...
...
Next Story

బెంగళూరు ప్రజలకు షాక్! ఇంటి ముందు రోడ్లపై పార్కింగ్ చేయాలంటే ఫీజు తప్పనిసరి! రూ. 25వేల వరకు..

బెంగళూరులో ఇంటి ముందుండే పబ్లిక్ రోడ్లపై వాహనాలు పార్క్ చేయాలంటే ఏడాదికి రూ. 25,000 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది! ఈ మేరకు జీబీఏ డ్రాఫ్ట్ రూల్స్ 2026 ప్రకారం వాహనదారులపై ఈ కొత్త భారం పడనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Aug 14, 2026, 12:20:24 IST
Advertisement

బెంగళూరు నగరవాసులకు పెద్ద షాకే తగిలేలా ఉంది! రోడ్డుపై వాహనాలు పార్క్ చేయడం అనేది ఇప్పుడు అక్కడి ప్రజల జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తోంది. డ్రాఫ్ట్ జీబీఏ రూల్స్ 2026 ప్రకారం.. ఇళ్ల ముందుండే పబ్లిక్ రోడ్లపై వాహనాలను పార్క్ చేసే స్థానికులు ఏడాదికి రూ. 25,000 వరకు (వాహన రకాన్ని బట్టి) రెసిడెన్షియల్ పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

బెంగళూరులో రూ. 25వేల వరకు పార్కింగ్ ఫీజు! (AFP)
బెంగళూరులో రూ. 25వేల వరకు పార్కింగ్ ఫీజు! (AFP)

నగరంలో ఆన్-స్టీట్ పార్కింగ్ సమస్య రోజురోజుకూ పెరుగుతుండటం, దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఈ కొత్త రూల్స్​ని రాశారు.

తాజా డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం.. హ్యాచ్‌బ్యాక్ కార్లకు వార్షిక పార్కింగ్ పర్మిట్ ఫీజు రూ. 15,000గాను, సెడాన్ కార్లకు రూ. 20,000గాను, ఎస్‌యూవీ వాహనాలకు రూ. 25,000గా ప్రతిపాదించారు. అయితే బెంగళూరులోని ప్రధాన రోడ్లు కాకుండా ఇతర వీధుల్లో రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసే ఈ పర్మిట్ కోసం వాహనదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నిబంధన ఎవరికి వర్తిస్తుంది?

భవన నిర్మాణ ఉప నిబంధనల ప్రకారం కనీస పార్కింగ్ స్థలం కలిగి ఉన్న భవనాల్లో నివసించే వారికి మాత్రమే ఈ పర్మిట్ జారీ చేస్తారు. అంటే నిబంధనల ప్రకారం తగినంత ఆన్-సైట్ పార్కింగ్ లేని ఇళ్ల యజమానులు లేదా నివాసితులు ఈ రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్‌కు అర్హులు కారు.

సమర్థమైన పర్మిట్ లేకుండా ఇళ్ల ముందు పబ్లిక్ రోడ్లపై వాహనాలు నిలిపితే అక్రమ పార్కింగ్‌గా పరిగణించి జరిమానా విధిస్తారు.

పర్మిట్ జారీకి సంబంధించి అదనపు పరిపాలనా రుసుము కూడా ఉంటుందని, దీన్ని గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్ నిర్ణయిస్తారని డ్రాఫ్ట్ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ పర్మిట్ నిర్దిష్ట వాహనానికి, దాని రిజిస్ట్రేషన్ యజమానికి మాత్రమే వర్తిస్తుంది. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారని ధృవీకరించిన తర్వాత ప్రతి ఏటా దీన్ని రెన్యూవల్ చేసుకోవచ్చు.

రెసిడెన్షియల్ పార్కింగ్ కోసం నిర్దిష్ట రోడ్డు స్థల అవసరాలను కూడా నిబంధనల్లో పొందుపరిచారు:

కలెక్టర్ రోడ్లపై వాహనం పార్క్ చేసినప్పటికీ ట్రాఫిక్ కోసం కనీసం ఆరు మీటర్ల రోడ్డు స్థలం ఖాళీగా ఉండాలి. అలాగే రెండు వైపులా 1.8 మీటర్ల నడక మార్గం ఉండేలా చూడాలి.

స్థానిక రోడ్లపై ట్రాఫిక్ కోసం కనీసం నాలుగు మీటర్ల స్థలం వదలాలి. వాహనం పార్క్ చేసిన తర్వాత కనీసం ఒక వైపు 1.8 మీటర్ల నడక మార్గం ఖాళీగా ఉండాలి.

మున్సిపల్ కార్పొరేషన్లు నియమించిన మార్షల్స్ లేదా ఇతర అధికారులు ఈ పర్మిట్ల చెల్లుబాటును తనిఖీ చేసి, ఉల్లంఘనలను పోలీసులకు నివేదిస్తారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నో-పార్కింగ్ నిబంధనలను అమలు చేస్తూ, కేవలం పర్మిట్ ఉన్న వాహనాలు మాత్రమే నిర్దేశిత ప్రాంతాల్లో నిలిపేలా చూస్తారు.

ఈ డ్రాఫ్ట్ నిబంధనలపై అభ్యంతరాలు, సలహాలను తెలియజేయాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం కోరింది. మరి దీనిపై బెంగళూరు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks