Gandhi jayanti 2026 : వరుసగా 3 రోజులు స్టాక్ మార్కెట్లు బంద్- ఈరోజు బ్యాంకులకు సెలవు
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, బ్యాంకులు మూతపడ్డాయి. వారంతపు సెలవులతో కలిపి వరుసగా మూడు రోజుల పాటు ట్రేడింగ్, బ్యాంకింగ్ శాఖల సేవలు నిలిచిపోనున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు, బ్యాంకింగ్ వినియోగదారులకు అలర్ట్! అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి జాతీయ సెలవుదినం కావడంతో బాంబేే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి.

మరోవైపు శుక్రవారంతో పాటు శని, ఆదివారాలు తోడవడంతో వరుసగా మూడు రోజుల పాటు మార్కెట్ ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. బ్యాంకులు మాత్రం శనివారం పనిచేస్తాయి.
మరిన్ని వివరాల్లోకి వెళితే..
మార్కెట్లలో మూడు రోజుల పాటు ట్రేడింగ్ బంద్..
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ అధికారిక క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2న అన్ని రకాల ట్రేడింగ్ విభాగాలు మూతపడ్డాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఎన్‌డీఎస్-ఆర్ఎస్టీ, ట్రై పార్టీ రేపో విభాగాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. దీనితో పాటు కమోడిటీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ సెగ్మెంట్లు కూడా పనిచేయవు. వారాంతపు సెలవుల అనంతరం అక్టోబర్ 5 (సోమవారం) ఉదయం యథావిధిగా మార్కెట్లు తిరిగి ప్రారంభమవుతాయి.
అక్టోబర్ నెలలో మరిన్ని మార్కెట్ సెలవులు..
గాంధీ జయంతి సెలవు మాత్రమే కాకుండా, అక్టోబర్ నెలలో స్టాక్ మార్కెట్లకు మరొక పండుగ సెలవు ఉంది. దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 20 (మంగళవారం) నాడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ట్రేడింగ్‌ను నిలిపివేయనున్నారు. క్యాపిటల్ మార్కెట్, డెరివేటివ్స్, డెబిట్ మార్కెట్, గోల్డ్ రిసిప్ట్స్ విభాగాలన్నీ ఆ రోజు బంద్ కానున్నాయి.
2026 మిగిలిన కాలంలో దీపావళి (నవంబర్ 10), శ్రీ గురునానక్ జయంతి (నవంబర్ 24), క్రిస్మస్ (డిసెంబర్ 25) రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉంటాయని ఎక్స్ఛేంజ్‌లు స్పష్టం చేశాయి.
గురువారం స్టాక్ మార్కెట్లు ఇలా..
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 571 పాయింట్లు పడి 71,920 వద్దకు చేరింది. నిఫ్టీ50 199 పాయింట్లు కోల్పోయి 22,422 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 182 పాయింట్లు పడి 54,451 వద్ద ముగిసింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధం, ముడిచమురు సెగ, విదేశీ నిధుల తరలింపుతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. నిఫ్టీ 50 సూచీలోని సగానికి పైగా బ్లూచిప్ షేర్లు తమ గరిష్ట స్థాయిల నుంచి 20% పైగా పతనమై బేర్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంకులు బంద్.. డిజిటల్ లావాదేవీలు యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం గాంధీ జయంతి జాతీయ సెలవు కావడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ, సహకార బ్యాంకుల శాఖలన్నీ నేడు మూతపడ్డాయి. అక్టోబర్ నెలలో దసరా, దుర్గాపూజ, ఇతర ప్రాంతీయ పండుగల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు అనేక సెలవులు ఉన్నాయి.
అయితే బ్యాంక్ శాఖలు భౌతికంగా మూతపడినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. యూపీఐ (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం), నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్లు కూడా యథావిధిగా పనిచేస్తాయి. డిమాండ్ డ్రాఫ్ట్‌లు (డీడీ), చెక్కుల క్లియరెన్స్, లాకర్ సేవలు కావాలనుకునే వారు మాత్రం బ్యాంకులు తిరిగి తెరిచే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


