...
...
Next Story

అధిక పెన్షన్‌పై బొంబాయి హైకోర్టు కీలక తీర్పు.. ప్రైవేట్ ఉద్యోగులకు భారీ ఊరట

ప్రైవేట్ ఉద్యోగుల అధిక పెన్షన్ దరఖాస్తులను ఈపీఎఫ్ఓ తిరస్కరించడంపై బొంబాయి హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీ పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలను సాకుగా చూపి అర్హులైన ఉద్యోగులకు అధిక పెన్షన్ నిరాకరించడానికి వీల్లేదని తేల్చిచెప్పిన కోర్టు, 8 వారాల్లో దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చింది.

Published on: Oct 24, 2026, 14:38:54 IST
Advertisement

ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్-95) కింద అధిక పెన్షన్ పొందాలని భావిస్తున్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు బొంబాయి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. కంపెనీల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్ట్ నిబంధనలలో పరిమితులు ఉన్నాయనే ఏకైక కారణంతో ఉద్యోగులు సమర్పించిన జాయింట్ ఆప్షన్ దరఖాస్తులను నిరాకరించే హక్కు ఈపీఎఫ్ఓకు లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

అధిక పెన్షన్‌పై బొంబాయి హైకోర్టు కీలక తీర్పు.. ప్రైవేట్ ఉద్యోగులకు భారీ ఊరట
అధిక పెన్షన్‌పై బొంబాయి హైకోర్టు కీలక తీర్పు.. ప్రైవేట్ ఉద్యోగులకు భారీ ఊరట

ఇటీవల (అక్టోబర్ 19, 2026న) వెలువరించిన తీర్పులో జస్టిస్ సందీప్ వి. మార్నె ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. యాబాట్ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్, రేమండ్ స్టీల్, బీఈఎస్టీ అండర్‌టేకింగ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన 40 మందికి పైగా ప్రైవేట్ ఉద్యోగుల దరఖాస్తులను తిరస్కరిస్తూ ఈపీఎఫ్ఓ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. బాధితులు దాఖలు చేసిన జాయింట్ ఆప్షన్ అప్లికేషన్లను పునఃపరిశీలించి, రాబోయే 8 వారాల్లోగా ఆమోదించాలని ఈపీఎఫ్ఓను ఆదేశించింది.

పింఛను వాటా.. జాయింట్ ఆప్షన్ అంటే ఏమిటి?

సాధారణంగా ఉద్యోగి, యజమాని ఇద్దరూ కలిసి పీఎఫ్ ఖాతాకు వాటా జమ చేస్తారు. యజమాని చెల్లించే వాటాలో ఒక భాగం ఈపీఎస్ (ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్) ఖాతాకు చేరుతుంది. నిబంధనల ప్రకారం పెన్షన్ గణనకు ప్రభుత్వపరంగా ఒక గరిష్ఠ వేతన పరిమితి (స్టాట్యుటరీ వేజ్ సీలింగ్) ఉంటుంది. ఈ పరిమితిని 2014లో నెలకు రూ.15,000గా సవరించగా, 2026 సెప్టెంబర్ 17 నుంచి రూ.25,000కు పెంచారు.

అయితే, పరిమితి కంటే ఎక్కువ జీతం పొందుతూ, పూర్తి వేతనంపై పీఎఫ్ విరాళాలు చెల్లించిన అర్హులైన ఉద్యోగులు అధిక పెన్షన్ ఎంచుకునే అవకాశం ఉంది. పరిమితితో సంబంధం లేకుండా, పొందుతున్న పూర్తి వేతన ప్రాతిపదికన పెన్షన్ లెక్కించాలని కోరుతూ ఉద్యోగి, యజమాని ఇద్దరూ కలిసి ఈపీఎఫ్ఓకు ఇచ్చే దరఖాస్తునే 'జాయింట్ ఆప్షన్' అంటారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలకు రూ.40,000 వేతనం పొందుతూ, అదే మొత్తంపై పీఎఫ్ కట్ అవుతుంటే, అతడు అర్హతల ఆధారంగా అధిక పెన్షన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ తిరస్కరణకు కారణమేంటి?

పిటిషనర్ల తరఫున న్యాయవాది సురానా వాదనలు వినిపిస్తూ, ఈ అంశంపై సుప్రీంకోర్టు 'సునీల్ కుమార్ బి' కేసులో ఇప్పటికే స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. మినహాయింపు పొందిన, పొందని సంస్థల ఉద్యోగులిద్దరూ చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు.

"పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలు కేవలం ప్రావిడెంట్ ఫండ్‌కు మాత్రమే వర్తిస్తాయి. అధిక వేతనంపై పెన్షన్ పొందే ఉద్యోగి హక్కును అవి ఏ రకంగానూ నిరోధించలేవు" అని జస్టిస్ సందీప్ వి. మార్నె తన తీర్పులో పేర్కొన్నారు.

మరోవైపు రికార్డుల్లో ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సక్షమ అధికారి ఈ దరఖాస్తులను తిరస్కరించారని ఈపీఎఫ్ఓ తరఫు న్యాయవాది గాంధీ కోర్టులో వాదించారు.

ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం, ఇతర హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. "పిటిషన్లన్నీ అనుమతించదగినవే. పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలు కేవలం పీఎఫ్ డిపాజిట్ల వరకే పరిమితమవుతాయి. చట్ట ప్రకారం ప్రత్యేక మినహాయింపు ఉంటే తప్ప పెన్షన్ విషయంలో వీరంతా సాధారణ ఉద్యోగులతో సమానులే" అని జస్టిస్ మార్నె స్పష్టం చేశారు.

"యజమాని విరాళంపై పరిమితి ఉందనో, ట్రస్ట్ నిబంధనల్లో అధిక పెన్షన్‌కు అవకాశం లేదనో, లేదా గరిష్ఠ పరిమితికి మించిన వేతనంపై పెన్షన్ విరాళాలు జమ చేయలేదనో సాకులు చెబుతూ జాయింట్ ఆప్షన్‌ను తిరస్కరించడానికి వీల్లేదు" అని తీర్పులో పేర్కొన్నారు.

అలాగే, యజమానుల వద్ద పాత రికార్డులు లభ్యం కాని పక్షంలో ఉద్యోగులకు నేరుగా మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు.

తీర్పుతో వచ్చిన మార్పులు ఇవే

ఈపీఎస్ 1995లోని పేరా 11(3), 11(4) ప్రకారం అధిక వేతనంపై పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు దాఖలు చేసిన అప్లికేషన్లను తిరస్కరిస్తూ ఈపీఎఫ్ఓ జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ కోర్టు రద్దు చేసింది. బాధితుల జాయింట్ ఆప్షన్లను 8 వారాల్లోగా ఆమోదించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సైతం ఇందులో ప్రామాణికంగా తీసుకుంది.

ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందా?

ఈ తీర్పు రాగానే ప్రైవేట్ ఉద్యోగులందరికీ స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌గా) అధిక పెన్షన్ వచ్చేస్తుందని భావించకూడదు. ఉద్యోగులు ఈపీఎస్ నిబంధనల ప్రకారం నిర్ణీత అర్హతలను కలిగి ఉండాలి. అవసరమైన విరాళాల చెల్లింపులు క్రమబద్ధంగా జరిగి ఉండాలి. కేవలం 'కంపెనీ పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలు' అనే ఒకే ఒక్క నెపంతో అర్హులైన ఉద్యోగులను తిరస్కరించకూడదని మాత్రమే హైకోర్టు స్పష్టం చేసింది.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. దీనికి సంబంధించిన తాజా అధికారిక అప్‌డేట్ల కోసం సంబంధిత పోర్టల్‌ను చూడగలరు.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks