Bank holidays : అలర్ట్! వచ్చే 7 రోజుల్లో బ్యాంకులకు 5 రోజులు సెలవులే..
Bank Holidays in March 2026 : మార్చి 16 నుంచి 22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి. వీటిల్లో తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ బ్యాంకులు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.
వచ్చే వారం బ్యాంకు పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారికి ముఖ్య గమనిక! మార్చ్ 16 నుంచి మార్చ్ 22, 2026 మధ్య కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆదివారం వారాంతపు సెలవుతో కలిపి మొత్తం ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన జాబితా ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా అన్ని లెండర్లకు మార్చ్ నెలలో మొత్తం 18 సెలవులు ఉన్నాయి. ఇందులో రెండో శనివారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు కలిసి ఉన్నాయి. వీటితో పాటు ఈసారి పండుగలు కూడా వచ్చాయి.
సాధారణంగా ఏదైనా నిర్దిష్ట బహిరంగ లేదా ప్రాంతీయ సెలవు ప్రకటిస్తే తప్ప, బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడో, ఐదో శనివారాల్లో పని చేస్తాయి.
మొత్తంగా చూస్తే, ప్రాంతీయ, స్థానిక అవసరాల దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు మారుతుంటాయి. కాబట్టి, అత్యవసర పరిస్థితులు లేదా సుదీర్ఘ సెలవుల దృష్ట్యా ఇబ్బంది పడకుండా ఉండటానికి, వినియోగదారులు తమ స్థానిక బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి, వారి ఆమోదిత సెలవుల షెడ్యూల్‌ను తనిఖీ చేసుకోవడం ఉత్తమం.
వచ్చే 7 రోజుల్లో బ్యాంకు సెలవుల తేదీలు:
మార్చి 17 (మంగళవారం) — షబ్-ఎ-ఖద్ర్: జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులు పనిచేయవు.
మార్చి 19 (గురువారం) — గుడి పడ్వా / ఉగాది పండుగ / తెలుగు నూతన సంవత్సరం / సజిబు నోంగ్మాపన్బా (చీరావోబా) / మొదటి నవరాత్రి: హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, బెలాపూర్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూతపడతాయి.
మార్చి 20 (శుక్రవారం) — ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్): విజయవాడ, కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు పనిచేయవు.
మార్చి 21 (శనివారం) — రంజాన్ ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) (షావ్వాల్-1) / ఖుతుబ్-ఎ-రంజాన్ / సర్హుల్: హైదరాబాద్, దిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, లక్నో, కాన్పూర్, జైపూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, గ్యాంగ్‌టక్, శ్రీనగర్ సహా దేశంలోని మెజారిటీ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.
మార్చి 22 (ఆదివారం) — తప్పనిసరి వారాంతపు సెలవు: దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి.
బ్యాంకులు సాధారణంగా ఎప్పుడు మూసి ఉంటాయి?
జాతీయ, మతపరమైన, ప్రాంతీయ ఉత్సవాలను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సాధారణంగా మూతపడి ఉంటాయి. అదనంగా, ప్రతి నెలలోని రెండో, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాల్లో బ్యాంకులు పనిచేయవు.
బ్యాంకు సెలవు రోజున ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయా?
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, బ్యాంకు సెలవు దినాల్లో కూడా బ్యాంకింగ్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు సౌకర్యవంతమైన ఆర్థిక లావాదేవీల కోసం ఈ సేవలను ఉపయోగించవచ్చు.
ఒక వ్యక్తి యూపీఐ లేదా సంబంధిత బ్యాంకు యాప్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు అలాగే ఇతరుల నుంచి డబ్బును స్వీకరించవచ్చు. బ్యాంకులు తెరిచి ఉన్నా లేకున్నా ఈ సేవలు 24 గంటలూ పని చేస్తాయి. అయితే, కొన్నిసార్లు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా సేవలు నిలిచిపోవచ్చు, అటువంటప్పుడు బ్యాంకులు మీకు ముందుగానే సమాచారం అందిస్తాయి.
వీటితో పాటు, నెఫ్ట్/ ఆర్టీజీసీ బదిలీ ఫారమ్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్ అభ్యర్థన ఫారమ్‌లు, చెక్కు పుస్తక ఫారమ్‌లను ఉపయోగించి నిధుల బదిలీ అభ్యర్థనలు చేయవచ్చు. ఈ ఆప్షన్లతో పాటు కార్డ్ సేవల ద్వారా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులను కూడా పొందవచ్చు. ఖాతా నిర్వహణ ఫారమ్‌లు, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ సెట్ చేయడం, లాకర్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












