ్యాంశాలు:

తగ్గిన నియామకాలు: జనరేటివ్ ఏఐని అందిపుచ్చుకున్న తర్వాత 65% కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించాయి! ఏఐ టూల్స్ సహాయంతో తక్కువ మందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయడమే దీనికి ప్రధాన కారణం.

ఫ్రెషర్లపై వేటు: ఐటీ కంపెనీల్లో కెరీర్ ప్రారంభించే ఫ్రెషర్లకు ఏఐ పెద్ద సవాలుగా మారింది. సుమారు 55శాతం కంపెనీలు ఫ్రెషర్ల నియామకాల్లో కోత విధించాయి. గతంలో జూనియర్ ఉద్యోగులు చేసే రొటీన్ కోడింగ్, టెస్టింగ్ పనులను ఇప్పుడు ఏఐ సాఫ్ట్‌వేర్‌లే పూర్తి చేస్తున్నాయి.

మిడ్-లెవల్ కి పెరిగిన డిమాండ్: ఏఐ టూల్స్‌ని పనిలో అనుసంధానించగలిగే నైపుణ్యం ఉన్న మిడ్-లెవల్ ఉద్యోగులకు 42శాతం కంపెనీల్లో గిరాకీ పెరిగింది. అయితే, సీనియర్ స్థాయిలో (82శాతం కంపెనీల్లో) పెద్దగా మార్పులేమీ కనిపించలేదు.

సాంకేతిక నైపుణ్యాలదే భవిష్యత్తు!

ఏఐ రాకతో కొన్ని ఉద్యోగాలు పోతున్న మాట వాస్తవమే అయినా, సాఫ్ట్‌వేర్ అనలిస్ట్‌లు, అప్లికేషన్ డెవలపర్లు, స్టాటిస్టీషియన్ల వంటి కీలక విభాగాల్లో నియామకాల జోరు తగ్గలేదు. కంపెనీలు మనుషులను పూర్తిగా తొలగించడం కంటే, ఏఐని వినియోగించుకోగల నైపుణ్యం ఉన్న వారికే ప్రాధాన్యతనిస్తున్నాయి.

ప్రస్తుతం కంపెనీలకు అవసరమైన టాప్ 3 నైపుణ్యాలు..

డేటా అనలిటిక్స్: 36% కంపెనీలు కోరుతున్నాయి.

మెషిన్ లెర్నింగ్: 35% కంపెనీల అవసరం.

మరోవైపు, డేటా ఎంట్రీ వంటి సాధారణ పనులను 32శాతం కంపెనీలు క్రమంగా తొలగిస్తున్నాయి.

శిక్షణలో వెనుకబాటు.. పెరిగిన అంతరం

ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇవ్వడంలో కంపెనీలు ఇంకా వెనుకబడే ఉన్నాయని నివేదిక సూచిస్తోంది. కేవలం 4% కంపెనీలు మాత్రమే తమ సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చాయి. శిక్షకుల కొరత (70%), అధిక ఖర్చు (68%) ఇందుకు ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయి.

"మేము పని విధానంలో ఒక పెద్ద మార్పును చూస్తున్నాం. ఏఐ మనుషులను రీప్లేస్ చేయడం కంటే, మానవ నైపుణ్యానికి తోడవుతోంది. ప్రస్తుతం కంపెనీలు తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాలి," అని ఓపెన్ ఏఐ చీఫ్ ఎకనామిస్ట్ రోనీ ఛటర్జీ అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తుపై అంచనా వేస్తే.. 44% కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యలో మార్పు ఉండకపోవచ్చని చెప్పగా, 28% కంపెనీలు పెరుగుదల ఉంటుందని, 27% కంపెనీలు జాబ్స్​ తగ్గే అవకాశం ఉందని వెల్లడించాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks