...
...
Next Story

Amazon layoffs : అమెజాన్‌లో భారీ లేఆఫ్స్- ఒకేసారి 30,000 ఉద్యోగుల తొలగింపు!

ఒకేసారి దాదాపు 30వేల వరకు ఉద్యోగాలను తొలగించేందుకు అమెజాన్​ సంస్థ ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మంగళవారం నుంచే అమెజాన్​ లేఆఫ్స్​ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది.

Published on: Oct 28, 2025, 06:05:15 IST
Advertisement

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోమారు లేఆఫ్స్​కి సిద్ధమవుతోందని సమాచారం. మంగళవారం నుంచే దాదాపు 30,000 కార్పొరేట్ ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోందని ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది. ఈ విషయమై తెలిసిన ముగ్గురు వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ నివేదికను వెలువరించింది.

అమెజాన్​లో భారీ లేఆఫ్​.. (Bloomberg)
అమెజాన్​లో భారీ లేఆఫ్​.. (Bloomberg)

కరోనా మహమ్మారి సమయంలో భారీగా విస్తరించిన సంస్థ, ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్​ లేఆఫ్స్​- 2022 తర్వాత అతిపెద్దది..

ప్రస్తుతం అమెజాన్‌లో సుమారు 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 10 శాతం మందిని తొలగించాలని సంస్థ యోచిస్తోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో పనిచేస్తున్న మొత్తం 15.5 లక్షల (1.55 మిలియన్) మంది సిబ్బందిలో ఇది ఒక చిన్న భాగం!

ఈ లేఆఫ్స్ గనక ఖరారైతే, 2022 సంవత్సరం చివరిలో దాదాపు 27,000 ఉద్యోగాలను తొలగించిన తర్వాత సంస్థ చేస్తున్న అతిపెద్ద కోత ఇదే అవుతుంది.

ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ ప్రతినిధి నిరాకరించారని రాయిటర్స్ పేర్కొంది.

అమెజాన్​ లేఆఫ్స్​- ఆ విభాగాలపై ప్రభావం!

ఉద్యోగుల తొలగింపులు సంస్థలోని పలు విభాగాల్లో ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా, ఆర్థికపరమైన ప్రాధాన్యతలు మారుతున్న నేపథ్యంలో పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ (మానవ వనరులు), డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్ విభాగాల్లోని ఉద్యోగాలకు ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందని నివేదిక తెలిపింది.

గత రెండేళ్లుగా అమెజాన్.. డివైసెస్, కమ్యూనికేషన్స్, పాడ్‌కాస్టింగ్, ఇతర చిన్న చిన్న టీమ్‌లలో కొంతమంది ఉద్యోగులను తగ్గించింది.

అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ.. సంస్థలో "అధికంగా ఉన్న బ్యూరోక్రసీ"ని తగ్గించేందుకు, నిర్వహణ స్థాయిలను కుదించేందుకు ఒక ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. సంస్థలో ఎక్కడైనా సమర్థత లోపాలు ఉంటే వాటిని అనామకంగా తెలియజేయడానికి ఆయన ఒక అంతర్గత వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు దాదాపు 1,500 దరఖాస్తులు అందగా, 450కి పైగా ప్రక్రియల్లో మార్పులు జరిగాయి.

పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని జస్సీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే చెప్పారు.

కోతల సంఖ్య మారే అవకాశం!

అమెజాన్ ఆర్థిక వ్యూహం నిరంతరం మారుతున్నందున, చివరికి తొలగించే ఉద్యోగుల సంఖ్యలో మార్పులు ఉండవచ్చని రాయిటర్స్‌కు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరోవైపు సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి అమెజాన్ షేర్లు 1.3% పెరిగి 227.11 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe