1300 మంది అభ్యర్థులు- 3.7కోట్ల ఓటర్లు.. బిహార్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం
బిహార్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దిల్లీ పేలుడు నేపథ్యంలో కట్టుదిట్ట భద్రత మధ్య ఈ దఫా పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెలువడనున్నాయి.
బిహార్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ఓటింగ్‌కు అదనపు సమయాన్ని కేటాయిస్తామని ఎన్నికల సంఘ స్పష్టం చేసింది. కాగా దిల్లీ పేలుడు నేపథ్యంలో బిహార్‌లో అప్రమత్తమైన అధికారులు.. ఎన్నికల వేళ భద్రతను మరింత పెంచారు.

బిహార్ ఎన్నికల రెండో దశ పోలింగ్ వివరాలు..
నవంబర్ 6న జరిగిన బిహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాలను కవర్ చేసింది. ఇందులో 65.08% ఓటింగ్ నమోదైంది. ఇది బిహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం కావడం విశేషం. అయితే ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ఐఆర్) కారణంగా మొత్తం ఓటర్ల సంఖ్య 7.89 కోట్ల నుంచి 7.42 కోట్లకు తగ్గడం గమనార్హం.
ఇక మంగళవారం మొత్తం 20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ని నిర్వహిస్తున్నారు. ఈ దశలో 1,302 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు తేలనుంది, వీరిలో డజను మంది సిట్టింగ్ మంత్రులు కూడా ఉన్నారు.
ఈ ఎన్నికల్లో 1.74 కోట్ల మంది మహిళలతో పాటు 3.7 కోట్లకు పైగా ఓటర్లు 45,399 పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
"మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాల్లో 40,073 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం 45,399 బూత్‌ల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశాము," అని బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి చెందిన అధికారి తెలిపారు. "ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున 815 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.
దిల్లీ పేలుడు నేపథ్యంలో అలర్ట్..
దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనలో కనీసం ఎనిమిది మంది మరణించిన నేపథ్యంలో, పోలింగ్ జరగుతున్న బిహార్ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వినయ్ కుమార్ తెలిపారు.
పోలింగ్ కోసం బీహార్‌లో ఇప్పటికే భద్రతను గణనీయంగా పెంచారు.
"ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు తర్వాత బిహార్ అంతటా అధిక భద్రతా హెచ్చరిక జారీ చేశాము," అని తెలిపారు.
"దేశ వ్యతిరేక శక్తుల నుంచి ఎలాంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి, అన్ని జిల్లా పోలీసులు, బిహార్ పోలీసులకు చెందిన పలు ఇతర విభాగాలను కఠిన నిఘా, అత్యంత అప్రమత్తత పాటించాలని ఆదేశించాం. దీని కోసం ఏరియా డామినేషన్ పెట్రోలింగ్, తనిఖీలను ముమ్మరం చేశాము," అని ఆయన అన్నారు.
బిహార్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని అన్ని పర్యాటక ఆకర్షణ కేంద్రాల వద్ద భద్రతను పెంచారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల వద్ద కూడా భద్రతను పటిష్టం చేశారు.
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్ కోసం మొత్తం 1,625 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ను మోహరించారు.
బిహార్ ఎన్నికల రెండో దశ పోలింగ్- పార్టీల వారీగా..
మంగళవారం పోలింగ్ జరగుతున్న 122 స్థానాల్లో, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్ కూటమి 49 సీట్లు గెలుచుకోగా, ఎన్డీఏ 66 సీట్లు దక్కించుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఐదు స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీ, ఒక స్వతంత్ర అభ్యర్థి చెరో స్థానం గెలుచుకున్నారు.
ఈసారి పార్టీల వారీగా పోటీ వివరాలు:
ఎన్డీఏ కూటమి:
భారతీయ జనతా పార్టీ: 53 స్థానాలు
జనతాదళ్ (యునైటెడ్) : 44
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) : 15
హిందుస్థాన్ అవామ్ మోర్చా(సెక్యులర్): 6
రాష్ట్రీయ లోక్ మంచ్: 4
ఇండియా కూటమి (మహాఘటబంధన్):
రాష్ట్రీయ జనతా దళ్: 72 స్థానాలు
కాంగ్రెస్: 37
వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ: 8
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ లెనినిస్ట్) లిబరేషన్ : 6
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా: 4
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్): 1
పొత్తులో అంతర్గత పోరు!
ఐతే, మహాఘటబంధన్ కూటమిలో అంతర్గత ఘర్షణ ఉంది. ఆరు స్థానాల్లో కూటమిలోని భాగస్వామ్య పార్టీలే ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి!
కర్గహర్ (సీపీఐ–కాంగ్రెస్)
నర్కటియాగంజ్ (ఆర్జేడీ–కాంగ్రెస్)
కహల్‌గావ్ (ఆర్జేడీ–కాంగ్రెస్)
సుల్తాన్‌గంజ్ (ఆర్జేడీ–కాంగ్రెస్)
చైన్‌పూర్ (ఆర్జేడీ–కాంగ్రెస్)
సికంద్రా (ఆర్జేడీ–కాంగ్రెస్)
రెండో దశలో ఎన్డీఏ కూటమి పనితీరుపై JD(U) పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. “మేము 30 నుంచి 35 స్థానాలు గెలుచుకోవాలని ఆశిస్తున్నాము... మొత్తంగా, ఎన్డీఏ 75-80 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది,” అని జేడీయూ ప్రతినిధి అభిషేక్ ఝా అన్నారు.
మరోవైపు, ప్రతిపక్ష కూటమి రెండో దశలో 90 స్థానాలు గెలుచుకుంటుందని ఆర్జేడీ ప్రకటించింది. “మొదటి దశలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగినట్లే, ఈసారి కూడా మార్పు కోసం, మెరుగైన బిహార్ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి వస్తారు,” అని ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ తివారీ అన్నారు.
ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత బిహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న ప్రకటిస్తారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


