Success Story : జయహో సారా! చూడలేదు, వినలేదు- కానీ క్లాస్ 12లో 98.7శాతం మార్కులు..
Sarah Moin : లక్నోకు చెందిన 19 ఏళ్ల సారా మోయిన్ అసాధారణ ప్రతిభను కనబరిచింది! కంటి చూపు, వినికిడి లోపం ఉన్నప్పటికీ ఐఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో 98.75 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. సవాళ్లను ఎదురించి సాధించిన ఈ విజయంపై ప్రత్యేక కథనం.
మనుషులకు ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది లక్నోకు చెందిన సారా మోయిన్. పట్టుదల ఉంటే శారీరక వైకల్యం కేవలం ఒక అడ్డంకి మాత్రమే తప్ప, గమ్యానికి ముగింపు కాదని ఈ 19 ఏళ్ల యువతి చాటి చెప్పింది. చూడలేని, వినలేని సారా.. ఐఎస్సీ క్లాస్ 12 ఫలితాల్లో ఏకంగా 98.75 శాతం మార్కులు సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచింది.

సారాకు కంటి చూపు లేదు, వినికిడి శక్తి లేదు. వీటికి తోడు ‘సార్కోయిడోసిస్’ అనే అరుదైన వ్యాధితో కూడా ఆమె పోరాడుతోంది. ఇన్ని ఇబ్బందుల మధ్య సాధారణ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేయడం అసాధ్యమనిపించినా, ఆమె ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
మార్కుల వర్షం.. రెండు సబ్జెక్టుల్లో వందకు వంద!
పీటీఐ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం.. సారా స్కోరుకార్డు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. జియోగ్రఫీ, మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ వంటి క్లిష్టమైన సబ్జెక్టుల్లో ఆమె 100కు 100 మార్కులు సాధించింది. ఇక మిగిలిన సబ్జెక్టులలోనూ అదే జోరు కొనసాగించింది.
ఇంగ్లీష్: 98
హిస్టరీ: 97
సైకాలజీ: 96
ఎస్‌యూపీడబ్ల్యూ, కమ్యూనిటీ సర్వీస్ విభాగాల్లో 'ఏ' గ్రేడ్ సాధించి తన ఆల్ రౌండ్ ప్రతిభను నిరూపించుకుంది.
సాంకేతిక పరిజ్ఞానమే ఆమెకు చూపు.. వినికిడి!
సాధారణ తరగతి గదులు, పుస్తకాలు సారాకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి కావు. కానీ టెక్నాలజీ ఆమె లోటును భర్తీ చేసింది! ‘బ్రెయిలీ డిస్ప్లే’, ‘ఆర్బిట్ రీడర్’ వంటి అత్యాధునిక అసిస్టివ్ టెక్నాలజీ సాధనాలను ఆమె ఉపయోగించింది. ఇవి డిజిటల్ కంటెంట్‌ను స్పర్శ ద్వారా చదవగలిగేలా మారుస్తాయి. వీటి సహాయంతోనే సారా కంప్యూటర్‌ను స్వతంత్రంగా ఆపరేట్ చేస్తూ, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ విజ్ఞానాన్ని ఒడిసిపట్టింది. ఆమె చదువులో క్రైస్ట్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ రాకేష్ ఛత్రీ, స్పెషల్ ఎడ్యుకేటర్ సల్మాన్ అలీ ఖాజీలు అడుగడుగునా తోడుగా నిలిచారు.
లక్ష్యం ఐఏఎస్.. అడ్డంకిగా మారిన పరీక్షా నిబంధనలు
"సారాకు ఐఏఎస్ అధికారిణి కావాలని ఉంది. ముఖ్యంగా వికలాంగ బాలల కోసం పనిచేయాలని ఆమె ఆశిస్తోంది," అని సారా తండ్రి మోయిన్ అహ్మద్ ఇద్రీసీ గర్వంగా చెబుతున్నారు. అయితే, ఆమె లక్ష్యానికి ప్రస్తుత పరీక్షా నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"సారా లాంటి అంధ-బధిర (డెఫ్ అండ్ బ్లైండ్) అభ్యర్థులకు పరీక్షల్లో కేవలం 'స్క్రైబ్' (బదులుగా రాసేవారు)ను మాత్రమే అనుమతించడం సరిపోదు. ఆమె చెప్పే విషయాలను స్క్రైబ్ పూర్తిగా అర్థం చేసుకుని పేపర్ మీద పెట్టలేకపోవచ్చు. అందుకే ఆమెకు ల్యాప్‌టాప్‌లు లేదా బ్రెయిలీ డిస్ప్లేలు వాడేందుకు పరీక్షా బోర్డులు అనుమతించాలి," అని ఇద్రీసీ విజ్ఞప్తి చేశారు.
గతంలో 10వ తరగతిలోనూ సారా 94 శాతం మార్కులతో సత్తా చాటింది! ఇప్పుడు 12వ తరగతిలో సాధించిన ఈ విజయం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని సారా సాగిస్తున్న ఈ ప్రయాణం, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప పాఠం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


