పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం: 10 ఏళ్ల జైలు, ₹10 కోట్ల జరిమానాతో కేంద్రం కొత్త బిల్లు
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సుదీర్ఘ ఆందోళనలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామాల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు శిక్షల తీవ్రతను రెట్టింపు చేస్తూ, కేసుల విచారణకు కఠిన సమయ పరిమితులు విధిస్తూ 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026'ను తీసుకువస్తోంది.
నీట్-యూజీ పేపర్ లీకేజీ ఉదంతంపై గత 50 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP), కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో నిరుద్యోగ యువతలో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పేపర్ లీకేజీల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026'ను సిద్ధం చేసింది.
ఈ బిల్లును వచ్చే సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. "యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవు" అని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేసిన వీడియో సందేశంలో స్పష్టం చేశారు.
రెండేళ్లలోనే చట్టంలో మార్పులు ఎందుకు?
పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో తొలిసారిగా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. నీట్-యూజీ, యుజిసి-నెట్ వివాదాల తీవ్రత దృష్ట్యా 2024 జూన్ 21 నుంచి ఆ చట్టం అమలులోకి వచ్చింది. అయితే, చట్టం ఉన్నప్పటికీ పేపర్ లీకేజీలు పునరావృతం కావడంతో, విచారణ వేగాన్ని పెంచడం, కఠిన శిక్షలు అమలు చేయడమే లక్ష్యంగా రెండేళ్లలోనే ప్రభుత్వం కొత్త సవరణలను రూపకల్పన చేసింది.
"ప్రభుత్వ పోటీ పరీక్షల వ్యవస్థపై పౌరులకు నమ్మకం పెంచడమే లక్ష్యంగా ఈ చట్ట సవరణను రూపొందించాం" అని బిల్లు ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొంది.
ఏయే నేరాలకు ఎలాంటి శిక్షలు?
ఈ కొత్త బిల్లు ద్వారా శిక్షలు, జరిమానాలను భారీగా పెంచారు.
వ్యక్తిగత నేరస్థులకు: కనిష్ట జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఐదేళ్లకు, గరిష్ట శిక్షను 10 ఏళ్లకు పెంచారు. గరిష్ట జరిమానాను ₹10 లక్షల నుంచి ఏకంగా ₹50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.
పరీక్షలు నిర్వహించే సేవా సంస్థలకు (Service Providers): జరిమానాను ₹1 కోటి నుంచి ₹5 కోట్లకు పెంచారు. అలాగే సదరు సంస్థలపై విధించే బ్లాక్‌లిస్ట్ కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పెంచారు.
సంస్థల యాజమాన్యానికి: సేవా సంస్థల డైరెక్టర్లు లేదా బాధ్యులకు కనిష్ట జైలు శిక్షను ఐదేళ్లకు పెంచారు. జరిమానా ₹1 కోటి నుంచి ₹5 కోట్లకు చేరింది.
వ్యవస్థీకృత ముఠాలకు (Organised Crime): లీకేజీ మాఫియా ప్రమేయం ఉన్న వ్యవస్థీకృత నేరాలకు కనిష్ట జైలు శిక్షను 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు పెంచారు. కనిష్ట జరిమానాను ఏకంగా ₹1 కోటి నుంచి ₹10 కోట్లకు పెంచేలా ప్రతిపాదించారు.
రెండు నెలల్లో విచారణ.. మూడు నెలల్లో తీర్పు
ఈ సవరణ బిల్లులోని అత్యంత కీలకమైన అంశం విచారణకు సమయ పరిమితి విధించడం. కొత్తగా చేర్చిన సెక్షన్ 12A ప్రకారం, పోలీసులైనా, కేంద్ర దర్యాప్తు సంస్థలైనా లేదా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (STF) అయినా సరే.. ఘటన జరిగిన 2 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను (Special Fast Track Courts) ఏర్పాటు చేస్తారు. ఛార్జ్‌షీట్ దాఖలైన 3 నెలల వ్యవధిలోనే రోజువారీ విచారణ ద్వారా కేసును పూర్తి చేసి తీర్పు వెల్లడించాలి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా ఈ కోర్టులకు బదిలీ చేసి 3 నెలల్లో ముగించాలి. ఈ తీర్పులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసుకుంటే, వాటిని కూడా 3 నెలల వ్యవధిలోనే తేల్చాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


