Australia Visa : ఆస్ట్రేలియా వీసా కొత్త రూల్స్- ఇక భారతీయులు ఇలా చేయడం తప్పనిసరి!
ఆస్ట్రేలియా వీసా కోరుకునే భారతీయ దరఖాస్తుదారులకు ఆస్ట్రేలియన్ హైకమిషన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్ 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. వీసా ప్రాసెసింగ్‌లో భాగముగా వేలిముద్రలు, ముఖ గుర్తింపు (బయోమెట్రిక్) సమర్పించడం తప్పనిసరి చేశారు. పూర్తి వివరాలు ఇవే..
ఉన్నత విద్య, ఉద్యోగం, పర్యాటకం లేదా వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీసా విధానాన్ని మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చడంలో భాగంగా బయోమెట్రిక్ సేకరించే నిబంధనలను భారత్‌తో పాటు దాదాపు 60 దేశాలకు విస్తరిస్తున్నట్లు దిలోని ఆస్ట్రేలియన్ హైకమిషన్ అధికారికంగా వెల్లడించింది.

ఈ సరికొత్త నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 26, 2026 నాటి నుంచి లేదా ఆ తర్వాత కొత్తగా ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ వేలిముద్రలు, ముఖ చిత్రాన్ని బయోమెట్రిక్ రూపంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు ఆస్ట్రేలియాకు పయనమవుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల నుంచి ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లే దరఖాస్తుదారులకు ఈ కొత్త నియమావళి అత్యంత ప్రాధాన్యమైనది.
ఆస్ట్రేలియా వీసా రూల్స్- వారికి మినహాయింపు..
ఈ నిబంధనల సవరణ వల్ల పాత వీసాదారులకు లేదా అక్టోబర్ 26 కంటే ముందే దరఖాస్తు దాఖలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే ఈ బయోమెట్రిక్ సేకరణ వర్తిస్తుందని ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా వీసా రూల్స్- బయోమెట్రిక్స్ ఎలా సమర్పించాలి?
ఆస్ట్రేలియా వీసా దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. అభ్యర్థి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలో లేదో హోమ్ అఫైర్స్ శాఖ నేరుగా ఈమెయిల్ లేదా అధీకృత ఏజెంట్ల ద్వారా సమాచారం అందిస్తుంది. సూచనలు వచ్చిన అభ్యర్థులు రెండు మార్గాల్లో బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు:
ఆస్ట్రేలియన్ బయోమెట్రిక్స్ కలెక్షన్ సెంటర్ (ఏబీసీసీ): హోమ్ అఫైర్స్ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా వీఎఫ్ఎస్ నిర్వహిస్తున్న ఏబీసీసీ సెంటర్‌కు వెళ్లి తమ వేలిముద్రలు, డిజిటల్ ఫోటోను అందజేయవచ్చు.
ఆస్ట్రేలియన్ ఇమ్మి యాప్ : గతంలోనే ఆస్ట్రేలియన్ బయోమెట్రిక్ సెంటర్లలో వివరాలు సమర్పించి, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉన్న అర్హులైన అభ్యర్థులు నేరుగా తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా 'ఆస్ట్రేలియన్ ఇమ్మి యాప్' ఉపయోగించి ఉచితంగా బయోమెట్రిక్స్ అప్లోడ్ చేయవచ్చు.
ఆస్ట్రేలియా వీసా ప్రాసెసింగ్ సమయం పెరుగుతుందా?
బయోమెట్రిక్స్ నిబంధన జోడించడం వల్ల వీసా మంజూరు కావడంలో ఎలాంటి ఆలస్యం జరగదని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే, ఈమెయిల్ వచ్చిన వెంటనే అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించింది.
ఇక వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆస్ట్రేలియా చట్టాలు, స్థానిక డేటా పరిరక్షణ నిబంధనలకు కట్టుబడి ఈ బయోమెట్రిక్ సమాచారాన్ని అత్యంత సురక్షితంగా భద్రపరుస్తామని అధికారులు తెలిపారు.
బయోమెట్రిక్ సెంటర్లకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సినవి..
ఏబీసీసీ కేంద్రాలకు వెళ్లేటప్పుడు దరఖాస్తుదారులు తమ అసలు పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పాస్‌పోర్ట్ లేకపోతే బయోమెట్రిక్ సేకరణ సాధ్యపడదు. అలాగే విదేశీ ప్రయాణాల్లో జరిగే గుర్తింపు మోసాలను అరికట్టేందుకే ఈ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు వివరించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


