Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి ఔట్? జట్టు నుంచే తొలగించే ఛాన్స్!
Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బిగ్ షాక్ తప్పేలా లేదు. అతణ్ని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా తప్పించడంతో పాటు జట్టులోనూ ప్లేస్ లేకుండా వేటు వేస్తారని తెలుస్తోంది.
Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్యపై యాజమాన్యం వేటు వేయడానికి సిద్ధమైనట్లు టాక్. కెప్టెన్ గా తప్పించడమే కాకుండా, అతడిని జట్టు నుంచి పూర్తిగా తొలగించే యోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఘోర ప్రదర్శన
హార్దిక్ పాండ్య సారథ్యంలో ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్ లో అంచనాలు అందుకోలేకపోయింది. పేలవమైన ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో హార్డిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
హార్డిక్ పాండ్య రాకతో
గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ అంచనాలతో 2024లో ముంబై జట్టులోకి వచ్చాడు హార్దిక్. రోహిత్ ను తప్పించి అతనికి జట్టు పగ్గాలు అప్పజెప్పారు. కానీ మొదటి సీజన్‌లో జట్టును చివరి స్థానంలో నిలిపాడు. 2025లో జట్టు ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి కానీ, అభిమానులకు కానీ ఆ ప్రదర్శన తృప్తినివ్వలేదు. ఇక ఈ ఏడాది పది ఓటములతో జట్టు ప్రయాణం ఘోరంగా ముగియడంతో మార్పులు అనివార్యంగా మారాయి.
వేటు తప్పదు
"ఈ సీజన్ సాగుతున్న సమయంలోనే హార్దిక్‌ను కెప్టెన్‌గా కొనసాగించడం ముంబై మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదనే సంకేతాలు వచ్చాయి. జట్టు క్యాంప్‌లో దీనిపై స్పష్టమైన చర్చ నడుస్తోంది" అని ముంబై ఇండియన్స్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ కోల్పోబోతున్నాడనే విషయాన్ని జట్టు అంతర్గత వర్గాలకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు కూడా ధృవీకరించారు.
కోచింగ్ స్టాఫ్ మాట వినని ఆటగాళ్లు
ముంబై ఇండియన్స్ వైఫల్యాల వెనుక కేవలం ఆటగాళ్ల ఫామ్ మాత్రమే కాదు, అంతర్గత విభేదాలు కూడా కారణమనే వార్తలు వస్తున్నాయి. కోచింగ్ సిబ్బంది ఇచ్చిన సూచనలను సీనియర్ ఆటగాళ్లు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.
"కోచ్‌ల మాట వినడం, వారి వ్యూహాలను అమలు చేయడం ముఖ్యం అని కోచింగ్ స్టాఫ్ సీనియర్ ఆటగాళ్లకు స్పష్టంగా చెప్పారు. చాలా సందర్భాల్లో కోచింగ్ సిబ్బంది డేటా ఆధారంగా కొన్ని వ్యూహాలను సిఫార్సు చేశారు. కానీ ఆటగాళ్లు వాటిని మైదానంలో అమలు చేయలేదు" అని జట్టుకు చెందిన మరో ప్రతినిధి వెల్లడించాడు.
జట్టులోనూ చోటు కష్టమేనా?
కెప్టెన్సీ కోల్పోవడం ఒకెత్తయితే, ముంబై ఇండియన్స్ జట్టులో అసలు ఆటగాడిగానైనా హార్దిక్ ఉంటాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
"రాబోయే రోజుల్లో జట్టు భవిష్యత్తుపై తీవ్రమైన ఆత్మపరిశీలన, చర్చలు జరుగుతాయి. ప్రతి అవకాశాన్ని మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుంది. భవిష్యత్తులో హార్దిక్ కెప్టెన్‌గా కొనసాగగలడా? లేదా కేవలం ఒక ఆటగాడిగానైనా జట్టులో ఉంటాడా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంది" అని ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఒక సీనియర్ ప్రతినిధి పేర్కొన్నాడు.
ఫెయిల్యూర్
పర్సనల్ గా కూడా హార్దిక్ పాండ్యకు ఈ సీజన్ ఒక పీడకలలా మిగిలింది. మైదానంలో అతడి నిర్ణయాలు అనాలోచితంగా సాగాయి. మ్యాచ్ ముగియక ముందే చేతులెత్తేసినట్లు కనిపించాడు. ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 22.89 సగటుతో, 138.26 స్ట్రైక్ రేట్‌తో 206 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొత్తం 23 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్, 11.43 ఎకానమీ రేటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యను ఎందుకు తప్పిస్తున్నారు?
జవాబు: హార్దిక్ పాండ్య సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా విఫలమవుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి 9వ స్థానంలో నిలిచింది. దీంతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌తో విభేదాలు, వ్యూహాలను అమలు చేయడంలో వైఫల్యం కారణంగా అతడిని తప్పించాలని భావిస్తున్నారు.
ప్రశ్న: హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ జట్టును వదిలి వెళ్లనున్నాడా?
జవాబు: అవును, కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు అతడిని జట్టు నుంచి పూర్తిగా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
ప్రశ్న: ఈ ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్య ప్రదర్శన ఎలా ఉంది?
జవాబు: ఈ సీజన్‌లో హార్దిక్ ప్రదర్శన నిరాశాజనకంగా సాగింది. బ్యాటింగ్‌లో 10 మ్యాచ్‌ల్లో 206 పరుగులు చేయగా, బౌలింగ్‌లో 23 ఓవర్లు వేసి 11.43 ఎకానమీతో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


