భారత్- ఈయూ చారిత్రక వాణిజ్య ఒప్పందం- 10 ముఖ్యాంశాలు..

2007 నుంచి సాగుతున్న నిరీక్షణకు తెరదించుతూ భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్​టీఏ) నేడు ఖరారు చేసే అవకాశం ఉంది. అమెరికా టారిఫ్​ల వల్ల ప్రపంచ వాణిజ్యం అస్థిరంగా ఉన్న తరుణంలో ఈ ఒప్పందం ఇరు పక్షాలకు ప్రయోజనం చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Published on: Jan 27, 2026, 11:15:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత్​- ఈయూ నేతల మధ్య మంగళవారం దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా దశాబ్దాలుగా సాగుతున్న భారత్​- యూరోపియిన్​ యూనియన్​ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలకు ముగింపు పడుతుందని, ఈ డీల్​లో కీలక విషయాలను నేడు వెల్లడిస్తారని అంచనాలు ఉన్నాయి.

భారత్- ఈయూ చారిత్రక వాణిజ్య ఒప్పందం (Bloomberg)
భారత్- ఈయూ చారిత్రక వాణిజ్య ఒప్పందం (Bloomberg)

అమెరికా విధిస్తున్న టారిఫ్ల కారణంగా ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొన్న వేళ.. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందు ఇరు పక్షాలకు ఇది చక్కటి అవకాశం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, దిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ఈ ఒప్పందాన్ని “మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్” అని అభివర్ణించారు.

ఈ నేపథ్యంలో భారత్​-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

భారత్​- ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద- 10 కీలక అంశాలు:

భారత్-ఈయూల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు మొదట 2007లో ప్రారంభమయ్యాయి, అయితే లక్ష్యాల విషయంలో స్పష్టత లేకపోవడంతో 2013లో ఇవి నిలిచిపోయాయి. మళ్లీ జూన్ 2022లో చర్చలు పునఃప్రారంభమయ్యాయి.

నేటి సమావేశంలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇస్తారు.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్​టీఏ) వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత లోతుగా మార్చడంలో కీలక మార్పును తీసుకువస్తుందని భావిస్తున్నారు. నేటి సమావేశంలో ప్రధానంగా వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, కీలక సాంకేతికతలు, నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టనున్నారు.

ఇరు పక్షాలు రక్షణ రంగం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని, వ్యూహాత్మక అజెండాను కూడా ఆవిష్కరించనున్నాయి. ఐరోపా తన రక్షణ, ఆర్థిక అవసరాల కోసం అమెరికా- చైనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇతర ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ భాగస్వామ్యం కుదిరింది.

భారత్- ఈయూలు ఒక "చారిత్రక వాణిజ్య ఒప్పందానికి" చేరువలో ఉన్నాయని, ఇది 200 కోట్ల మంది జనాభాతో కూడిన మార్కెట్‌ను సృష్టిస్తుందని వాన్ డెర్ లేయెన్ గత వారం పేర్కొన్నారు. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగో వంతు వాటా కలిగి ఉంటుందని వెల్లడించారు.

భారత్- యూరోపియన్ యూనియన్ 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్టనర్‌షిప్ (ఎస్​డీపీ) ఇరు పక్షాల మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత వేగవంతం చేస్తుంది.

ఈ ఎస్​డీపీ రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఈయూ 'సేఫ్' (సెక్యూరిటీ యాక్షన్​ ఫర్​ యూరోప్​) ప్రోగ్రామ్‌లో భారతీయ కంపెనీలు పాల్గొనడానికి మార్గాలను తెరుస్తుంది. 'సేఫ్' అనేది సభ్య దేశాల రక్షణ సన్నద్ధతను వేగవంతం చేయడానికి రూపొందించిన 150 బిలియన్ యూరోల ఆర్థిక నిధి.

భారతీయ కార్మికులు ఐరోపాకు వెళ్లే ప్రక్రియను సులభతరం చేసేందుకు కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ఈ సదస్సులో మరో కీలక ఫలితం కానుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే భారత్‌తో ఇటువంటి వలస- మొబిలిటీ భాగస్వామ్యాలను కలిగి ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా ప్రస్తుత అంతర్జాతీయ సవాళ్లపై ఇరు పక్షాలు చర్చించే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ, స్థిరమైన అంతర్జాతీయ వ్యవస్థను కలిగి ఉండాలనే ఉమ్మడి ప్రయోజనాలను భారత్​- ఈయూ పంచుకుంటున్నాయి.

గత కొన్నేళ్లుగా భారత్-ఈయూ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. వస్తువుల వాణిజ్యంలో భారత్‌కు ఈయూ అతిపెద్ద భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్, ఈయూ మధ్య మొత్తం వస్తు వాణిజ్యం విలువ 136 బిలియన్ డాలర్లుగా ఉంది (ఎగుమతులు 76 బిలియన్​ డాలర్లు, దిగుమతులు 60 బిలియన్ డాలర్లు).

ఒప్పందాన్ని కొనియాడిన ప్రధాని మోదీ..

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని మోదీ "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అని ప్రశంసించారు. ఇది రెండు వైపులా ఉన్న ప్రజలకు, వ్యాపారాలకు భారీ అవకాశాలను కల్పిస్తుందని, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. 25 శాతం ప్రపంచ జీడీపీ, మూడో వంతు అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహిస్తుందని మోదీ పేర్కొన్నారు.

అమెరికా హెచ్చరిక..

ఈ ఒప్పందంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఐరోపా తనపై తానే "యుద్ధానికి" నిధులు సమకూర్చుకుంటోందని హెచ్చరించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఐరోపా నేరుగా రష్యాతో సంబంధాలను తెంచుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, భారత్ ద్వారా రష్యా చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ పరోక్షంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు ఇస్తోందని ఆరోపించారు.

రష్యా ఇంధన వ్యాపారాన్ని అస్థిరపరచడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తుంటే, ఐరోపా మాత్రం అంతర్జాతీయ చమురు వాణిజ్యంలోని లొసుగుల ద్వారా ఆర్థికంగా లాభపడుతోందని విమర్శించారు. రష్యా చమురు కొంటున్నందుకు భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం టారిఫ్​లు విధించిందని (ఇందులో రష్యా చమురు కొనుగోలుకు 25 శాతం) గుర్తు చేశారు.

"రష్యా చమురు భారత్‌కు వెళుతుంది, అక్కడ శుద్ధి చేసి బయటకు పంపిస్తున్నారు. దానిని యూరోపియన్లు కొంటున్నారు. వారు తమపై తామే యుద్ధానికి నిధులు ఇచ్చుకుంటున్నారు," అని బెసెంట్ అన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More