బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
అనారోగ్య సమస్యల కారణంగా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయస్సు 80ఏళ్లు. ఖలీదా జియా మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు బీఎన్‌పీ ప్రకటన చేసింది.
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న 80ఏళ్ల జియా మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ ఒక ప్రకటన చేసింది.

“మన ప్రియతమ నేత బేగమ్ ఖలీదా జియా ఇక లేరు. ఫజర్ ప్రార్థనలు ముగిసిన కొద్ది సేపటికే, ఉదయం 6 గంటల ప్రాంతంలో ఖలీదా జియా ప్రాణాలు విడిచారు,” అని బీఎన్‌పీ ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్చేసింది.
బంగ్లాదేశ్ వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఖలీదాకు అడ్వాన్స్డ్ లివర్ సిర్రోసిస్, ఆర్థిరైటిస్, డయాబెటిస్, ఛాతి- గుండె సమస్యలు ఉన్నాయి.
ఖలీదా జియా- ప్రధాని నుంచి అవినీతి కేసుల వరకు..
బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో బేగం ఖలీదా జియా పేరు ఒక చెరగని ముద్ర. సాధారణ గృహిణిగా ఉంటూ, అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, దేశానికే ప్రధానిగా ఎదిగిన ఆమె ప్రయాణం అనేకమార్లు వార్తల్లో నిలిచింది.
ఖలీదా జియా 1946, ఆగస్టు 15న దినాజ్‌పూర్ జిల్లాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తైయబా మజుందార్, ఇస్కందర్ మజుందార్. దేశ విభజన సమయంలో ఆమె తండ్రి భారత్‌లోని జల్పాయిగురి నుంచి అప్పటి పశ్చిమ పాకిస్థాన్‌కు వలస వచ్చారు. అక్కడ ఆయన టీ వ్యాపారం చేసేవారు. ఖలీదా జియా తన విద్యాభ్యాసాన్ని దినాజ్‌పూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, సురేంద్రనాథ్ కళాశాలలో పూర్తి చేశారు.
1960లో సైనిక అధికారి జియార్ రెహమాన్‌తో ఆమె వివాహం జరిగింది. జియార్ రెహమాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఖలీదా జియా ‘ఫస్ట్ లేడీ’గా ఆయనతో కలిసి ప్రపంచ దేశాలు పర్యటించారు. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్, నెదర్లాండ్స్ రాణి జూలియానా వంటి దిగ్గజ నాయకులను ఆమె కలిశారు. అయితే, 1981లో జరిగిన సైనిక తిరుగుబాటులో ఆమె భర్త దారుణ హత్యకు గురయ్యారు. ఆ విషాదం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
భర్త మరణం తర్వాత, 1982 జనవరి 2న ఖలీదా బీఎన్‌పీ పార్టీలో సాధారణ సభ్యురాలిగా చేరారు. అక్కడి నుంచి కేవలం రెండేళ్లలోనే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి, పార్టీని సమర్థవంతంగా నడిపించారు. 1991లో బంగ్లాదేశ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు.
ముస్లిం దేశాలను కూడా కలుపుకుంటే ఈ ఘనత సాధించిన రెండో మహిళగా ఆమె నిలిచారు.
బీఎన్‌పీ వర్గాల సమాచారం ప్రకారం.. ఖలీదా జియాకు ఒక అరుదైన రికార్డు ఉంది. ఆమె తన రాజకీయ జీవితంలో పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ ఓడిపోలేదు! 1991, 1996, 2001 ఎన్నికల్లో ఐదు వేర్వేరు నియోజకవర్గాల నుంచి, అలాగే 2008లో పోటీ చేసిన మూడు నియోజకవర్గాల్లోనూ ఆమె ఘనవిజయం సాధించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఖలీదా జియాపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2007లో ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం 2018లో వివిధ కేసుల్లో ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఖలీదా జియా రాజకీయ ప్రస్థానమంతా మాజీ ప్రధాని షేక్ హసీనాతో సాగిన ఆధిపత్య పోరుగానే విశ్లేషకులు భావిస్తారు.
తీవ్ర అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2020లో ఖలీదా జియా జైలు శిక్షణను షేక్ హసీనా సస్పెండ్ చేశారు. అయితే, దేశాన్ని విడిపెట్టి వెళ్లొద్దని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు.
కాగా ఈ ఏడాది ఆగస్ట్‌లో షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిపోయిన అనంతరం ఖలీదా జియా హౌజ్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారు.
ఇటీవలి కాలంలో ఆమె ఆరోగ్య విషమించింది. బంగ్లాదేశ్, యూకే, యూఎస్, చైనా, ఆస్ట్రేలియా దేశాల వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. మెరుగైన చికిత్స కోసం ఖలీదా జియాను విదేశాలకు తరలించాలని భావించారు. కానీ ప్రయాణానికి కూడా ఆమె శరీరం సహకరించకపోతుండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ప్రధాని మోదీ సంతాపం..
ఖలీదా జియా మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
“మాజీ ప్రధాని, బీఎన్‌పీ చీఫ్ బేగం ఖలీదా జియా మరణవార్త తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భారత్- బంగ్లాదేశ్ దౌత్య బంధానికి ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి,” అని మోదీ ట్వీట్ చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


