దివాలా నుంచి రూ. 27 కోట్ల సామ్రాజ్యం వరకు- 29ఏళ్ల భారతీయ యువకుడి సంచలన సక్సెస్ స్టోరీ..
24 ఏళ్ల వయసులో అప్పులు, మానసిక వేదనతో కుంగిపోయిన ఒక యువకుడు.. కేవలం ఐదేళ్లలోనే రూ. 27 కోట్లు సంపాదించాడు. ఈ విషయాన్ని వివరిస్తూ రెడ్డిట్ వేదికగా అతను పంచుకున్న కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగిలి, ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయినప్పుడు చాలామంది నిరాశలో మునిగిపోతారు. కానీ, ఆ పాతాళం నుంచే శిఖరాగ్రానికి చేరుకోవచ్చని నిరూపించాడు ఓ 29 ఏళ్ల యువకుడు. 24 ఏళ్ల వయసులో దివాలా తీసిన స్థితి నుంచి 29 ఏళ్లకే రూ. 26 కోట్లు సంపాదించాడు. అతను తన సక్సెస్ జర్నీని ఇటీవలే సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది చూసి అందరు ఫిదా అవుతున్నారు.

దిల్లీ నుంచి కెనడాకు.. కష్టాలతో మొదలైన ప్రయాణం
సదరు వ్యక్తి రెడ్డిట్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో తన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నాడు.
"నేను దిల్లీలో పెరిగాను. 17 ఏళ్ల వయసులో చదువు కోసం కెనడాకు వెళ్లాను. నాది విచ్ఛిన్నమైన కుటుంబం. తండ్రి లేరు, తల్లి ఉద్యోగం చేసేవారు, నానమ్మ తాతయ్యలు నన్ను పెంచారు," అని ఆ యూజర్ తన నేపథ్యాన్ని వివరించాడు.
కెనడాలో చదువుకుంటూనే జీవనం కోసం 'డోర్-టు-డోర్' సేల్స్ ఉద్యోగం చేశాడు. "మైనస్ 20 డిగ్రీల చలిలో, మంచు తుపానులు కురుస్తున్నా ఇంటింటికీ తిరిగి వస్తువులు అమ్మేవాడిని. కెనడా చలికాలం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిన వారికి నా కష్టం అర్థమవుతుంది," అని చెప్పుకొచ్చాడు.
23 ఏళ్లకే దివాలా.. ట్రేడింగ్‌లో దెబ్బ
కష్టపడి సంపాదించినా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆ యువకుడికి సమస్యలు మొదలయ్యాయి. "23 ఏళ్ల వయసు వచ్చేసరికి నాపై 30,000 డాలర్ల (సుమారు రూ. 25 లక్షలు) అప్పు పేరుకుపోయింది. నేను అధికారికంగా దివాలా తీశాను. నా దగ్గరున్న డబ్బును ఫ్యూచర్స్ అండ్ డే ట్రేడింగ్‌లో పెట్టి చాలా వేగంగా పోగొట్టుకున్నాను," అని అతను అంగీకరించాడు.
ఆ సమయంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి.
"24 ఏళ్ల వయసులో నేను విపరీతమైన బరువు పెరిగాను, చేతిలో పైసా లేదు. బాధ్యతల గురించి ఆలోచిస్తూ రాత్రులు నిద్రపోయేవాడిని కాదు. కానీ ఆ స్థితిలో ఒక మంచి విషయం ఏంటంటే.. అంతకంటే దిగువకు పడిపోవడానికి ఇంకేం మిగలలేదు అని నాకు అర్థమవ్వడం," అని తన ఆవేదనను పంచుకున్నాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మలుపు..
నిరాశలో ఉన్న అతనికి సోషల్ మీడియా కొత్త దారి చూపించింది! అదే ఏడాది యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేషన్ ప్రారంభించాడు. ముఖ్యంగా ఏఐ (కృత్రిమ మేధ) టూల్స్ ఉపయోగించి తన పేజీలను ఎక్స్‌ప్యాండ్ చేశాడు. ఈ ప్రయోగం ఊహించని ఫలితాన్నిచ్చింది. "25 ఏళ్ల వయసులో మొదటిసారిగా నెలకు రూ. 10 లక్షల లాభాన్ని గడించాను," అని తెలిపాడు.
వచ్చిన లాభాలను స్టాక్ మార్కెట్‌లో పెట్టకుండా వెండింగ్ మెషీన్లు, ఏఐ ఆధారిత వ్యాపారాలు, రెంటల్ బిజినెస్‌లో అతను పెట్టుబడి పెట్టాడు. షేర్ల కంటే బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించాడు.
రూ. 27 కోట్ల డీల్..
ప్రస్తుతం ఫ్లోరిడాలో స్థిరపడిన ఈ వ్యక్తి.. తాజాగా తన రెంటల్ బిజినెస్‌ను 3 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 27 కోట్లు) విక్రయించాడు.
"ఈ రోజు నేను నా వయసు వారందరికంటే చాలా ముందున్నాను. ఆశ కోల్పోయిన స్థితిలో కూడా నేను ఎప్పుడూ వెనకడుగు వేయలేదు, నా మీద నాకు నమ్మకం పోలేదు," అని అతను రాసుకొచ్చాడు. తన సాధారణ నేపథ్యమే తనను ఎప్పుడూ గర్వం లేకుండా ఉంచుతుందని అన్నాడు.
సోషల్ మీడియా స్పందన..
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనికి అభినందనలు తెలుపుతున్నారు.
"నీ కథ చదవడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నా వయసు 29, కానీ నువ్వు 24 ఏళ్లలో ఉన్నప్పటికంటే దారుణమైన స్థితిలో నేనున్నాను. నీ ప్రయాణం నాకు స్ఫూర్తినిచ్చింది," అని ఒకరు కామెంట్ చేయగా..
"నీ పట్టుదలకు హాట్సాఫ్" అని మరొకరు అభినందించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


