పండుగల వేళ తీపికి చేదు షాక్.. చక్కెర ధరలు ఎందుకు మండుతున్నాయ్?
నెలకు క్రితం కేజీ ₹45 ఉన్న చక్కెర ధర ఆకస్మాత్తుగా ₹65కు చేరింది. దిగుబడి తగ్గడం, ఇథనాల్ తయారీకి చెరకును దారి మళ్లించడం, వ్యాపారుల నిల్వలే దీనికి కారణమా? ధరల కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక విశ్లేషణ.
పండుగల సీజన్ దగ్గరపడుతున్న వేళ సామాన్యుడిపై ధరల భారం పడింది. గత నెలలో కిలో ₹45 ఉన్న చక్కెర ధర ఒక్కసారిగా పెరిగి ఆగస్టు 26 నాటికి ₹65కు చేరుకుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ఏడాది వ్యవధిలోనే చక్కెర ధరలు ఏకంగా 41 శాతం పైగా ప్రియమయ్యాయి. పండుగల సమయంలో వినియోగం సాధారణంగానే ఎక్కువగా ఉండే వేళ, ఈ సడన్ షాక్‌కు కారణమేంటి? పంట దిగుబడి తగ్గడమా? లేదా ఇథనాల్ తయారీకి చెరకును దారి మళ్లించడమా? మార్కెట్ వర్గాల కథనం ప్రకారం అసలు కారణాలను పరిశీలిద్దాం.

ధరల పెంపునకు ప్రధాన కారణాలేంటి?
2023-24, 2024-25 సీజన్లలో వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. చెరకు పంట ఉత్పత్తి అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. క్రితం ఏడాది ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంటకు రెడ్ రాట్ (ఎర్ర కుళ్ళు) తెగులు సోకడం, మహారాష్ట్రలో వర్షపాతం హెచ్చుతగ్గుల వల్ల చక్కెర ఉత్పత్తి బాగా పడిపోయింది.
క్రిసిల్ ఇంటెలిజెన్స్ (ఆగస్టు 25) నివేదిక ప్రకారం.. 2023-24లో 3.2 కోట్ల టన్నులు (32 మిలియన్ టన్నులు) ఉన్న చక్కెర ఉత్పత్తి, 2024-25 నాటికి 2.6 కోట్ల టన్నులకు పడిపోయింది. ప్రస్తుతం నడుస్తున్న 2025-26 సీజన్లో ఉత్పత్తి 2.8 కోట్ల టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు. మన దేశంలో వార్షిక వినియోగం 2.8 కోట్ల నుంచి 2.9 కోట్ల టన్నుల మధ్య ఉంటుంది. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసం ఏర్పడటంతో పెద్ద కొనుగోలుదారులు, వ్యాపారులు నిల్వలు పెంచుకోవడం ధరల మంటకు కారణమైంది. అదే సమయంలో మిల్లులు ఇథనాల్ తయారీకి ఎక్కువ మొత్తంలో చెరకును మళ్లించడంతో మార్కెట్లో సాధారణ వినియోగానికి లభ్యత తగ్గింది.
ఇథనాల్ వైపు ఎంతమొత్తం మళ్లింది?
క్రిసిల్ విశ్లేషణ ప్రకారం గత ఐదేళ్లలో ఇథనాల్ తయారీకి ఉపయోగిస్తున్న చక్కెర పరిమాణం గణనీయంగా పెరిగింది. 2019-20 సీజన్లో 8 లక్షల టన్నులు (0.8 ఎంటీ) మాత్రమే ఉన్న మళ్లింపు, 2025-26 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 30 లక్షల టన్నులు (3 ఎంటీ) దాటింది. ఒకవైపు దిగుబడి తగ్గి, మరోవైపు ఇథనాల్‌కు కేటాయింపులు పెరగడం, దీనికితోడు మద్దతు ధరల వల్ల చెరకు సాగు వ్యయం పెరగడం ధరల పెరుగుదలకు దారితీసింది.
అయితే చక్కెర పరిశ్రమల సంఘం (ఐఎస్‌ఎంఏ) ఈ వాదనను తోసిపుచ్చింది. "ప్రస్తుతం ఇథనాల్ తయారీకి వాడే ముడిసరుకులో 75 శాతం వరకు మొక్కజొన్న, మిగులు బియ్యం వంటి ధాన్యాల నుంచే వస్తోంది. చక్కెర ఆధారిత వనరుల వాటా కేవలం 25 శాతమే," అని ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) ఆగస్టు 24న ప్రకటన విడుదల చేసింది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రాజెక్టు వల్ల చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగై, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలుగుతున్నామని స్పష్టం చేసింది.
ఇతర కారణాలు.. తప్పుడు అంచనాలు
సీజన్ ప్రారంభంలో దిగుబడి అంచనాలు తప్పుకావడం కూడా ఈ పరిస్థితులకు దారితీసింది. ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని భావించి తొలుత ఎగుమతులకు, ఇథనాల్ తయారీకి ఎక్కువ మొత్తంలో అనుమతులు ఇచ్చారు. మే నెలలో ఎగుమతులపై నిషేధం విధించే నాటికే దాదాపు 7 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు వెళ్లిపోయింది. నిల్వలు తగ్గి ధరలు పెరగడంతో ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం 10 లక్షల టన్నుల ముడి చక్కెరను పన్ను రహిత దిగుమతికి (Duty-free imports) అనుమతించాల్సి వచ్చింది.
మరోవైపు పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (ఈ20) లక్ష్యాన్ని మరింత పెంచాలని పరిశ్రమలు ఒత్తిడి తెస్తున్నాయి. కానీ పౌల్ట్రీ రంగానికి కీలకమైన మొక్కజొన్న, నిత్యావసరమైన చక్కెర లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా జీవ ఇంధనాలను మితిమీరి ప్రోత్సహిస్తే ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ధరల కట్టడికి కేంద్రం చర్యలు
పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 10 లక్షల టన్నుల దిగుమతులకు అనుమతి ఇవ్వడంతో పాటు, పెద్ద వ్యాపారులపై స్టాక్ పరిమితులు విధించింది. సెప్టెంబర్ నుంచి బల్క్ కొనుగోలుదారులు 15 రోజులకు మించిన అవసరమైన స్టాక్‌ను నిల్వ ఉంచడానికి వీల్లేదని ఆదేశించింది.
అలాగే అక్టోబరులోనే చెరకు గానుగ ఆడింపు (Crushing) ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్రాలకు, మిల్లులకు సూచించింది. వ్యాపారులు, మిల్లుల వద్ద నిల్వల భౌతిక తనిఖీలను విస్తృతం చేస్తూ పారదర్శకమైన నివేదికలు కోరుతోంది. "వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి 1.5 నుంచి 2 నెలలకు సరిపడా నిల్వలను దాగడంతోనే మార్కెట్లో సప్లై తగ్గినట్లు భ్రమ ఏర్పడింది," అని ఐఎస్‌ఎంఏ వెల్లడించింది.
ముందున్న సవాళ్లేంటి?
పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో ప్రభావం, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షభావ పరిస్థితులు రాబోయే సీజన్‌పై ప్రభావం చూపే అవకాశముంది. అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే 2026-27 సీజన్‌కు సంబంధించిన అధికారిక ఉత్పత్తి అంచనాలను పరిశ్రమ ఇంకా వెల్లడించలేదు.
రాబోయే 2026-27 సీజన్లో ఉత్పత్తి 2.88 కోట్ల టన్నులుగా ఉండవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ఇది గత సీజన్ (2.81 కోట్ల టన్నులు) కంటే స్వల్పంగా ఎక్కువ. ఆగస్టు 21 నాటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో చెరకు సాగు విస్తీర్ణం 58.4 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ, గత ఐదేళ్ల సగటు (54.2 లక్షల హెక్టార్లు) కంటే ఎక్కువే.
రాబోయే రోజుల్లో చక్కెర ధరలు ఎలా ఉంటాయనేది 2026-27 సీజన్లో వచ్చే అసలు దిగుబడి, ఎల్ నినో ప్రభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలోనే సరైన దిగుబడి అంచనాలు వేస్తే ఇథనాల్ తయారీకి ఎంత కేటాయించాలనే దానిపై స్పష్టత వస్తుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


