...
...
Next Story

Bihar rape case : మర్మాంగంలో బుల్లెట్! బీహార్​ గ్యాంగ్​ రేప్​ కేసులో సంచలన విషయాలు..

Begusarai rape case : బీహార్‌లోని బెగుసరాయ్‌లో దారుణం జరిగింది. ఒక ఇంట్లోకి చొరబడిన ఐదుగురు దుండగులు ఓ వ్యక్తిని గదిలో బంధించి, అతని భార్యపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి మర్మాంగం నుంచి వైద్యులు ఒక బుల్లెట్, రాయి, కర్ర ముక్కను తొలగించడం ఈ ఘోర క్రూరత్వానికి అద్దం పడుతోంది!

Published on: Jun 19, 2026, 06:02:35 IST
Advertisement

దేశంలో మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండటం లేదని నిరూపించే ఘటన ఇది! బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత క్రూరమైన ఘట ఒకటి వెలుగుచూసింది. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన ఐదుగురు.. ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా, ఆమెపై నరరూప రాక్షసుల్లా విరుచుకుపడ్డారు. ఆమె మర్మాంగాల్లోకి బుల్లెట్, కర్ర ముక్క వంటి వాటిని దూర్చారు!

బీహార్​ గ్యాంగ్​ రేప్​ కేసులో షాకింగ్ విషయాలు..
బీహార్​ గ్యాంగ్​ రేప్​ కేసులో షాకింగ్ విషయాలు..

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి చూసి వైద్యులే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

అసలేం జరిగింది?

చకియా పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 11వ తేదీ రాత్రి ఈ అమానుషం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో ఆమె టాయిలెట్‌కు వెళ్లింది. అదే సమయంలో ఐదుగురు వ్యక్తులు బలవంతంగా ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ముందుగా ఆమె భర్తను ఒక గదిలో వేసి బయట నుంచి లాక్ చేశారు. ఆ తర్వాత టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన మహిళ నోరు నొక్కేసి, బలవంతంగా ఇంటి బయట ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు.

అక్కడ ఆ ఐదుగురు ఆమెపై దారుణంగా గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. ఆ సమయంలో బాధితురాలు గట్టిగా కేకలు వేయడానికి ప్రయత్నించడంతో, నిందితులు మరింత రెచ్చిపోయారు. బ్లేడుతో ఆమె ఛాతి, తొడ భాగాలపై విచక్షణారహితంగా కోసి గాయపరిచారు. ఆ క్రూరత్వాన్ని తట్టుకోలేక బాధితురాలు స్పృహ కోల్పోయింది.

వైద్య పరీక్షల్లో షాకింగ్ నిజాలు!

వారి బారి నుంచి తప్పించుకున్న తర్వాత బాధితురాలు తన తోటికోడలికి సమాచారం అందించింది. ఆమె వచ్చి గదిలో బంధించిన భర్తను బయటకు తీసి, పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసుల సూచన మేరకు బాధితురాలిని మొదట బరౌని ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలి మర్మాంగం నుంచి ఒక లైవ్ బుల్లెట్ (తుపాకీ గుండు), ఒక రాయి, అలాగే ఒక కర్ర ముక్కను వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. దాడి జరిగిన సమయంలో నిందితులు ఎంతటి పాశవికత్వానికి ఒడిగట్టారో ఈ ఘోరమే సాక్ష్యంగా నిలుస్తోంది. తాను స్పృహ కోల్పోవడం వల్ల నిందితులు తన శరీరంలో ఆ వస్తువులను చొప్పించిన విషయం తనకు తెలియదని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది.

మూడు నెలల క్రితమే హెచ్చరించినా.. పోలీసుల నిర్లక్ష్యం!

ఈ దారుణానికి సంబంధించి బాధితురాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల క్రితమే ముగ్గురు నేరస్థులు తమ ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని ఆమె పేర్కొంది. ఆ సమయంలో కూడా తనపై లైంగిక దాడికి ప్రయత్నించి, ఇంట్లోని డబ్బు, నగలు దోచుకెళ్లారని చెప్పింది. అప్పుడే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఇంత పెద్ద ఘోరం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ దిగ్భ్రాంతికర ఘటనపై డీఎస్పీ ఆనంద్ కుమార్ పాండే స్పందించారు. ఈ కేసులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ వేగంగా సాగుతోందని ఆయన తెలిపారు. బాధితురాలి అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆమె ప్రైవేటు భాగం నుంచి బుల్లెట్‌ను తొలగించిన మాట వాస్తవమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, పాత కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే గనుక సంబంధిత అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks