...
...
Next Story

చక్కెర వ్యాపారులకు కేంద్రం షాక్: నిల్వల పరిమితి సగానికి తగ్గింపు

రాబోయే పండుగల సీజన్‌లో చక్కెర ధరలకు కళ్లెం వేయడంతో పాటు అక్రమ నిల్వలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద ఉండే చక్కెర నిల్వల పరిమితిని 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తూ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Sep 1, 2026, 16:53:10 IST
Advertisement

పండుగల సీజన్‌ ప్రారంభమవుతున్న వేళ దేశంలో చక్కెర అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు తమ వద్ద ఉంచుకోగలిగే చక్కెర నిల్వల పరిమితిని సగానికి తగ్గించింది.

చక్కెర వ్యాపారులకు కేంద్రం షాక్: నిల్వల పరిమితి సగానికి తగ్గింపు
చక్కెర వ్యాపారులకు కేంద్రం షాక్: నిల్వల పరిమితి సగానికి తగ్గింపు

ప్రస్తుతమున్న 4,000 క్వింటాళ్ల పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తూ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చి నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. సరుకు అందిన రోజు నుంచి 30 రోజులకు మించి నిల్వ ఉంచకూడదనే పాత నిబంధన కూడా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అక్రమ నిల్వలపై నిఘా.. కఠిన చర్యలు

దేశవ్యాప్తంగా చక్కెర మిల్లులు, హోల్‌సేల్ వ్యాపారుల వద్ద జరిపిన భౌతిక తనిఖీల్లో భారీగా అక్రమ నిల్వలు, లెక్కల్లో చూపని సరుకు, విక్రయాల్లో అక్రమాలు వెలుగుచూశాయి. దీంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గతంలో చక్కెర ధరలు వేగంగా పెరగడంతో ఆగస్టు 1న వ్యాపారులపై 4,000 క్వింటాళ్ల నిల్వ పరిమితి విధించారు. తాజాగా జరిపిన తనిఖీల అనంతరం దాన్ని మరింత తగ్గించారు.

ప్రభుత్వ జోక్యంతో ఇప్పటికే హోల్‌సేల్ మార్కెట్‌లో చక్కెర ధరలు తగ్గుముఖం పట్టాయి. లభ్యత పెరిగేలా చర్యలు తీసుకోవడంతో ఎక్స్-మిల్ ధరలు దాదాపు 20 శాతం మేర తగ్గాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కోల్‌కతాకు మినహాయింపు

కోల్‌కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం 4,000 క్వింటాళ్ల పరిమితిని యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కోల్‌కతాకు చక్కెర సరఫరా అవుతుందని, అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు సరుకు వెళ్తుందనే కారణంతో ఈ మినహాయింపునిచ్చారు.

నెల రోజులుగా వరుస నిర్ణయాలు

చక్కెర మార్కెట్‌ను అదుపు చేసేందుకు కేంద్రం నెల రోజులుగా వరుస చర్యలు చేపడుతోంది. ఆగస్టు 1న వ్యాపారుల నిల్వలపై 4,000 క్వింటాళ్ల పరిమితి విధించగా, సెప్టెంబర్ 1 నుంచి భారీ పారిశ్రామిక వినియోగదారులకూ నిబంధనలు వర్తింపజేసింది. నెలకు 10 టన్నులకు పైగా చక్కెర వాడే పరిశ్రమలు 15 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంచుకోవాలని స్పష్టం చేసింది.

సెప్టెంబర్‌తో ముగిసే 2025-26 చక్కెర సీజన్‌లో ముగింపు నిల్వలు (Closing stocks) తక్కువగా ఉండవచ్చన్న ఆందోళనలు, వర్షాకాలం ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు ధరల పెరుగుదలకు దారితీశాయి. జులైలో ప్రభుత్వం తొలిసారి చర్యలు చేపట్టినప్పుడు, మహారాష్ట్రలో ఎక్స్-మిల్ ధర టన్నుకు రూ. 38,000 నుంచి రూ. 42,000 వరకు పెరిగింది.

"దేశవ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ఆహార, ప్రజా పంపిణీ శాఖ పోర్టల్ ద్వారా వ్యాపారులు తమ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి" అని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యల ద్వారా మార్కెట్‌లో చక్కెర సరఫరా సజావుగా సాగుతుందని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో సరుకు లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks