...
...
Next Story

Bank holidays : ‘ఇక నుంచి ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు’.. వైరస్​ పోస్ట్​లో నిజం ఎంత?

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఎస్‌బీఐలకు ప్రతి శనివారం సెలవు ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలపై పిఐబి స్పందించింది. ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పింది.

Published on: Oct 3, 2026, 10:01:46 IST
Advertisement

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం సెలవు ప్రకటించిందంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇందుకు ఆధారంగా చక్కర్లు కొడుతోంది. వారానికి 5 రోజుల పని కోసం బ్యాంకింగ్ యూనియన్లు నిరసనలు చేస్తున్న వేళ ఈ పోస్టు వైరల్​ అవ్వడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా బ్యాంకు ఉద్యోగులు, సాధారణ ఖాతాదారుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసిన ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫాక్ట్ చెకింగ్ విభాగం ‘పీఐబీ ఫాక్ట్ చెక్’ తక్షణమే స్పందించి అసలు నిజాలను వెల్లడించింది.

వైరల్ అవుతున్న పోస్ట్​లో నిజం ఎంత?

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుందా?
ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుందా?

సోషల్ మీడియాలో తిరుగుతున్న సదరు గెజిట్ నోటిఫికేషన్ కేవలం ఒక నకిలీ పత్రమని పీఐబీ ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది.

"కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (@FinMinIndia) ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం అధికారికంగా సెలవు ప్రకటిస్తూ ఎలాంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. నెట్టింట వైరల్ అవుతున్న సర్క్యులర్ నిజం కాదు," అని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.

ఈ పత్రంపై సెప్టెంబర్ 30, 2026 అనే తేదీ ముద్రించి ఉంది. ప్రభుత్వం తక్షణమే అమలులోకి వచ్చేలా ప్రతి శనివారాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించిందని అందులో రాసి ఉంది. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని అధికారులు తేల్చేశారు.

వారానికి 5 రోజుల పనిదినాల డిమాండ్ వెనుక అసలు కథ..

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను బ్యాంక్ యూనియన్లు వాయిదా వేసుకున్న కొద్ది రోజులకే ఈ ఫేక్ నోటిఫికేషన్ బయటకు రావడం గమనార్హం. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లలో వారానికి 5 రోజుల పనిదినాల విధానం ఒకటి. ఈ ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే శని, ఆదివారాలు బ్యాంకు ఉద్యోగులకు వారాంతపు సెలవులుగా మారతాయి.

బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల ప్రకారం.. ప్రతి నెలలోని రెండొవ శనివారం, నాల్గొవ శనివారం మాత్రమే బ్యాంకులకు అధికారిక సెలవు దినాలుగా ఉంటాయి. మొదటి, మూడొవ, ఐదొవ (ఒకవేళ నెలలో వస్తే) శనివారాలు సాధారణ పనిదినాలుగానే కొనసాగుతాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే వరకు పాత విధానమే అమలులో ఉంటుందని స్పష్టమవుతోంది.

ప్రబుత్వంతో జరుగుతున్న చర్చలలో ఈ వారానికి 5 రోజుల పనిదినాల అంశంతో పాటు, ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ఏకపక్షంగా ప్రవేశపెట్టిందని ఆరోపిస్తున్న పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంపై కూడా బ్యాంక్ యూనియన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ గెజిట్‌‌లను నమ్మవద్దని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారాన్ని ధృవీకరణ కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పీఐబీ కోరింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks