Kinetic DX+ : పాత జ్ఞాపకం.. కొత్త రూపం! ఈ కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చా? రివ్యూ..
Kinetic electric scooter : తొంభైల కాలంలో స్కూటర్ అంటే గేర్లు లేని కైనెటిక్ హోండానే గుర్తొచ్చేది. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడంతో కైనెటిక్ మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కైనెటిక్ నుంచి వచ్చిన డీఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందో వివరించే రివ్యూని ఇక్కడ చూసేయండి..
Electric scooter for city drive : ఒకప్పుడు మధ్యతరగతి భారతీయ కుటుంబాల్లో 'కైనెటిక్' అంటే ఒక ఎమోషన్! దశాబ్దాల కాలం పాటు భారత రోడ్లను ఏలిన ఆ బ్రాండ్, ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో ‘డీఎక్స్ ప్లస్’ అనే పేరుతో మన ముందుకు వచ్చింది. మరి ఈ కొత్త ఈవీ పాత వైభవాన్ని తెస్తుందా? నేటి పోటీ ప్రపంచంలో నిలబడుతుందా? కైనెటిక్ డీఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూని ఇక్కడ చూసేయండి..
కైనెటిక్ డీఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్: మెటల్ బాడీతో పక్కా లోకల్!
కొత్త కైనెటిక్ డీఎక్స్+ చూడటానికి పాత డీఎక్స్ మోడల్‌ను గుర్తుకు తెస్తుంది. కైనెటిక్ సంస్థ దీని బాడీని పూర్తిగా మెటల్ ప్యానెల్స్‌తో తయారు చేసింది. ప్లాస్టిక్ బాడీ ఉన్న ఇతర ఈవీలతో పోలిస్తే, మన నగరాల్లోని రద్దీలోనూ, ఇరుకైన సందుల్లోనూ ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తం లైటింగ్ వ్యవస్థను ఎల్‌ఈడీగా మార్చారు. అయితే, కొన్ని చోట్ల ప్లాస్టిక్ ఫినిషింగ్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అయితే ప్రీమియం లుక్ కంటే కూడా మన్నికకే కంపెనీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.
కైనెటిక్ డీఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్: ట్రాఫిక్‌లో ఈజీ డ్రైవింగ్..
ఈ కైనెటిక్ డీఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.78 కేడబ్ల్యూ సామర్థ్యం గల బీఎల్డీసీ మోటార్‌ను వాడారు. ఇందులో రేంజ్, పవర్, టర్బో అనే మూడు మోడ్‌లు ఉన్నాయి.
స్మూత్ రైడింగ్: దీని థ్రోటిల్ చాలా స్మూత్‌గా ఉంది. అంటే మీరు యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఒక్కసారిగా దూసుకుపోకుండా, నియంత్రిత వేగంతో కదులుతుంది. ఇది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి, మహిళలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
సస్పెన్షన్: గుంతల రోడ్లపై ప్రయాణించినప్పుడు కూడా షాక్ అబ్జార్బర్లు చాలా సాఫీగా స్పందిస్తున్నాయి. అయితే, బ్యాటరీని ఫ్లోర్ బోర్డ్‌లో పెట్టడం వల్ల కాళ్లు పెట్టుకునే చోటు కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది. దీనివల్ల పొడవుగా ఉన్నవారికి కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు.
కైనెటిక్ డీఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు: స్పీకర్లు, మ్యాప్స్..
నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కైనెటిక్ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్ చెప్పే స్పీకర్లను కూడా అమర్చింది.
ఛార్జింగ్ కేబుల్: ఈ స్కూటర్‌లో నాకు బాగా నచ్చిన విషయం ‘రిట్రాక్టబుల్ ఛార్జింగ్ కేబుల్’. స్కూటర్ ముందు భాగంలోనే వైర్ ఉంటుంది. మనం దాన్ని లాగి ప్లగ్ పాయింట్‌కు కనెక్ట్ చేయవచ్చు. ఛార్జింగ్ అయ్యాక చిన్నగా లాగితే అది దానంతట అదే లోపలికి వెళ్లిపోతుంది. విడిగా ఛార్జర్ మోయాల్సిన పని లేదు.
హిల్ హోల్డ్: ఎత్తు పల్లాల్లో ఆగి ఉన్నప్పుడు వెనక్కి జారిపోకుండా ఉండే హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఉంది. కాకపోతే ఇది పనిచేయాలంటే రెండు బ్రేకులను కాసేపు నొక్కి పట్టాల్సి ఉంటుంది.
కైనెటిక్ డీఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, రేంజ్..
ఇందులో 2.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 105 కిలోమీటర్ల వరకు రేంజ్‌ని కంపెనీ చెబుతోంది.
"ఈ బడ్జెట్‌లో సిటీ అవసరాలకు 100 కిలోమీటర్ల రేంజ్ సరిపోతుంది, కానీ దీని రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ రోడ్ల పరిస్థితిని బట్టి మారవచ్చు," అని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
0 నుంచి 80 శాతం ఛార్జింగ్ కావడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది.
కైనెటిక్ డీఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరికి సెట్ అవుతుంది?
మీకు వేగం కంటే సేఫ్టీ ముఖ్యమైతే, రోజువారీ పనుల కోసం మన్నికైన స్కూటర్ కావాలంటే ఈ కైనెటిక్ డీఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆప్షన్. ముఖ్యంగా పాత కైనెటిక్ జ్ఞాపకాలు ఉన్నవారికి ఇది బాగా నచ్చుతుంది. కానీ, మీరు మంచి స్పోర్టీ లుక్, అత్యంత వేగవంతమైన స్కూటర్ కోరుకుంటే మాత్రం ఇతర ఆప్షన్లు చూడాల్సిందే.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. కినెటిక్ డీఎక్స్+ రేంజ్ ఎంత?
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ సుమారు 105 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
2. దీని బాడీ దేనితో తయారైంది?
ఇతర ఆధునిక స్కూటర్లలా కాకుండా, కైనెటిక్ డీఎక్స్+ పూర్తి మెటల్ బాడీతో వస్తుంది. దీనివల్ల మన్నిక ఎక్కువగా ఉంటుంది.
3. బ్యాటరీ ఛార్జింగ్ కావడానికి ఎంత సమయం పడుతుంది?
సున్నా నుంచి 100 శాతం ఛార్జింగ్ కావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. ఇందులో ఆన్‌బోర్డ్ ఛార్జర్ సదుపాయం కూడా ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


