...
...
Next Story

bank strike today : నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె- వరుసగా 4 రోజులు బ్యాంకింగ్ సేవలకు బ్రేక్..

వారానికి 5 రోజుల పనిదినాలు, పెన్షన్ సవరణ డిమాండ్లతో బ్యాంక్ యూనియన్లు సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెకు తోడు వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.

Published on: Sep 11, 2026, 09:59:19 IST
Advertisement

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నేడు (సెప్టెంబర్ 11) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశముంది. వారానికి ఐదు రోజుల పనిదినాలను తక్షణమే అమలు చేయడం​తో పాటు పెన్షన్ సవరణ, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ వంటి పలు పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెకు దిగాయి.

నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె..
నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె..

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) నేతృత్వంలో ఏడు ప్రధాన ఉద్యోగ, అధికారి సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి.

నేడు బ్యాంకు సమ్మె- కస్టమర్లపై ప్రభావం..

నేడు బ్యాంకు సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులను హెచ్చరించాయి. సమ్మె కారణంగా తమ శాఖలు, కార్యాలయాల్లో కార్యకలాపాలు పాక్షికంగా లేదా పూర్తిగా నిలిచిపోయే అవకాశముందని స్పష్టం చేశాయి. కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు బ్యాంకులు చెబుతున్నప్పటికీ, సిబ్బంది పాల్గొనే శాతాన్ని బట్టి సేవల లభ్యత ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.

నెట్ బ్యాంకింగ్, యూపీఐ డిజిటల్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి, అయితే చెక్కుల క్లియరెన్స్, డ్రాఫ్ట్‌ల జారీ, శాఖల్లో ప్రత్యక్ష నగదు లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

నేడు బ్యాంకు సమ్మె- ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..

బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం పలు డిమాండ్లను యూనియన్లు ప్రభుత్వం ముందు ఉంచాయి:

పెన్షనర్లకు యూనిఫాం డియర్నెస్ అలవెన్స్ (డీఏ) ఫార్ములాను వర్తింపజేసి, పెన్షన్లను సవరించాలి.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ఎంచుకునే వెసులుబాటు కల్పించాలి.

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగుల పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పీఎల్​ఐ) పథకం అమలును నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమైనప్పటికీ, నవంబర్ 19, 2024న జారీ చేసిన పీఎల్​ఐ ఆదేశాల అమలును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్త బైపార్టైట్ సెటిల్‌మెంట్ చర్చల్లో దీనిని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపినప్పటికీ, సంతృప్తి చెందని యూనియన్లు సమ్మె బాట పట్టాయి.

వరుసగా 4 రోజులు బంద్.. ఏపీ, తెలంగాణలో తీవ్ర ప్రభావం!

నిత్యం బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునే వారికి ఈ సమ్మె మరింత ఇబ్బందికరంగా మారనుంది. నేడు (శుక్రవారం) సమ్మె వల్ల బ్యాంకులు మూతపడనుండగా, రేపు సెప్టెంబర్ 12 రెండో శనివారం కావడంతో సాధారణ సెలవు ఉంటుంది. ఎల్లుండి సెప్టెంబర్ 13 ఆదివారం. దానికి తోడు సెప్టెంబర్ 14న వినాయక చవితి (గణేష్ చతుర్థి) సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు అధికారిక సెలవు ఉంది.

దీనితో వరుసగా నాలుగు రోజుల పాటు (సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు) బ్యాంక్ శాఖల సేవలు అందుబాటులో ఉండవు! సుదీర్ఘ సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశముంది. ఖాతాదారులు యూపీఐ వంటి డిజిటల్ లావాదేవీలపై ఆధారపడటం లేదా ముందస్తుగా నగదు సమకూర్చుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

సెప్టెంబర్ చివరిలో మళ్లీ మూడు రోజుల సమ్మె!

ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని యూఎఫ్​బీయూ హెచ్చరించింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 వరకు మరో మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించింది. అప్పటికీ స్పందించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks