గూగుల్ నుంచి సరికొత్త ‘కెరీర్ డ్రీమర్’ టూల్.. మీ కలలను నిజం చేసుకోండి!
విద్యార్థులు, ఉద్యోగుల కోసం గూగుల్ 'కెరీర్ డ్రీమర్' అనే వినూత్న ప్లాట్‌ఫారమ్‌ను తీసుకొచ్చింది. మీ నైపుణ్యాలను గుర్తించి, సరైన కెరీర్ బాటను ఎంచుకోవడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది!
కెరీర్ విషయంలో అయోమయంలో ఉన్నారా? ఏ ఉద్యోగం మీకు సెట్ అవుతుందో తెలియక సతమతమవుతున్నారా? అయితే మీకోసం గూగుల్ ఒక అద్భుతమైన వార్తను తీసుకొచ్చింది! విద్యార్థులు, కెరీర్ ప్రారంభంలో ఉన్నవారు, అలాగే చేస్తున్న వృత్తిని మార్చుకోవాలనుకునే వారి కోసం ‘కెరీర్ డ్రీమర్’ అనే సరికొత్త ఆన్‌లైన్ టూల్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమ ప్రొఫెషనల్ లైఫ్ గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది దిశానిర్దేశం చేస్తుంది!

కెరీర్ డ్రీమర్ ఎలా పనిచేస్తుంది?
ఈ గూగుల్ కొత్త ప్లాట్‌ఫారమ్ యూజర్లను ఒక క్రమపద్ధతిలో గైడ్ చేస్తుంది. మీరు ప్రస్తుతం చేస్తున్న పని ఏంటి? గతంలో ఎక్కడ పనిచేశారు? వంటి వివరాలను అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా, మీరు చేసిన పనులు, మీకున్న నైపుణ్యాలను ఈ టూల్ విశ్లేషిస్తుంది.
అనంతరం, మీ బలాబలాలు, ఎక్స్‌పీరియెన్స్‌ని క్రోడీకరిస్తూ ఒక 'కెరీర్ ఐడెంటిటీ స్టేట్‌మెంట్'ను రూపొందిస్తుంది ఈ గూగుల్ కెరీర్ డ్రీమర్.
అనంతరం మీ ప్రొఫైల్‌కు సరిపోయే విభిన్న కెరీర్ మార్గాలను కూడా ఇది సూచిస్తుంది.
కెరీర్ డ్రీమర్- వృత్తి వివరాలు క్షుణ్ణంగా..
ఏదైనా ఒక కొత్త ఉద్యోగం గురించి ఆలోచించినప్పుడు మనకు ఎన్నో సందేహాలు వస్తాయి. వాటిని నివృత్తి చేసేలా కెరీర్ డ్రీమర్ ప్రతి రోల్ గురించి కీలక వివరాలను అందిస్తుంది:
సగటు జీతం ఎంత ఉండవచ్చు?
ఆ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు ఏంటి?
పనిలో రాణించాలంటే ఏ ఏ అంశాలపై దృష్టి పెట్టాలి?
ఆ వృత్తిలో ఒక సాధారణ రోజు ఎలా గడుస్తుంది?
భవిష్యత్తులో ఎదిగేందుకు ఉన్న అవకాశాలు ఏంటి?
అంతేకాకుండా, గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లెర్నింగ్ రిసోర్సెస్‌ను కూడా దీనికి అనుసంధానించింది. 'Learn More' పై క్లిక్ చేయడం ద్వారా ఆ ఉద్యోగానికి కావాల్సిన కోర్సులు, నైపుణ్యాలను యూజర్లు నేర్చుకోవచ్చు!
గూగుల్ కెరీర్ డ్రీమర్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మీ అనుభవమే మీ బలం!
"కెరీర్ ప్రయాణం ఎప్పుడూ ఒకే సరళరేఖలా సాగదు. కానీ మీ జీవిత అనుభవాలు మీకు ఒక సూపర్ పవర్ లాంటివి. యజమానులకు కావాల్సిన ఎన్నో విలువైన నైపుణ్యాలు మీలో ఉంటాయి. ఆ నైపుణ్యాలను గుర్తించి, కొత్త అవకాశాలను చాలా సరళంగా, ఉత్సాహంగా అన్వేషించేందుకు కెరీర్ డ్రీమర్ తోడ్పడుతుంది," అని గూగుల్ పేర్కొంది.
కెరీర్ డ్రీమర్ ప్రత్యేకతలు:
మీ వృత్తిపరమైన కథను రూపొందించుకోండి: మీ నైపుణ్యాలు, అనుభవంతో కూడిన 'కెరీర్ ఐడెంటిటీ స్టేట్‌మెంట్'ను తయారు చేసుకోవచ్చు.
కెరీర్ అవకాశాలను అన్వేషించండి: మీ బ్యాక్‌గ్రౌండ్‌కు సరిపోయే ఉద్యోగాలను గుర్తించి, వాటిని అంచనా వేయవచ్చు.
తదుపరి అడుగు వేయండి: మీ లక్ష్యాలను చేరుకోవడానికి 'జెమినీ' సాయంతో ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు.
మొత్తానికి, గూగుల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త వ్యవస్థ ద్వారా నిరుద్యోగులు, విద్యార్థులు తమ కెరీర్ ప్రయాణాన్ని మరింత స్పష్టతతో ప్రారంభించే అవకాశం దక్కింది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


