...
...
Next Story

Apple Pay : భారత్‌లోకి యాపిల్ పే ఎంట్రీ.. వచ్చే నెల నుంచే ఐఫోన్ ట్యాప్ అండ్ పే సేవలు!

డిజిటల్ చెల్లింపుల రంగంలో సంచలనం సృష్టిస్తూ యాపిల్ సంస్థ త్వరలోనే భారత్‌లోకి 'యాపిల్ పే' సేవలను తీసుకురానుంది. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో.. ఈ అక్టోబర్​లోనే ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశముందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Published on: Sep 19, 2026, 09:10:35 IST
Advertisement

ఇండియాలోని ఐఫోన్, యాపిల్ వాచ్ వినియోగదారులకు ఆసక్తికరమైన వార్త. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘యాపిల్ పే’ సేవలు ఎట్టకేలకు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి! ఈ అక్టోబర్​లోనే భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి యాపిల్ పే అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అందించిన వివరాల ప్రకారం.. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్​తో కలిసి ఈ సేవలను ప్రారంభించేందుకు యాపిల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో తొలి అడుగు

యాపిల్ పే లేటెస్ట్ అప్డేట్స్..
యాపిల్ పే లేటెస్ట్ అప్డేట్స్..

ప్రస్తుతం వెలువడిన కథనాల ప్రకారం.. యాపిల్ పే తొలుత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. వీసా, మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్‌లపై పనిచేసే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను యాపిల్ వాలెట్​కు అనుసంధానించడం ద్వారా వినియోగదారులు నేరుగా దుకాణాల్లోని పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్ల వద్ద చెల్లింపులు చేయవచ్చు. ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌ను స్వైపింగ్ మెషిన్‌కు దగ్గరగా తెచ్చి ‘ట్యాప్ అండ్ పే’ పద్ధతిలో కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు పూర్తి చేయవచ్చు. దీనికోసం మరే ఇతర థర్డ్ పార్టీ యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు!

ఇతర ప్రధాన బ్యాంకులతో సంప్రదింపులు..

ఒకేసారి అందరికీ కాకుండా, విడతల వారీగా దేశ వ్యాప్తంగా ఈ సేవలు విస్తరించాలని యాపిల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అగ్రశ్రేణి బ్యాంకులతో యాపిల్ యాజమాన్యం చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, లావాదేవీల రుసుములు, ఆదాయ పంపిణీకి సంబంధించిన వాణిజ్య నిబంధనలపై ఇంకా ఆయా బ్యాంకులతో ఏకాభిప్రాయం కుదరలేదు. భవిష్యత్తులో ఇతర బ్యాంకులను కూడా ఈ వేదికపైకి తీసుకురావడానికి నేరుగా ఒప్పందాలు చేసుకోవాలని టెక్ దిగ్గజం యాపిల్ యోచిస్తోంది.

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. భారత మార్కెట్లో పోటీ

మనదేశంలో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులు క్రమంగా పెరుగుతుండటంతో యాపిల్ తన సొంత వాలెట్ సేవలను ప్రవేశపెట్టడం భారత్‌లో ఐఫోన్ వాడకాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.

కాగా యాపిల్​ పేపై వస్తున్న ఈ వార్తల మీద యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉన్నప్పటికీ, అక్టోబర్ నాటికి దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks