...
...
Next Story

'నెలకు రూ.3.5 లక్షల జీతం.. అయినా రూ.50 వేలు దాచలేకపోతున్నా'- టెక్కీ ఆవేదన..

Bengaluru techie : నెలకు రూ.3.5 లక్షల చేతికి వస్తున్నా.. కనీసం రూ.50 వేలు కూడా పొదుపు చేయలేకపోతున్నానని బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఖర్చులు పెరిగిపోవడంతో భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నాడు.

Published on: Jun 22, 2026, 05:59:10 IST
Advertisement

నేటి కాలంలో భారీ జీతాలు సంపాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జీతం ఎంత వస్తున్నా.. చేతిలో రూపాయి నిలవడం లేదనే బాధ మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు అందరిలోనూ కనిపిస్తోంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక టెక్కీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడిట్’లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. పన్నులన్నీ పోను నెలకు ఏకంగా రూ.3.5 లక్షల నికర ఆదాయం వస్తున్నప్పటికీ.. తాను కనీసం రూ.50,000 కూడా సరిగ్గా పొదుపు చేయలేకపోతున్నానని, తన భవిష్యత్తు ఏమైపోతుందోనని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నానని అతడు అందులో రాసుకొచ్చాడు.

జీతం నెలకు రూ. 3.5లక్షలు- సేవింగ్స్ మాత్రం.. (Representational image/Gemini AI generated)
జీతం నెలకు రూ. 3.5లక్షలు- సేవింగ్స్ మాత్రం.. (Representational image/Gemini AI generated)

ఆ 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బెంగళూరులో తన నాలుగేళ్ల కవల కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. రోజురోజుకూ పెరిగిపోతున్న ఖర్చుల వల్ల తన ఆర్థిక భద్రతపై విపరీతమైన ఆందోళన కలుగుతోందని చెప్పాడు.

"నా వయసు 34 ఏళ్లు. బెంగళూరులో నా నాలుగేళ్ల కవల కుమార్తెలతో కలిసి ఉంటున్న సాధారణ టెక్కీని. నా వార్షిక ప్యాకేజీ రూ.96 లక్షలు. పన్నులన్నీ పోగా నెలకు రూ.3.5 లక్షల బేస్ శాలరీ చేతికి వస్తుంది. మిగిలిన రూ.35 లక్షలు ఈసాప్స్ రూపంలో ఉన్నాయి. అదొక స్టార్టప్ కంపెనీ కాబట్టి ఆ షేర్లను నేను ప్రస్తుతానికి లెక్కలోకి తీసుకోవడం లేదు. నా నెలవారీ పొదుపు కేవలం రూ.45,000 నుంచి రూ.50,000 లోపే ఉంటోంది. మితిమీరిన ఖర్చుల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాను. దీని నుంచి ఎలా బయటపడాలో దయచేసి ఎవరైనా సలహా ఇవ్వండి," అని అతడు ఆ పోస్ట్‌లో అభ్యర్థించాడు. "నెలకు రూ.3.5 లక్షలు సంపాదిస్తున్నా.. కనీసం రూ.50 వేలు కూడా దాచలేకపోతున్నాను" అనే శీర్షికతో ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు.

నెలవారీ ఖర్చుల చిట్టా ఇదీ..

తనకు వస్తున్న జీతం ఎటు పోతుందో వివరిస్తూ తన నెలవారీ ఖర్చుల వివరాలను అతడు క్షుణ్ణంగా పంచుకున్నాడు. ఇల్లు కొనుగోలు చేసినందుకు హోమ్ లోన్ ఈఎంఐ రూపంలోనే నెలకు రూ.80,000 కడుతున్నాడు. ఇప్పటికే ఆరేళ్ల పాటు ఈఎంఐలు చెల్లించగా.. ఇంకా 10 ఏళ్ల కాలపరిమితి మిగిలి ఉంది. ఇక కారు ఈఎంఐ కింద నెలకు రూ.30,000 కట్ అవుతోంది. ఈ కారు లోన్ ఇంకా రూ.10 లక్షలు బాకీ ఉంది.

ప్రస్తుతం తన నికర ఆస్తి విలువ దాదాపు రూ.3 కోట్లు ఉన్నప్పటికీ.. గత కొన్ని ఏళ్లుగా అది ఒకేలా ఉండిపోయిందని ఆవేదన చెందాడు. ఏడాదికి కేవలం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు మాత్రమే అదనంగా యాడ్ చేయగలుగుతున్నానని చెప్పాడు.

ఇంటర్నెట్‌లో భిన్నాభిప్రాయాలు..

టెక్కీ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చని చాలా మంది సలహాలు ఇస్తున్నారు.

"మీ భార్య కూడా సంపాదిస్తున్నారా? ఒకవేళ ఆవిడ ఉద్యోగం చేయకపోతే.. పిల్లలను డేకేర్‌లో ఉంచాల్సిన అవసరం ఏముంది? అలాగే చుట్టాల ఇళ్లకు వెళ్లడానికి, అవుట్‌డోర్ యాక్టివిటీస్‌కు నెలకు రూ.40,000 ఖర్చు చేయడం చాలా ఎక్కువ," అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

"ఆయా కోసం నెలకు రూ.40,000 ఇవ్వడం చాలా ఎక్కువ. ఒకే వయసున్న ఇద్దరు పిల్లలను ఒకే ఇంట్లో చూసుకోవడానికి అంత మొత్తం అవసరం లేదు. ఈ ఖర్చును సులభంగా తగ్గించుకోవచ్చు," అని మరొకరు అభిప్రాయపడ్డారు. "ప్రిస్కూల్, డేకేర్ల కోసం పెట్టే ఉమ్మడి ఖర్చే మీ పొదుపును పూర్తిగా హరిస్తోంది," అని మూడో వ్యక్తి రాసుకొచ్చాడు.

అయితే, మరికొందరు మాత్రం అతడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. "నువ్వు చాలా బాగానే మేనేజ్ చేస్తున్నావు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఖచ్చితంగా మెరుగవుతాయి," అని ఒకరు కామెంట్ చేయగా.. "నీకు ఇప్పటికే రూ.3 కోట్ల ఆస్తి ఉంది. అందులో కేవలం 30 శాతం లిక్విడ్ క్యాష్ (నగదు రూపంలో) ఉన్నా.. నువ్వు మరో మూడు నాలుగు ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బతకవచ్చు. ఉద్యోగం పోతుందేమోనని అంతగా ఎందుకు భయపడుతున్నావు? ఇలాంటి కష్టకాలంలో వాడుకోవడానికే కదా ఆ పొదుపు," అని మరొక నెటిజన్ అతడిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe