Bangladesh election results : బంగ్లాదేశ్​ ప్రధానిగా తారిఖ్ రహ్మాన్​! భారత్​కు నష్టమా- లాభమా?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. 212 స్థానాల్లో ఆధిక్యంతో అధికారానికి చేరువైన తారిఖ్‌కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మరి తారిఖ్​ ఎన్నిక భారత్​కు లాభమా? నష్టమా? విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే..

Published on: Feb 13, 2026, 10:45:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగ్లాదేశ్‌లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్​పీ) కూటమి అఖండ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 12న పోలింగ్ జరిగిన 299 నియోజకవర్గాల్లో, కనీసం 212 స్థానాల్లో ఈ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

బీఎన్​పీ ఛైర్మన్​ తారిఖ్​ రహ్మాన్​.. (REUTERS)
బీఎన్​పీ ఛైర్మన్​ తారిఖ్​ రహ్మాన్​.. (REUTERS)

స్థానిక మీడియా అంచనాల ప్రకారం.. బీఎన్‌పీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఈ కూటమి దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అధికారిక ఫలితాల్లోనూ ఇదే ధోరణి కొనసాగితే, బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రహ్మాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రి కావడం ఖాయం. మరోవైపు, జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమి 70 నియోజకవర్గాల్లో విజయం సాధించినట్లు శుక్రవారం వెలువడుతున్న అనధికారిక ఫలితాలు చెబుతున్నాయి.

బంగ్లాదేశ్​ ఎన్నికల ఫలితాలపై ఆ దేశ ఎన్నికల కమిషన్ నేడు పూర్తిస్థాయి తుది గణాంకాలను విడుదల చేయనుంది.

ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలను దిల్లీ అత్యంత నిశితంగా గమనిస్తోంది. బీఎన్‌పీని విజయపథంలో నడిపించిన తారిఖ్ రహ్మాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి తన ‘హృదయపూర్వక శుభాకాంక్షలు’ తెలియజేశారు.

“ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది,” అని మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన, సమగ్ర బంగ్లాదేశ్‌కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

“మన దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి మీతో కలిసి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను,” అని ప్రధాని వివరించారు.

హసీనా శకం ముగింపు: గత 15 ఏళ్ల ప్రయాణం..

బంగ్లాదేశ్​ మాజీ ప్రధాన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు దిల్లీ-ఢాకా మధ్య గత పదిహేనేళ్లుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1996 నుంచి 2001 వరకు, తిరిగి 2009 నుంచి 2024 వరకు హసీనా ప్రధానిగా కొనసాగారు. ఆ కాలంలో దక్షిణాసియా భద్రత విషయంలో బంగ్లాదేశ్‌ను భారత్ ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించేది. పొరుగు దేశం కాబట్టి, సత్సంబంధాలు ముఖ్యం అని భావించింది.

అయితే, 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం పడిపోవడం, ఆ తర్వాత జరిగిన అల్లర్లు, ముఖ్యంగా హిందూ మైనారిటీలపై దాడులతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

భారత్ - బీఎన్‌పీ సంబంధాల చరిత్ర..

తారిఖ్ రహ్మాన్ బాధ్యతలు చేపట్టకముందు, బీఎన్‌పీకి ఆయన తల్లి, మాజీ ప్రధాని ఖలీదా జియా నాయకత్వం వహించారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడిన ఆమె, గత ఏడాది డిసెంబర్ 30న 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

గతంలో ఖలీదా జియా హయాంలో భారత్ పట్ల బంగ్లా వైఖరి కొంత అస్థిరంగా ఉండేది! ముఖ్యంగా భద్రతా పరమైన అంశాల్లో సహకారం ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. ఖలీదా జియాతో సంబంధాలు కేవలం పరిమితంగానే ఉండేవి. అందుకే భారత్ ఎప్పుడూ షేక్ హసీనా నాయకత్వానికే మొగ్గు చూపేది.

ప్రస్తుత సవాళ్లు - నిపుణుల విశ్లేషణ..

హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక శక్తులు, మైనారిటీలపై దాడులు పెరగడం దిల్లీని ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది 25 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను బహిరంగంగా సజీవ దహనం చేసిన ఘటనపై భారత్‌లోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

గత 18 నెలలుగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ ప్రయోజనాలకు అనుగుణంగా లేదనే భావనలో మోదీ ప్రభుత్వం ఉంది. అందుకే ఇండియా కూడా మైత్రికి ప్రయత్నించలేదని తెలుస్తోంది. అయితే, ఢాకాలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం ఈ చేదు సంబంధాలను సరిదిద్దుకోవడానికి ఒక సువర్ణావకాశమని నిపుణులు భావిస్తున్నారు.

“యూనస్ ప్రభుత్వంతో భారత్ కేవలం అవసరమైన మేరకే సంబంధాలు కొనసాగించింది. ఇప్పుడు ఒక స్పష్టమైన ప్రజా తీర్పు వచ్చింది కాబట్టి, ఢాకా- దిల్లీ చర్చల టేబుల్ వద్దకు వచ్చే అవకాశం ఉంది,” అని సీనియర్ జర్నలిస్ట్ దీప్ హల్దార్ విశ్లేషించారు.

భారత్‌కు బీఎన్‌పీయే ఉత్తమ ప్రత్యామ్నాయమా?

1978లో జియావుర్ రహ్మాన్ స్థాపించిన బీఎన్‌పీ, బంగ్లాదేశ్ జాతీయవాదం, ఆర్థికాభివృద్ధిని నమ్ముతుంది. “బీఎన్​పీ ప్రత్యర్థి జమాతే ఇస్లామీ అధికారంలోకి వచ్చి ఉంటే భారత్-బంగ్లా మధ్య పరిస్థితులు భయంకరంగా ఉండేవి. ఆ పోలికతో చూస్తే బీఎన్‌పీ రావడం భారత్‌కు మేలు చేసే పరిణామమే,” అని దీప్ హల్దార్ అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకావడం, మోదీ పంపిన ‘కొత్త ఆరంభం’ లేఖను అందించడం సానుకూల సంకేతాలని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ విశ్లేషకుడు ప్రవీణ్ దోంతి పేర్కొన్నారు.

జమాతే ఇస్లామీ నేపథ్యం..

ఒకప్పుడు నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ, 2001లో బీఎన్‌పీతో కలిసి అధికారాన్ని పంచుకుంది. 2009లో హసీనా అధికారంలోకి వచ్చాక ఈ పార్టీపై ఆంక్షలు విధించారు. కానీ యూనస్ హయాంలో వీరు తిరిగి పుంజుకున్నారు. ఫిబ్రవరి 12 ఎన్నికల్లో షఫీకర్ రహ్మాన్ నాయకత్వంలో వీరు గణనీయమైన స్థానాలు సాధించడం గమనార్హం.

బంగ్లాదేశ్ తన ఆర్థిక అవసరాల కోసం అటు చైనా, ఇటు భారత్ మధ్య సమతుల్యత పాటించే అవకాశం ఉంది. భారత్‌కు ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్, తన అంతర్గత రాజకీయ ఒత్తిళ్లను అధిగమిస్తూ భారత్‌తో ఎలా ముందుకు సాగుతుందనేది కాలమే నిర్ణయించాలి.

ప్రశ్న- సమాధానాలు :-

ప్రశ్న- బంగ్లాదేశ్​లో ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?

సమాధానం- ఫిబ్రవరి 12, 2026.

ప్రశ్న- బంగ్లాదేశ్​ మాజీ ప్రధాని ఎవరు?

సమాధానం- షేక్​ హసీనా. 2024 వరకు ఆ పదవిలో కొనసాగారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More