...
...
Next Story

Car insurance : మీ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసిందా? నో క్లెయిమ్ బోనస్ ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి!

Car insurance tips : కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గడువు దాటిపోతే నో క్లెయిమ్ బోనస్ (ఎన్​సీబీ) రద్దవుతుందా? ఐఆర్‌డీఏఐ నిబంధనలు, 90 రోజుల గ్రేస్ పీరియడ్ సహా ఇతర వివరాలను ఇక్కడ పరిశీలించండి..

Published on: Aug 30, 2026, 10:45:34 IST
Advertisement

సొంత కారు ఉన్న ప్రతీ ఒక్కరూ వాహన భద్రతతో పాటు ఇన్సూరెన్స్ పాలసీ గడువు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్‌పైరీ తేదీ దాటకుండా ముందస్తుగానే రెన్యూవల్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ప్రమాదాల వేళ జరిగే ఆర్థిక నష్టాలతో పాటు ఏళ్ల తరబడి మీరు కష్టపడి సంపాదించుకున్న 'నో క్లెయిమ్ బోనస్' (ఎన్​సీబీ) ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.

నో క్లెయిమ్ బోనస్ (ఎన్​సీబీ) అంటే ఏంటి?

కారు ఇన్సూరెన్స్ నో క్లెయిమ్ బోనస్ వివరాలు..
కారు ఇన్సూరెన్స్ నో క్లెయిమ్ బోనస్ వివరాలు..

కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి 'నో క్లెయిమ్ బోనస్' ఒక బహుమతి లాంటిది. ఏడాది పొడవునా ఎటువంటి క్లెయిమ్ చేయకుండా సురక్షితంగా డ్రైవింగ్ చేసినందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంపై డిస్కౌంట్ రూపంలో ఈ బోనస్ ఇస్తాయి. మొదటి క్లెయిమ్-ఫ్రీ సంవత్సరానికి ప్రీమియంలో 20 శాతం మినహాయింపు లభిస్తే, వరుసగా ఐదేళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే ఈ డిస్కౌంట్ ఏకంగా 50 శాతానికి చేరుతుంది.

అయితే, చిన్నపాటి నష్టానికి కూడా క్లెయిమ్ చేస్తే ఈ బోనస్ కాస్తా శూన్యం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.

పాలసీ గడువు తీరితే ఎన్‌సీబీ వెంటనే రద్దవుతుందా?

చాలామంది పాలసీ గడువు ముగియగానే ఎన్‌సీబీ బోనస్ పోతుందని భావిస్తారు. కానీ భారత ఇన్సూరెన్స్ క్రమబద్ధీకరణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్​డీఏఐ) నిబంధనల ప్రకారం పాలసీ ఎక్స్‌పైర్ అయిన తర్వాత కూడా 90 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఈ 90 రోజుల వ్యవధిలో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ రీన్యూ చేసుకుంటే మీ పాత ఎన్‌సీబీ బోనస్‌ను మళ్లీ క్లెయిమ్ చేసుకోవచ్చు. 90 రోజులు దాటితే మాత్రం పొదుపు చేసుకున్న ఎన్‌సీబీ మొత్తం రద్దవుతుంది.

గడువులోగా ఇన్సూరెన్స్ రెన్యూ చేయకపోతే, ఆ మధ్య వ్యవధిలో ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని పూర్తిగా యజమానే భరించాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ కోసం దరఖాస్తు చేస్తే, కంపెనీలు ముందుగా కారును ప్రత్యక్షంగా తనిఖీ చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా అదనపు సర్వే రుసుములు పడే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై వాహనం నడపడం మోటార్ వాహనాల చట్టం ప్రకారం తీవ్ర నేరం. ఇది భారీ ట్రాఫిక్ చలాన్లకు, చట్టపరమైన చిక్కులకు దారితీస్తుంది. అందుకే పాలసీ గడువు ముగియడానికి కనీసం 60 రోజుల ముందే రెన్యూవల్ ప్రక్రియ ప్రారంభించాలని ఐఆర్‌డీఏఐ సూచిస్తోంది. దీనివల్ల కేవలం ప్రీమియం ఆధారంగా కాకుండా ఐడీవీ, డిడక్టబుల్స్, యాడ్-ఆన్ కవరేజీలను సరిపోల్చుకుని ఉత్తమ పాలసీని ఎంచుకునేందుకు తగిన సమయం లభిస్తుంది.

కారు మారినా ఎన్‌సీబీ మీతోనే!

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఎన్‌సీబీ అనేది వాహనానికి కాదు, వాహన యజమానికి అనుసంధానమై ఉంటుంది. అంటే మీరు పాత కారు అమ్మేసి కొత్త కారు కొన్నా లేదా వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారినా, తగిన ఆధారాలు సమర్పించి మీ వద్ద ఉన్న నో క్లెయిమ్ బోనస్‌ను కొత్త పాలసీకి సులభంగా బదిలీ చేసుకోవచ్చు!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks