కుర్రాళ్లపై కాసుల వర్షం.. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్‌కు బీసీసీఐ భారీ నజరానా.. క‌ళ్లు చెదిరే ప్రైజ్‌మ‌నీ

యంగ్ టీమిండియా ఆటగాళ్లకు డబుల్ బోనాంజా. ఓ వైపు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో తేలిపోతున్న కుర్రాళ్లపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. బంపరాఫర్ గా భారీ ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఇండియా 100 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. 

Published on: Feb 07, 2026 1:12 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అండర్-19 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన యంగ్ టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ ను ఆరుసార్లు గెలుచుకున్న ఏకైక దేశం భారత్. శుక్రవారం (ఫిబ్రవరి 6) రాత్రి ఫైనల్లో ఇంగ్లాండ్ ను 100 రన్స్ తేడాతో ఓడించి యువ భారత్ విశ్వ విజేతగా నిలిచింది. కప్ దక్కించుకున్న యంగ్ టీమ్ పై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది.

అండర్-19 ఇండియన్ టీమ్ (AFP)
అండర్-19 ఇండియన్ టీమ్ (AFP)

బీసీసీఐ ప్రైజ్ మనీ

అండర్-19 ప్రపంచకప్ 2026 టైటిల్ దక్కించుకున్న భారత యువ జట్టుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అదిరిపోయే న్యూస్ చెప్పింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి 2026 అండర్-19 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న భారత అండర్-19 క్రికెట్ జట్టుకు రూ.7.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. 2026 అండర్-19 ప్రపంచ కప్‌ను అజేయంగా ముగించినందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా భారత అండర్-19 జట్టుపై గర్వం వ్యక్తం చేశారు.

అందరికీ గర్వకారణం

ఏఎన్ఐతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. "2026 అండర్-19 ప్రపంచకప్ గెలుపుతో మా అండర్-19 జట్టు పట్ల యావత్ దేశం, బీసీసీఐ గర్విస్తోంది. ఫైనల్లో మా జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించిన విధానం, టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచిన తీరు అందరికీ గర్వకారణం. ఈ యువ జట్టుకు బీసీసీఐ రూ.7.5 కోట్ల నగదు బహుమతిని అందిస్తుంది" అని ప్రకటించారు.

ప్రధాని ఏమన్నారంటే?

ప్రపంచ కప్‌లో అండర్-19 జట్టు అద్భుత ప్రదర్శన పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. "భారత క్రికెట్ ప్రతిభ వెలిగిపోతోంది! ప్రపంచ కప్‌ను స్వదేశానికి తీసుకువచ్చిన మా U-19 జట్టు పట్ల గర్విస్తున్నా. ఈ జట్టు టోర్నమెంట్‌లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చాలా బాగా ఆడింది. ఈ విజయం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది’’ అని ప్రధాని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఆట అదుర్స్

అండర్-19 ప్రపంచకప్ లో యంగ్ టీమిండియా ఆట అదిరింది. టోర్నీ మొత్తంలో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత జట్టు కప్ సొంతం చేసుకుంది. జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ U19 ను 100 పరుగుల తేడాతో ఓడించి, ఆరో టైటిల్‌ను గెలుచుకుంది భారత్.

ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో పరుగుల సునామీతో చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ అండర్-19 టీమ్ 311 పరుగుల చేసింది. ఇండియా గతంలో 2000, 2008, 2012, 2018, 2022లోనూ అండర్-19 ప్రపంచ కప్ దక్కించుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More