Crime news : రైలు సూట్‌కేస్‌లో దుర్వాసన- తెరిచిన పోలీసులే షాక్! కుళ్లిపోయిన మానవ అవయవాలు.. అసలేం జరిగింది?
ఆగ్రా రైలులో సూట్‌కేస్‌లో లభ్యమైన మృతదేహపు అవయవాల మిస్టరీని పోలీసులు చేధించారు. చెన్నైకి చెందిన హయుతాన్ నిషా హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఆగ్రా రైల్వే స్టేషన్‌లో రైలులోని ఓ సూట్‌కేస్‌లో కుళ్లిపోయిన స్థితిలో మానవ అవయవాలు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. ఈ భయానక ఘటన వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే దిశగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చెన్నైలోని ఒక ఇంటిని పోలీసులు గుర్తించారు.

పోలీసులు విచారణలో భాగంగా మృతురాలిని ఒడిశాకు చెందిన 38 ఏళ్ల హయుతాన్ నిషాగా గుర్తించారు. నిందితులు ఆమెను అత్యంత క్రూరంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలు ఏం జరిగింది?
ఆగస్టు 5న చెన్నై సెంట్రల్ నుంచి న్యూదిల్లీ వెళ్లే రైలు బయలుదేరింది. మార్గం మధ్యలో ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఓ సూట్‌కేస్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆ సూట్‌కేస్‌ను తెరిచి చూడగా కుళ్లిపోయిన మానవ అవయవాలు బయటపడ్డాయి.
ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టిన ఆగ్రా రైల్వే పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ఇద్దరు నిందితులను గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని చెన్నై సెంట్రల్ రైల్వే పోలీసులకు అందించారు. ఫుటేజ్ ఆధారంగా చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో అదే తరహా ట్రాలీ బ్యాగ్‌తో రైలు ఎక్కిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో వెలుగుచూసిన అసలు నిజాలు..
నిందితులను మానిక్ ఉద్దీన్ లష్కర్, భగవతి మాఝిగా పోలీసులు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసుల సహాయంతో చెన్నైలోని ఓ ప్రాంతంలో వారు ఉంటున్న ఇంటిని తనిఖీ చేశారు. ఆ ఇంటిని సోదా చేయగా, వంట పాత్రలో మరిన్ని కుళ్లిపోయిన మానవ అవయవాలు లభించడం కలకలం రేపింది.
"మేము అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాము. నిందితులు ఇద్దరినీ పట్టుకున్న తర్వాతే ఈ హత్య వెనుక అసలు ఉద్దేశం ఏమిటో బయటపడుతుంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఆ అవయవాలు ఒకే వ్యక్తికి చెందినవా లేదా అనేది స్పష్టమవుతుంది," అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.
బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
కురుక్షేత్రలో మరో దారుణం..
మరోవైపు హరియాణా కురుక్షేత్రలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం క్రూరమైన నేరానికి దారితీసింది. భర్తను భార్యే కడతేర్చడమే కాకుండా, అతని పొట్ట కోసి అవయవాలు బయటకు తీసింది! ఆ తర్వాత భయంతో ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా ధంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, తన భార్య విమలా దేవితో కలిసి కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో ఉన్న రాజ్ ప్యాలెస్ సమీపంలో గత ఏడాది కాలంగా అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. రాజేష్ స్థానిక వాటర్ ట్రేడింగ్ కంపెనీలో సప్లై డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. వీరికి పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
అసలు ఆ రోజు ఏం జరిగింది?
ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటల సమయంలో రాజేష్ ఇంట్లో గట్టిగా అరుస్తున్న కేకలు వినిపించాయని ఇంటి యజమాని రింకు తెలిపారు. ఏంటని వెళ్లి చూడగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఏదో క్రైమ్ సినిమాలోని దృశ్యాన్ని తలపించేలా రాజేష్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి ఆయన భయపడిపోయాడు.
రాజేష్ పొట్ట భాగం తీవ్రంగా గాయపడి ఉండగా, బయటకు వచ్చిన అతని ప్రేగులను విమలా దేవి ఒక సంచిలో సర్దుతుండటాన్ని యజమాని కళ్లారా చూశాడు. యజమానిని చూడగానే ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురై ఒక్కసారిగా భవనం పైకెక్కి టెర్రస్‌పై నుంచి కిందికి దూకేసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిందితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతుండగా, ఆమె నుంచి వాంగ్మూలం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదికలో విస్తుపోయే నిజాలు..
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మూడు వేర్వేరు పరిమాణాల్లో ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురీందర్ సింగ్ తన పోలీసు బృందంతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు.
రాజేష్ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో అత్యంత భయానక విషయాలు వెలుగు చూశాయి. రాజేష్ పొట్ట భాగం పదునైన ఆయుధాలతో సుమారు 35 సెంటీమీటర్ల మేర కోసుకుందని, దీనివల్ల ప్రేగులు బయటికి వచ్చాయని తేలింది. అంతేకాకుండా ఆయన శరీరంలోని కాలేయం (లివర్)లో ఎక్కువ భాగం, కుడి కిడ్నీ మాయమైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ అవయవాలు ఏమయ్యాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. విమలా దేవి సాంప్రదాయ వైద్యం, చేతబడులు (ఎక్సార్సిజం) వంటి వాటితో సంబంధం కలిగి ఉంది. అయితే ఈ దారుణ హత్యకు గల అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మహిళ ఆరోగ్య పరిస్థితి మెరుగైతే ఆమె ఇచ్చే వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళతామని అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


