అపార్ట్‌మెంట్ల సైజు తగ్గిపోతోంది- ధరలు మాత్రం పైపైకి.. బెంగళూరులో ఇక ఇంతే?
దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ల పరిమాణం గణనీయంగా తగ్గిపోతోంది. బెంగళూరులో ఈ పరిస్థితి రమింత ఎక్కువగా ఉంది. ఈ నగరంలో 2024తో పోలిస్తే 2025లో సగటు ఇంటి విస్తీర్ణం 8 శాతం మేర తగ్గిందని నోబ్రోకర్ నివేదిక వెల్లడించింది.
సిలికాన్ వాల్యీ ఆఫ్ ఇండియా బెంగళూరులో సొంతింటి కల కంటున్న సామాన్యుడికి చేదు నిజం ఎదురవుతోంది! ఇళ్లు కొనేవారు గతంలో కంటే ఇప్పుడు చాలా చిన్న అపార్ట్‌మెంట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కానీ ధరలు మాత్రం పైపైకి వెళుతున్నాయి. పెరుగుతున్న భూమి ధరలు, నిర్మాణ వ్యయాన్ని తట్టుకోవడానికి డెవలపర్లు అపార్ట్‌మెంట్‌లోని 'కార్పెట్ ఏరియా'ను (నిజంగా మనం వాడుకునే స్థలం) తగ్గించేస్తున్నారు. తద్వారా ధరను సామాన్యుడికి అందుబాటులో ఉంచినట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి కొనుగోలుదారులు తక్కువ స్థలానికి ఎక్కువ ధర చెల్లిస్తున్నారు.

గణంకాలు ఏం చెబుతున్నాయి?
ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ ‘నోబ్రోకర్’ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2024లో బెంగళూరులో సగటు అపార్ట్‌మెంట్ సైజు 1,094 చదరపు అడుగులు ఉండగా.. 2025 నాటికి అది 1,008 చదరపు అడుగులకు పడిపోయింది. అంటే ఏడాది కాలంలోనే దాదాపు 8 శాతం మేర ఇల్లు చిన్నదైపోయింది!
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఈ తగ్గుదల బెంగళూరులోనే అత్యధికంగా ఉండటం గమనార్హం.
మధ్యతరగతి ఇళ్లపైనే ప్రభావం..
ఈ తాజా ధోరణి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కొనే ఇళ్లలోనే ఎక్కువగా కనిపిస్తోందని నోబ్రోకర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ తెలిపారు.
"బెంగళూరులో 2-బీహెచ్‌కే ఇళ్ల పరిమాణం 9 శాతం, 3-బీహెచ్‌కే సైజు 5 శాతం మేర తగ్గాయి. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ప్రాజెక్ట్ లాభదాయకంగా ఉండాలంటే బిల్డర్లు ఇళ్ల పరిమాణాన్ని తగ్గించక తప్పడం లేదు," అని ఆయన వివరించారు.
సాధారణంగా రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్లలో మాత్రం సైజులు తగ్గలేదు కానీ, సామాన్యులు కొనే ఇళ్లే ఇప్పుడు ఇరుకుగా మారుతున్నాయి.
ఇతర నగరాల్లో పరిస్థితి..
అపార్ట్‌మెంట్ల సైజు తగ్గింపు అనేది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ధోరణి అయినప్పటికీ, బెంగళూరు తర్వాత పూణె, చెన్నై నగరాల్లో 5 శాతం మేర విస్తీర్ణం తగ్గింది. హైదరాబాద్, ముంబైలలో 4 శాతం, దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో 3 శాతం మేర ఇళ్లు చిన్నవయ్యాయి.
ఎందుకు తగ్గుతున్నాయి?
నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు, కర్ణాటక ప్రభుత్వం 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త 'సెట్‌బ్యాక్' నిబంధనలు కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. దీని ప్రకారం భవనానికి నాలుగు వైపులా వదలాల్సిన ఖాళీ స్థలం పరిమితులు మారాయి.
దీనికి తోడు భూమి ధరలు ఆకాశాన్ని తాకడం కూడా కారణమని హను రెడ్డి రియాల్టీకి చెందిన కిరణ్ కుమార్ పేర్కొన్నారు. "గత 10 ఏళ్లలో బెంగళూరులో అపార్ట్‌మెంట్ల సైజు 25 శాతం కంటే ఎక్కువగానే తగ్గింది. గతంలో నిర్మాణం కంటే భూమి ధర తక్కువగా ఉండేది, ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యింది," అని ఆయన తెలిపారు.
కొనుగోలుదారులు జాగ్రత్తపడాలి..
ఇల్లు కొనేటప్పుడు కేవలం ధరనే కాకుండా ‘కార్పెట్ ఏరియా’, 'యుడీఎస్' (భూమిలో మనకు వచ్చే వాటా)పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇల్లు చిన్నదైనప్పుడు భవిష్యత్తులో దాన్ని తిరిగి అమ్మేటప్పుడు (రీసేల్) ఇబ్బందులు రావచ్చు. అందుకే కొనుగోలుదారులు కేవలం బెడ్‌రూమ్‌ల సంఖ్యను మాత్రమే కాకుండా, ఇంటి లేఅవుట్, స్టోరేజ్ ఆప్షన్లు, గాలి, వెలుతురు వచ్చే వీలును జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


