World's tallest buildings : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా ఆధిపత్యం- టాప్ 5 ఇవి..
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా 828 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రెండొవ స్థానంలో ఉన్న భవనం కంటే ఇది 150 మీటర్లకు పైగా ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని టాప్ 5 స్కైస్క్రేపర్ల వివరాలు ఇక్కడ చూద్దాము..
ఆకాశాన్ని తాకేలా భవనాలు, నగరాల అందాలను మరింత పెంచే నిర్మాణాలు ఎప్పుడూ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. కాగా గగనతలాన్ని తాకే ఈ ఎత్తైన భవనాల రేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ప్రముఖ నగరం దుబాయ్‌లో ఉన్న 'బుర్జ్ ఖలీఫా' తన ఆధిపత్యాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. 828 మీటర్ల (2,717 అడుగులు) అద్భుతమైన ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా ఇది చరిత్ర సృష్టిస్తూనే ఉంది. 2010లో నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రికార్డును మరే ఇతర భవనం కూడా బ్రేక్ చేయలేకపోయింది.

రెండొవ స్థానంలో ఉన్న భవనం కంటే బుర్జ్ ఖలీఫా ఏకంగా 150 మీటర్లకు పైగా ఎత్తులో ఉండి, ప్రపంచ స్కైస్క్రేపర్ రేసులో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎత్తైన నిర్మాణాల రూపకల్పనలో అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రసిద్ధ ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సంస్థ 'స్కిడ్‌మోర్, ఓవింగ్స్ & మెర్రిల్' (ఎస్ఓఎం) ఈ నిర్మాణాన్ని రూపొందించింది. ఈ భవనం విలక్షణమైన 'వై' ఆకారపు ఫ్లోర్ ప్లాన్ గాలి తీవ్రతను తట్టుకునేలా అత్యంత సాంకేతిక నైపుణ్యంతో ఇంజనీరింగ్ చేశారు. ఆధునిక సాంకేతికత, సాంస్కృతిక సంప్రదాయాల మేళవింపుగా రూపొందిన బుర్జ్ ఖలీఫా కేవలం రికార్డుల భవనమే కాకుండా గ్లోబల్ ఆర్కిటెక్చర్‌కే ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది.
ప్రపంచంలోని టాప్-5 ఎత్తైన భవనాలు ఇవే!
మెర్డెకా 118 (మలేషియా):
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఉన్న 'మెర్డెకా 118' 678.9 మీటర్ల (2,227 అడుగులు) ఎత్తుతో ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన భవనంగా నిలిచింది. అంతేకాకుండా ఆగ్నేయాసియాలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా ఘనత సాధించింది. అనేక కోణాలు ఉన్న వజ్రం ఆకారపు ఫ్రంట్ డిజైన్ (ఫాసాడ్), చివరన ఉండే పదునైన స్పైర్ దీనికి ప్రధాన ఆకర్షణ. ఆసియా వాస్తుశిల్పంలో ఇది ఒక మైలురాయి అయినప్పటికీ, బుర్జ్ ఖలీఫా ఎత్తుతో పోలిస్తే ఇది చాలా వెనుకబడే ఉంది.
షాంఘై టవర్ (చైనా):
చైనాలోని ప్రసిద్ధ షాంఘై నగరం ఉన్న 'షాంఘై టవర్' 632 మీటర్ల (2,073 అడుగులు) ఎత్తుతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. 128 అంతస్తులు కలిగిన ఈ భవనం చైనాలోనే అత్యంత ఎత్తైనది. ఒక మోలికలా మెలికలు తిరిగినట్లు ఉండే దీని వెరైటీ డిజైన్ భవనానికి ఆకర్షణీయమైన లుక్‌ను ఇవ్వడమే కాకుండా ఈదురుగాలుల ఒత్తిడిని తట్టుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఉపయోగంలో ఉన్న అంతస్తుల ఎత్తు పరంగా చూస్తే, 587.4 మీటర్ల ఎత్తులో ఉన్న ఎగువ అంతస్తుతో ఇది ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది.
మక్కా రాయల్ క్లాక్ టవర్ (సౌదీ అరేబియా):
సౌదీ అరేబియాలోని పుణ్యక్షేత్రం మక్కాలో ఉన్న 'మక్కా రాయల్ క్లాక్ టవర్' 601 మీటర్ల (1,972 అడుగులు) ఎత్తుతో నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గడియారపు స్తంభంగా (క్లాక్ టవర్), అత్యంత పెద్ద గడియార ముఖభాగం ఉన్న నిర్మాణంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. పవిత్ర హరమ్ మసీదుకు సమీపంలో ఉన్న అబ్రాజ్ అల్-బైత్ ప్రాంగణంలో భాగమైన ఈ భవనం, మక్కాను దర్శించుకునే యాత్రికులకు హోటల్‌గా, ఒక ఐకానిక్ గుర్తుగా సేవలుందిస్తోంది.
ఇక చైనా షెన్జెన్లోని పింగ్ ఎన్ ఫైనాన్స్ సెంటర్.. ఈ లిస్ట్‌లో 5వ స్థానంలో ఉంది. దీని ఎత్తు 599మీటర్లు. ఇందులో 115 ఫ్లోర్లు ఉంటాయి. దీనిని 2017లో పూర్తి చేశారు.
2010 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భారీ స్కైస్క్రేపర్లు నిర్మితమైనప్పటికీ, ఏదీ కూడా బుర్జ్ ఖలీఫా ఎత్తును అందుకోలేకపోయాయి. ఆకాశహర్మ్యాల నిర్మాణ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పిన ఈ భవనం, ఇంజనీరింగ్ రంగంలో మానవ మేధస్సుకు ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


