ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లే- కానీ కొనేవారే లేరు! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితేంటి?
Hyderabad real estate : హైదరాబాద్ నగరం నలుమూలలా ఇప్పుడు ఆకాశహర్మ్యాలే కనిపిస్తున్నాయి. అపరిమితమైన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ సౌలభ్యంతో బిల్డర్లు 40-50 అంతస్తుల మేర భవనాలను నిర్మిస్తున్నారు. అయితే, పైకి చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాల వెనుక ధరలు, అయోమయ మౌలిక వసతులు దాగున్నాయనే చర్చ మొదలైంది.
Hyderabad Real Estate : హైదరాబాద్‌లో రూ. 2 కోట్ల పైబడిన ఫ్లాట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ఈ ధరలకు కేంద్రబిందువుగా మారింది. అయితే కొత్త లాంచ్‌లలో ఉన్న జోరు రీసేల్ మార్కెట్‌లో లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత వంటివి ఇన్వెస్టర్లను, గృహ కొనుగోలుదారులను కలవరపెడుతున్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లు ఏకంగా 46శాతం పడిపోవడం మార్కెట్ మందగమనానికి సంకేతంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్- మౌలిక వసతులు లేని 'లగ్జరీ' నరకం?
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా రెడిట్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో నెటిజన్లు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. "హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ. 8,000 నుంచి రూ. 12,000 వసూలు చేస్తున్నారు. కానీ, వర్షం వస్తే ఆ రోడ్లపై నడవగలమా? డ్రైనేజీ వ్యవస్థ ఉందా? కనీసం తాగునీటి సరఫరా ఉందా?" అని కొనుగోలుదారులు నిలదీస్తున్నారు.
పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో సుమారు 20,000కు పైగా లగ్జరీ యూనిట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఈ భారీ భవనాల్లో వేల సంఖ్యలో కుటుంబాలు చేరితే, ఇప్పటికే ఊపిరాడని ట్రాఫిక్‌తో సతమతమవుతున్న ఆ ప్రాంత మౌలిక వసతులు ఆ భారాన్ని మోయగలవా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సరైన రోడ్లు, డ్రైనేజీ లేని చోట రూ. 2 కోట్లు పోసి ఫ్లాట్ కొనడం 'లగ్జరీ' అనిపించుకుంటుందా లేక 'నరకం' అవుతుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్- నిలిచిపోయిన రిటర్న్స్.. రీసేల్ మార్కెట్ వెలవెల!
రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడైనా రీసేల్ మార్కెట్ బలంగా ఉంటేనే ఆ రంగం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అని నిపుణులు చెబుతుంటారు.
కానీ హైదరాబాద్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది.
పెట్టుబడి దారి తప్పిందా?: మూడేళ్ల క్రితం ఒక కోటి రూపాయలు పెట్టి కొన్న ఫ్లాట్, ఈరోజు అమ్మాలంటే కొనేవారే లేరు! ఒకవేళ ఉన్నా, కొన్న ధరకే అడగడం లేదా అంతకంటే తక్కువకు బేరం చేయడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
హోమ్ లోన్ భారం: బ్యాంకు వడ్డీలు కలుపుకుంటే, మూడేళ్ల తర్వాత ఆ ఆస్తి విలువ పెరగకపోగా, ఇన్వెస్టర్లు నికరంగా నష్టపోతున్నారు. "మా స్నేహితుడు పెట్టుబడి కోసం లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్నాడు, ఇప్పుడు బయటపడలేకపోతున్నాడు," అని ఒక బాధితుడు పేర్కొన్నాడు.
నివాస యోగ్యం కాని ప్రాంతాలు: భారీ నిర్మాణాల వల్ల వచ్చే దుమ్ము, తక్కువ జనాభా వంటి కారణాలతో కొత్త కమ్యూనిటీలు కేవలం పేరుకే 'హైటెక్'గా మిగిలిపోతున్నాయని, పాత నగరంలో ఉన్న సౌకర్యం, అనుబంధం ఇక్కడ లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్- అసలు ఈ డిమాండ్‌ను నడిపిస్తోంది ఎవరు?
ధరలు ఇంతలా ఉన్నా, కొత్త లాంచ్‌లలో బుకింగ్స్ జరుగుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. దీని వెనుక ప్రధానంగా మూడు శక్తులు ఉన్నాయి:
హై ఎర్నింగ్ ప్రొఫెషనల్స్: ఐటీ రంగంలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, భారీగా ఈ-సాప్స్ పొందిన టెక్కీలు ఆఫీసులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భారీ ధరలకు వెనకాడటం లేదు.
ఎన్ఆర్ఐల ప్రభావం: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం ప్రవాస భారతీయులకు కలిసి వస్తోంది. వారు హైదరాబాద్‌ను ఒక సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌గా చూస్తున్నారు.
రాజకీయ, స్థానిక ధనికులు: తెలంగాణలో భూముల ధరలు పెరగడంతో, తమ ఊర్లలో భూములు అమ్మిన వారు ఆ డబ్బును నగరంలోని లగ్జరీ ఫ్లాట్లపై పెడుతున్నారు.
అపరిమిత ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) వరం: బిల్డర్లు ఎక్కువ అంతస్తులు కట్టే అవకాశం ఉండటంతో క్లబ్‌హౌస్‌లు, గ్రీన్ స్పేస్‌లు వంటి సౌకర్యాలతో ప్రాజెక్టులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
2026 మొదటి త్రైమాసికం: ఒక హెచ్చరిక!
నోబ్రోకర్ నివేదిక ప్రకారం, 2026 క్యూ1లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీ కరెక్షన్‌ను చూసింది. నివాస గృహాల లాంచ్‌లు ఏకంగా 46% పడిపోయాయి. గతంలో నెలకు వేల సంఖ్యలో కొత్త యూనిట్లు మార్కెట్లోకి వచ్చేవి, కానీ మార్చి నెలలో కొత్త సరఫరా దాదాపు శూన్యం.
హైదరాబాద్‌లో 80శాతం కంటే ఎక్కువ ఫ్లాట్లు 3బీహెచ్‌కే లేదా అంతకంటే పెద్దవి మాత్రమే ఉంటున్నాయి. సగటు ఫ్లాట్ సైజు 2,050 చదరపు అడుగులుగా ఉంది. సామాన్య మధ్యతరగతి వ్యక్తికి అవసరమైన 2బీహెచ్‌కే లేదా చిన్న ఫ్లాట్లు మార్కెట్ నుంచి మాయమైపోతున్నాయి. దీనివల్ల దాదాపు 84% మంది కొనుగోలుదారులు "అఫర్డబిలిటీ స్ట్రెస్" (ధర భరించలేకపోవడం) ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్- భవిష్యత్తు ఏంటి?
అపరిమిత ఎఫ్ఎస్ఐ అనేది ఒక వరంలా కనిపించినా, అది నిర్మాణ వ్యయాన్ని కూడా విపరీతంగా పెంచేస్తోంది. ఆకాశహర్మ్యాలు కట్టాలంటే కావాల్సిన ఇంజనీరింగ్ టెక్నాలజీ, సేఫ్టీ సిస్టమ్స్ వల్ల బిల్డర్లపై భారం పడుతోంది. అది తిరిగి కస్టమర్ల మీదనే పడుతోంది. మౌలిక వసతులు మెరుగుపడకుండా కేవలం భవనాలు మాత్రమే పెరిగితే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బబుల్ పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. హైదరాబాద్‌లో ఫ్లాట్ల ధరలు ఎందుకు అంత ఎక్కువగా ఉన్నాయి?
ప్రధానంగా ఐటీ కారిడార్‌లో భూమి లభ్యత తక్కువగా ఉండటం, అపరిమిత ఎఫ్ఎస్ఐ వల్ల నిర్మాణ వ్యయం పెరగడం, లగ్జరీ సౌకర్యాలతో కూడిన పెద్ద ఫ్లాట్ల నిర్మాణమే ఇందుకు కారణం.
2. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇల్లు కొనడం పెట్టుబడిగా మంచిదేనా?
రీసేల్ మార్కెట్ ప్రస్తుతం మందగించి ఉన్నందున, దీర్ఘకాలిక అవసరాల కోసం (నివసించడానికి) కొంటే ఫర్వాలేదు కానీ, తక్షణ లాభాల కోసం పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
3. అపరిమిత ఎఫ్ఎస్ఐ వల్ల నష్టమేంటి?
భవనాలు పెరిగే కొద్దీ ఆ ప్రాంతంలో జనాభా సాంద్రత పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


