Electric Scooter : సింగిల్ ఛార్జ్‌తో హైదరాబాద్ టు ద్వారకా తిరుమల! రేంజ్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తోపు..
ప్రముఖ భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'సింపుల్ ఎనర్జీ' తన సరికొత్త మోడల్ ‘సింపుల్ అల్ట్రా’ను ఇటీవలే లాంచ్ చేసింది. దీని రేంజ్ 400 కి.మీగా ఉండటం విశేషం! ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎలక్ట్రిక్ వాహనం కొనాలంటే ప్రజలు ముందుగా భయపడేది ‘రేంజ్’ గురించి. ఎక్కడికైనా వెళితే బండి మధ్యలో ఆగిపోతే? అన్న ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. ఈ ‘రేంజ్ యాంగ్జైటీ’ని తొలగించేందుకు ఆటోమొబైల్ సంస్థలు క్రేజీ ప్రాడక్ట్స్తో ప్రజల ముందుకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఇప్పుడు లాంగ్ రేంజ్ ఈవీల హవా నడుస్తోంది. ఇక ఈ విభాగంలోకి.. సింపుల్ ఎనర్జీకి చెందిన సింపుల్ అల్ట్రా ఈ-స్కూటర్ తాజాగా చేరింది. దీని రేంజ్ ఏకంగా 400 కి.మీ! అంటే.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారకా తిరుమల (375 కి.మీ) వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీదే ప్రయాణించవచ్చు!

ఈ నేపథ్యంలో ఈ సింపుల్ అల్ట్రా ఈవీ ఫీచర్స్ సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సింపుల్ అల్ట్రా- బ్యాటరీ సామర్థ్యం, రేంజ్..
బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ తన ‘జెన్ 2’ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఈ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో వస్తున్న ఈ స్కూటర్, ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది.
సింపుల్ అల్ట్రా స్కూటర్ పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడలేదని కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి.
బ్యాటరీ: ఇందులో 6.5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐడీసీ ప్రమాణాల ప్రకారం ఏకంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
వేగం: కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.
రికార్డు: భారత్‌లో సింపుల్ వన్ (5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్) తర్వాత అత్యంత వేగవంతమైన రెండో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇది నిలిచింది. అయితే, దీని మోటార్ పవర్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
సింపుల్ అల్ట్రా- అధునాతన ఫీచర్లు..
రైడర్ల సౌకర్యం, భద్రత కోసం ఈ సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్లో అత్యాధునిక సాంకేతికతను జోడించారు.
ట్రాక్షన్ కంట్రోల్: ఇందులో నాలుగు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉంది, ఇది వివిధ రోడ్డు పరిస్థితుల్లో స్కూటర్ జారిపోకుండా నియంత్రిస్తుంది.
డిస్‌ప్లే: స్కూటర్ ముందు భాగంలో 7- ఇంచ్ భారీ డిస్‌ప్లే కన్సోల్ ఉంటుంది. ఇందులో బ్యాటరీ శాతం, రేంజ్, నావిగేషన్ వంటి కీలక సమాచారాన్ని చూడవచ్చు.
సింపుల్ అల్ట్రా- ధర..
అధిక రేంజ్ కారణంగా ఈ సింపుల్ అల్ట్రా ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 2.34లక్షలుగా ఉంది.
సింపుల్ ఎనర్జీ- విస్తరణ దిశగా అడుగులు..
ప్రస్తుతం సింపుల్ ఎనర్జీకి దేశవ్యాప్తంగా సుమారు 70 టచ్ పాయింట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే నాగ్‌పూర్, రాంచీ, భువనేశ్వర్ వంటి నగరాలకు కూడా విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో..
2026 సంవత్సరంలో సింపుల్ ఎనర్జీ విడుదల చేసిన నాలుగో ప్రాడక్ట్ ఇది. ఇప్పటికే కంపెనీ వద్ద సింపుల్ వన్ జెన్ 2 (రేంజ్ 236 కి.మీ, 265 కి.మీ - ధర రూ. 1.94 లక్షలు), సింపుల్ వన్ ఎస్ (రేంజ్ 190 కి.మీ - ధర రూ. 1.74 లక్షలు) వంటి మోడళ్లు ఉన్నాయి. ఇప్పుడు అల్ట్రా రాకతో కంపెనీ లైనప్ మరింత బలోపేతం అయింది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత?
దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.34 లక్షలుగా ఉంది.
2. ఈ స్కూటర్ రేంజ్ ఎంత?
సింపుల్ అల్ట్రా 6.5 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 400 కిలోమీటర్ల (IDC రేంజ్) మైలేజీని ఇస్తుంది.
3. దీని గరిష్ట వేగం ఎంత?
ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అలాగే 2.77 సెకన్లలోనే 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
4. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉందా?
అవును, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని కంపెనీ షోరూమ్‌లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


